ఆడియో సమీక్ష : గోవిందుడు అందరివాడేలే – ఫీల్ గుడ్ తెలుగు నేటివిటీ ఆల్బమ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మొట్ట మొదటి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ డైరెక్షన్ లో బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. గోవిందుడు అందరివాడేలే ఆడియో సెప్టెంబర్ 15న మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసారు. యువన్ శంకర రాజా మ్యూజిక్ అందించిన ఈ ఆడియో ఆల్బమ్ లో మొత్తం 6 పాటలున్నాయి. మరి ఆ ఆరు పాటలు ఏ తీరుగ ఉన్నాయనేది ఇప్పడు చూద్దాం…

1. పాట : నీలిరంగు చీరలోన

గాయకుడు : హరి హరన్

సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
ఆల్బంలో వచ్చే ఈ మొదటి పాట సోలో సాంగ్.. తాన్ననననన అంటూ సాగే కోరస్ తో బ్యాక్ గ్రౌండ్ లో ఏమో హార్మోనియం సౌండ్ తో మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే తబలా సౌండ్ తో పాట మొదలవుతుంది. నీలిరంగు చీరలోన అంటూ సాగే ఈ పాటని హరి హరన్ చాలా బాగా పాడాడు. పాటలో భావాన్ని వినేటప్పుడు పుట్టించేలా అతని వాయిస్ ఉంది. సుద్దాల అశోక్ తేజ్ ఈ పాటలో తన సహపత్ని గురించి పొగుడుతూనే, ఆ సహపత్నిని జీవితంతో పోలుస్తూ ఎంతో భావపూరితమైన సాహిత్యాన్ని అందించాడు. పాటలోని భావాన్ని ఏం మాత్రం పక్కకి పోనివ్వకుండా యువన్ శంకర్ రాజా హార్మోనియం, డప్పు, నగరాలతో వినసొంపుగా పాటని తీర్చిదిద్దాడు. మెలోడీ సాంగ్స్ ని ఆస్వాదించే వారికి ఈ పాట వెంటనే నచ్చేస్తుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ పాటని విజువల్ గా గ్రాండ్ గా ఉంటే ఆడియన్స్ స్క్రీన్ పై నుంచి చూపుతిప్పుకోలేరు.

2. పాట : గులాబీ కళ్ళు రెండు ముళ్ళు

గాయకుడు : జావేద్ అలీ

సాహిత్యం : శ్రీ మణి

‘గులాబీ కళ్ళు’ అంటూ సాగే ఈ పాట కూడా ఆల్బంలోని మరో సోలో సాంగ్. ఈ పాట ఎలక్ట్రిక్ గిటార్, పెర్క్యూషణ్ వాయిద్యాలతో ఫాస్ట్ బీట్స్ తో ఈ సాంగ్ మొదలవుతుంది. ఈ పాట హీరో హీరోయిన్ ని పొగుడుతూ తన అందాలను వర్ణిస్తూ పాడే పాటలో శ్రీ మణి అందించిన సాహిత్యం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. జావేద్ అలీ ఆ పాటలో భావాల్ని మిస్ అవ్వకుండా తన వాయిస్ లో పలికించాడు. ఈ పాటకి జావేద్ వాయిస్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇప్పటికే ఈ పాట విజువల్స్ ని రిలీజ్ చేసారు. యువన్ పాటని బీట్స్ తో స్టార్ట్ చేసి మధ్యలో లిరిక్స్ వినపడేలా స్లో చేసి మళ్ళీ బీట్స్తో కంపోజ్ చేసిన విధానం పాటకి బాగా సెట్ అయ్యింది. కావున ఈ పాత వినేటప్పుడు ఎంత ఆకట్టుకుంటుందో విజువల్ గా దానికన్నా బాగా ఆకట్టుకుంటుందని ఆశించవచ్చు. ఈ ఆల్బంలో వినగానే నచ్చే సాంగ్ ఇదే అవుతుంది..

3. పాట : రా రాకుమార

గాయని : చిన్మయి

సాహిత్యం : ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి

ఈ ఆల్బంలో వచ్చే మూడవ పాట రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్.. ఇది విజువల్ గా డ్యూయెట్ సాంగ్ అయినా చిన్మయి మాత్రమే పాడడం వలన సోలో సాంగ్ అని చెప్పుకోవచ్చు. రా రాకుమారా అంటూ సాగే ఈ పాటని హీరోయిన్ హీరోని ఇష్టపడుతూ ఊహించుకొని పాడుకునే సాంగ్.. దీనికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సందర్భానుసారంగా పాటకి బాగా సెట్ అయ్యింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా రొమాంటిక్ సాంగ్ కి సింక్ అయ్యేలా ఉంది. ఈ పాటలో రామ్ చరణ్ – కాజల్ కెమిస్ట్రీ హైలైట్ అవుతుందని ఆశించవచ్చు.

4. పాట : ప్రతిచోట నాకే స్వాగతం

గాయకుడు : రంజిత్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
ప్రతిచోట నాకే స్వాగతం అంటూ రజింత్ పాడిన ఈ పాట ఆల్బంలో నాల్గవ పాట. రామ్ చరణ్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. యువన్ శంకర్ రాజా చాలా క్రియేటివ్ గా ఈ ట్యూన్ కంపోజ్ చేశారు. డిస్కో బీట్స్, కాంటెంపరరీ సంగీతంతో మిక్స్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం లనదన్ లో పెరిగిన ఓ కుర్రాడి పాత్రలోని మనోభావాలను ప్రతిబించేలా ఉంది. ఈ పాట వింటుంటే అభిమానులకు, శ్రోతలకు 80వ దశకంలో చిరంజీవి నటించిన హిట్ సినిమా పాటలు గుర్తొస్తాయి. ఈ పాటకి చరణ్ నుంచి సింప్లీ బట్ సూపర్బ్ స్టెప్స్ ఉంటాయని ఆశించవచ్చు.

 

5. పాట : బావగారి చూపే

గాయనీ గాయకులు : రంజిత్, విజయ్ యేసుదాసు, సుర్ముకి, శ్రీ వర్ధిని

సాహిత్యం : చంద్రబోస్
ఇక ఆల్బంలో ఐదవ పాట అయిన బావగారి చూపే సాంగ్ రొమాంటిక్ ఫీల్ తో సాగుతుంది. పాట మొదలవగానే వచ్చే లేడీ వాయిస్ అందరినీ ఆకట్టుకుంటుంది. లిరిక్స్, సింగర్స్ వాయిస్, ట్యూన్ ప్రతి అంశం శ్రోతలను మొదటిసారి పాట వినగానే ఆకట్టుకుంటాయి. యువన్ శంకర్ రాజా, కృష్ణవంశీ పాటలో సినిమా కథను అంతర్లీనంగా చెప్పడానికి ప్రయత్నించారు. యువన్ అందించిన ట్యూన్ లో పల్లెటూరి వాతావరణం ప్రతిభింబించింది. బావ – మరదళ్ళ మధ్య సాగే ఈ పాట చూడడానికి మరింత ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది.

6. పాట : కొక్కోడి

గాయనీ గాయకులు : కార్తీక్, హరి చరణ్, మనసి, రిట

సాహిత్యం : లక్ష్మీ భూపాల్

డప్పు, గజల్స్, కీ బోర్డ్ సౌండ్స్ మిక్సింగ్ తో సాగే ఈ పాట సినిమాలో వచ్చే ఓ గ్రూప్ సాంగ్ గా ఉండే అవకాశం ఉంది. సాహిత్యం కాస్త మాస్ గా ఉండే ఈ పాటని లక్ష్మీ భూపాల్ పల్లెటూరి నేటివిటీకి తగ్గట్టు రాశారు. సినిమాలోని రెండు జంటల మధ్య సాగే పాటలో వాయిస్ లో మార్పుని చూపిస్తూ కార్తీక్, హరి చరణ్, మనసి, రిటల వాయిస్ ఈ పాటకి బాగా సెట్ అయ్యింది. ఈ పాటలో యువన్ శంకర్ రాజా వాడిన సన్నాయి వాయిద్యం సౌండ్ వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా అంతా పాటకి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ పాట విజువల్ గా మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.

 

తీర్పు :

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అచ్చ తెలుగు సాంప్రదాయాలతో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం. కావున యువన్ శంకర్ రాజా కూడా కథానుగుణంగా, కృష్ణవంశీ చెప్పిన సందర్భాలకు సరిపోయే విధంగా పాటలని కంపోజ్ చేసాడు. చెప్పాలంటే ఇలాంటి తరహా పాటలు చేయడం యువన్ కి ఇదే మొదటిసారని కూడా చెప్పవచ్చు. అయినప్పటికీ తను మెలోడియస్ గా కంపోజ్ చేసి తన పాటలతో ఆకట్టుకున్నాడు. నా పరంగా గులాబీ కళ్ళు రెండు, బావగారి చూపే, నీలిరంగు చీరలోన మరియు ప్రతిచోట నాకే స్వాగతం బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. కృష్ణవంశీ ఇలాంటి పాటలని తీయడంలో తన కంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఈ పాటలు వినేటప్పటి కంటే స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.

CLICK HERE FOR SONGS

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :