Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఈడు గోల్డ్ ఎహే – టైమ్‌పాస్ ‘ట్విస్ట్’!

Eedu Gold Ehe review

విడుదల తేదీ : అక్టోబర్ 07, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : వీరూ పోట్ల

నిర్మాత : రామ బ్రహ్మం సుంకర

సంగీతం : సాగర్ మహతి

నటీనటులు : సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్..


కమెడియన్‌ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎంతగానో తపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమధ్యే ‘జక్కన్న’ అనే సినిమాతో మెప్పించేందుకు వచ్చినా, ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్‌‌కు ఒక హిట్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఆశలన్నీ ‘ఈడు గోల్డ్ ఎహే’పైనే పెట్టుకున్నారు. ట్రైలర్‌తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈడు గోల్డ్ ఎహే ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

బంగార్రాజు (సునీల్) ఎవ్వరూ లేని ఓ అనాథ. నచ్చిన చోటల్లా పనిచేసుకుంటూ వెళ్ళే బంగార్రాజు ఎక్కడ పనిచేస్తే అక్కడ అతడి యజమానికి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి బంగార్రాజును తన పెద్ద కొడుకుగా జయసుధ చేరదీస్తుంది. జయసుధ కుటుంబంతో పాటే ఉండే బంగార్రాజు, ఆ ఇంటికి సంబంధించిన వ్యాపారమే చూస్తూంటాడు. కాగా ఇదే సమయంలో మహదేవ్ అనే ఇంటర్నేషనల్ బెట్టింగ్ క్రిమినల్ మనుషులతో పాటు చాలా మంది బంగార్రాజు వెంటపడుతుంటారు.

బంగార్రాజును సునీల్ వర్మలా భావిస్తూ అందరూ వెంటపడుతుంటారు. ఓ సమయంలో అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో సునీల్ వర్మను వెతుక్కుంటూ బంగార్రాజు ప్రయాణం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏమైంది? సునీల్ వర్మ ఎవరు? ఈ కథలో గీత (సుష్మా రాజ్), రిచా పనాయ్ ఎవరు? మహదేవ్‍కి, సునీల్ వర్మకి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఇబ్బందులన్నింటి నుంచీ బంగార్రాజు ఎలా బయటపడ్డాడన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈడు గోల్డ్ ఎహేకి ప్రధాన బలమంటే ట్విస్ట్‌లనే చెప్పాలి. సినిమా ఫ్లోలో ఇంటర్వెల్‌ అప్పుడు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. ఇవన్నీ ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో బాగా సెట్ అవ్వడం కూడా ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. ఇక కథ రీత్యా పుట్టిన కామెడీ కొన్నిచోట్ల నవ్వించింది. షకలక శంకర్ దొంగగా చేసే కామెడీ, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే పృథ్వీ అడల్ట్ కామెడీ, వెన్నెల కిషోర్ టీసీగా చేసే కామెడీ ఇలా ట్రాక్స్‌గా వచ్చే ఈ ఎపిసోడ్స్ అన్నీ బాగానే ఆకట్టుకున్నాయి.

హీరో సునీల్ ఎప్పట్లానే తన ఎనర్జీతో నటించేశాడు. కామెడీ పంచ్‌లు కూడా బాగానే పేలుస్తూ సునీల్ తన స్థాయికి తగ్గట్టు నటించాడు. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ నటన పరంగా ఫర్వాలేదనిపించినా, అందాల ప్రదర్శనతో బాగా మెప్పించారు. ఇక జయసుధ, అరవింద్, పృథ్వీ, నరేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేసి మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

మూడు, నాలుగు బలమైన ట్విస్ట్‌ల చుట్టూ అల్లిన కథను పక్కనబెడితే, కట్టిపడేసే స్థాయిలో స్క్రీన్‌ప్లే లేకపోవడమే ఈ సినిమాకు ప్రతికూలాంశం. ఆ ట్విస్ట్‌లు వచ్చే సందర్భాలు వాటికి ముందు సన్నివేశాలు మినహాయిస్తే మిగతా సినిమా బోరింగ్‌గానే నడిచింది. ఆ కాస్త బోరింగ్ సన్నివేశాలను కూడా జాగ్రత్తగా రాసుకొని స్క్రీన్‌ప్లే రెడీ చేసి ఉంటే ఈడు గోల్డ్ ఎహే స్థాయి వేరేలా ఉండేది. అలా లేకపోవడం వల్లే పడుతూ, లేస్తూ, పడుతూ లేస్తూ నడిచింది. సునీల్ హీరోగా మారినప్పట్నుంచీ ఆయన పాత్రలు చూస్తే, అన్నీ ఒకే తరహాలో సాగుతూంటాయి. ఈసారికి ఆ తరహా పాత్ర పూర్తిగా రొటీన్ అయిపోయినట్లే అనిపించింది.

ఫస్టాఫ్‌లో అసలు కథ మొదలవ్వడానికి చాలా సమయం తీసుకోవడాన్ని కూడా మైనస్‌గానే చెప్పాలి. ఇక హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా లేదు. పోసాని కృష్ణ మురళితో పాటు ఇతరత్రా కొన్ని సెపరెట్ కామెడీ ట్రాక్స్ కావాలని ఇరికించినట్లు అనిపించింది. విలన్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు వీరూ పోట్ల విషయానికి వస్తే, ఒక కామెడీ థ్రిల్లర్‌కు సరిపడా మంచి కథను, ట్విస్ట్‌లను పెట్టుకొని వాటితో చేయాల్సిన మ్యాజిక్ చేయలేకపోయాడనే చెప్పాలి. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే పకడ్బందీగా లేదు. అయినప్పటికీ ట్విస్ట్‌లన్నీ సినిమాగా బాగానే ఆకట్టుకుంటాయి. కొన్నిచోట్ల వీరూ పోట్ల మార్క్ కామెడీ కూడా బాగానే ఆకట్టుకుంది. స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా వేరే స్థాయిలో ఉండేది.

సాగర్ మహతి అందించిన పాటల్లో చెప్పుకోదగ్గ పాటలేవీ లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

‘ఈడు గోల్డ్ ఎహే’.. చెప్పుకోవడానికి మంచి కథ ఉండి, అదిరిపోయే ట్విస్ట్‌లు ఉన్నా కూడా వాటన్నింటినీ కలిపే బలమైన స్క్రీన్‌ప్లే లేకుండా వచ్చిన కమర్షియల్ సినిమా. పైన చెప్పిన ట్విస్ట్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్, కథతో సంబంధం లేకున్నా వచ్చే కామెడీ ట్రాక్స్ లాంటి మంచి కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ సినిమాలో మిగతా చోట్ల ఆ స్థాయిలో ఆకట్టుకోవడానికి ఏమీ లేకపోవడమే పెద్ద మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. టైమ్‌పాస్ చేసేలా ఉంది, ట్విస్ట్‌లు బాగున్నాయి, అయితే ‘ఈ సినిమా గోల్డ్ ఎహే’ అనే స్థాయిలో అయితే లేదు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :