సమీక్ష : ఘటన – సాగదీయబడిన రివెంజ్ డ్రామా!

Ghatana review

విడుదల తేదీ : నవంబర్ 18, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : శ్రీప్రియ

నిర్మాత : విఆర్ కృష్ణ. ఎమ్

సంగీతం : అరవింద్ శంకర్

నటీనటులు : నిత్యా మీనన్‌, క్రిష్ జె, నరేష్

‘దృశ్యం’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకురాలు శ్రీప్రియ డైరెక్ట్ చేసిన మరొక చిత్రం ‘ఘటన’. ’22 ఫిమేల్ కొట్టాయం’ అనే మలయాళం సినిమాని ‘మాలిని 22 పలయంకొట్టై’గా శ్రీప్రియ తమిళంలోకి రీమేక్ చేశారు. అదే సినిమాను ఇప్పుడు తెలుగులో ఘటన పేరుతో తీసుకొచ్చారు. నేడు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

మాలిని (నిత్యా మీనన్) అనే ఓ అమ్మాయి నర్సుగా పనిచేస్తూ కెనడా వెళ్లాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఆమె వరుణ్ (క్రిష్ జె) అనే అబ్బాయిని ప్రేమించి కొన్నాళ్ళకు అతనితో సహజీవనం సాగిస్తుంటుంది. అలా కాలం సాగిపోతుండగా నిత్యా, వరుణ్ బాస్ అయిన ప్రకాష్ (నరేష్) చేతిలో మానభంగానికి గురవుతుంది.

ఆ ఘటనతో మనస్తాపానికి గురైన మాలిని, ఆ ఊరు విడిచి వేరే ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఆమె అత్యాచారానికి గురై అన్యాయంగా డ్రగ్స్ కేసులో జైలుకి వెళుతుంది. అలా అన్యాయానికి గురై జీవితం కోల్పోయిన మాలిని తన జీవితాన్ని పాడు చేసిన వాళ్లపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. అలా ఒక ఒంటరి మహిళా ఎలా తన పగను తీర్చుకుంది అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది నిత్యామీనన్ నటన గురించి. అన్యాయంగా అత్యాచారానికి గురై నిస్సహాయ స్థితిలో ఉండి ఏమీ చేయలేక భాధపడే అమ్మాయిగా నిత్యా మీనన్ అద్భుతంగా నటించింది. ఆ భాధాకరమైన సన్నివేశాల్లో ఆమె నటన కట్టిపడేసిందని చెప్పొచ్చు.

అలాగే సీనియర్ నటుడు నరేష్ కూడా అనూహ్యమైన పాత్రలో కనిపించి థ్రిల్ చేశాడు. ఆ నెగెటివ్ రోల్ లో అతని నటన చాలా బాగుంది. నైపుణ్యం ఉన్న ఆయన, అలాంటి నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించడం బాగుంది. ఆయన పాత్ర ఉన్నది కొద్దిసేపే అయినా బలమైన ముద్ర వేసింది. క్లైమాక్స్ సాగదీసినా కూడా బాగానే ముగింపు ఇచ్చారు.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి సింగిల్ పాయింట్‌లో నడిచే సినిమాలన్నీ తక్కువ రన్‌టైమ్‌లో ఉంటే బాగుంటుంది. కానీ ఈ సినిమా మాత్రం కథంతా నెమ్మదిగా కదులుతూ, ఎక్కువ రన్‌టైమ్‌తో విసుగు పుట్టిస్తూ సాగింది. ముఖ్యంగా కథ మొదలవ్వడానికే ఎక్కువ టైమ్ పట్టడం మరీ విసుగు పుట్టించింది. కోవై సరళ తదితరుల నేపథ్యంలో వచ్చే కామెడీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు.

మళయాల వర్షన్‌లో బ్లాక్‌బస్టర్ అనిపించుకున్న సినిమాను తమిళ, తెలుగు భాషల్లోకి వచ్చేసరికి బోరింగ్‌గా తయారుచేశారు. కథలో ఎమోషన్ పండించడంలో సన్నివేశాలు ఎక్కడా విజయం సాధించలేదు. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను కూడా మరీ సాగదీయడం ఏమాత్రం ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికొస్తే అరవింద్ శంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే డైలాగులు కూడా బాగున్నాయి. ఇక స్క్రీన్ ప్లే అయితే చాలా నీరసంగా సాగుతూ సినిమాకి పెద్ద డ్రా బ్యాక్ గా నిలిచింది. ఒకే ఒక్క ట్విస్ట్ తప్ప మిగతా కథనంలో ఎక్కడా బలం లేదు. సినిమాని నడపడానికి డైరెక్టర్ శ్రీప్రియ అన్ని ప్రయత్నాలు చేసింది. మంచి కథనే చెప్పినప్పటికీ నిదానంగా సాగిన కథనం బోర్ కొట్టించింది. ఇక నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

మొత్తం మీద ఈ ‘ఘటన’ చిత్రం మహిళా సాధికారత మీద నడిచే చిత్రం. ఎంచుకున్న అంశం మంచిదే అయినప్పటికీ నీరసంగా సాగే కథనం వల్ల సినిమా బోర్ కొట్టింది. అదేవిధంగా హింసాత్మక సన్నివేశాలు ఎక్కువవ్వడం, కథలోని ఎమోషన్‌ను సన్నివేశాలు సరిగ్గా పండించలేకపోవడం లాంటి చాలా మైనస్‌లు ఉన్న ఈ సినిమాలో నిత్యా మీనన్‌ నటననే అతిపెద్ద ప్లస్‌గా చెప్పుకోవాలి. ఒక్క నిత్యామీనన్ నటన కోసం చూస్తే తప్ప ఆకట్టుకోడానికి ఇంకే అంశాలు లేని సినిమా ‘ఘటన’!

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :