సమీక్ష : హితుడు – కంటెంట్ మంచిదే, కానీ..!

hithudu-review

విడుదల తేదీ : 11 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : విప్లవ్

నిర్మాత : కె.ఎస్.వి

సంగీతం : కోటి

నటీనటులు : జగపతి బాబు, మీరా నందన్ ..

 

ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు హీరోగా, మలయాళ భామ మీరా నందన్(జై బోలో తెలంగాణ ఫేం) హీరోయిన్ గా నటించిన సినిమా ‘హితుడు’. విప్లవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.ఎస్.వి నిర్మించాడు. ప్రస్తుతం సమాజంలో మనిషి అనే వాడు ఎలా ఉండాలి అనే పాయింట్ ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హితుడు ఏం చెప్పాడన్నది ఇప్పుడు చూద్దాం..
కథ :

‘హితుడు’ సినిమా మొదలయ్యేది భాగ్యనగంలో అయినా.. అసలు కథ మొదలయ్యేది మాత్రం ఇప్పటికీ బస్సులు సరిగా లేక, షావుకారి కనుసైగల్లో అన్నీ నడిచే పాడేరు అనే మారు మూల గ్రామమలో మొదలవుతుంది. నక్సలైట్స్ గ్యాంగ్ ఒకరైన సీతారాం(జగపతి బాబు) చదువుకుంది 8వ తరగతే అయినా, ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలంటే వారికి నేర్పించాల్సింది విప్లవ భావాలు, గన్ పట్టుకోవడంకాదని, చదువు నేర్పించి వికాసవంతుల్ని చేస్తే వారే ఈ సొసైటీని మారుస్తారని నమ్మే వ్యక్తి. అందుకే అడవి నుంచి బయటకి వచ్చి నక్సలైట్ సపోర్ట్ తో పాడేరులో పిల్లలకి చదువు చెప్పాలని స్కూల్ పెడతాడు.

అదే ఊర్లో అల్లరిగా తిరిగే ఆకతాయి అమ్మాయి అబ్బులు అలియాస్ అభిలాష(మీర నందన్). తనకి చదువు బాగా వస్తుండడంతో తనని బాగా చదివించాలనుకుంటాడు. అప్పుడే అభిలాష ఒక చిన్న సమస్యలో పడుతుంది. ఆ సమస్య నుంచి కాపాడి ఆ ఊరి నుంచి పంపేసి దూరంగా ఉంచి చదివిస్తాడు. అలా ఊరికి దూరంగా వెళ్ళిన అభిలాష ఏమైంది? ఆ తర్వాత సీతారాం ఏమయ్యాడు? చివరికి వారిద్దరూ లైఫ్ లో కలుసుకున్నారా? వారిద్దరూ కలుసుకున్నప్పుడు వారి మధ్య వచ్చిన విభేదాలు ఏమిటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

యంగ్ డైరెక్టర్ విప్లవ్ సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ ‘మనిషి అనే వాడు నా, నేను అనే ప్రపంచంలో బ్రతక కూడదు, మనతో పాటు మన తదుపరి తరం వారికి మార్గ నిర్దేశకుడిలా ఉండేలా చూసుకోవాలి. అలాగే మానవతా విలువల్లో వాస్తవానికి ఊహకి మధ్య ఉన్న తేడాని చెప్పడమే’ ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఆ పాయింట్ ని పలు సీన్స్ లో, మంచి డైలాగ్స్ తో బాగానే చెప్పాడు.

నటీనటుల్లో.. జగపతి బాబు మూడి డిఫరెంట్ గెటప్స్ లో తన పాత్రలో వైవిధ్యాన్ని చాలా బాగా చూపించాడు. తన పాత్ర వరకూ చాలా బాగా చేయడమే కాకుండా, ఆయన చేత చెప్పించిన డైలాగ్స్ చాలా అర్ధవంతంగా ఉన్నాయి. ఇక మీరా నందన్ ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిలా, కాలేజ్ స్టూడెంట్ లా, పెళ్ళైన భార్యలా.. ఇలా మూడు విభిన్న గెటప్స్ లో చాలా బాగా చేసింది. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. తనకి ఇచ్చిన పాత్రలో ప్రతి భావాన్ని చాలా చక్కగా పలికించింది. ఇక బెనర్జీ నక్సల్ పాత్రలో బాగా చేసాడు.

మైనస్ పాయింట్స్ :

‘హితుడు’ అనే సినిమా రెగ్యులర్ కమర్షియల్ జానర్లో వచ్చిన సినిమా కాదు.. కావున చినీఎ అభిమానులు ఆశించే రెగ్యులర్ తరహా కథ, ఎంటర్టైన్మెంట్ అనేటివి ఏమీ ఉండవు. కావున రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ విప్లవ్ అనుకున్న పాయింట్ అయితే బాగుంది, కానీ ఓవరాల్ కథలో చెప్పలేకపోయాడు. తను అనుకున్న పాయింట్ ని కొన్ని కొన్ని సీన్స్ లో డైలాగ్స్ రూపంలో మాత్రమే చెప్పగలిగాడు. ఓవరాల్ గా కథతో ట్రావెల్ ఉన్నప్పుడు మాత్రం ఓ లైన్ మీద వెళ్ళని పలు సబ్ ప్లాట్స్ కనపడతాయి. సరే మొదలెట్టిన ఆ సబ్ ఫ్లాట్స్ కన్నా క్లారిటీ ఇచ్చి ముగించారా అంటే అదీ లేదు. మార్పు తేవాలి అనుకున్న వారు పదుగురిలో తేవాలి అనుకుంటారు.. కానీ ఒక్కరి కోసమే లైఫ్ అంతా దారబోయడం అనేది కరెక్ట్ కాదు.

ఇక కథ పరంగా అసంపూర్తిగా అనిపించే ఈ సినిమా కథనం కూడా ఆసక్తికరంగా లేదు. సినిమా మొదలు పెట్టిన కొద్దిసేపటికే సినిమా స్టేటస్ ఏంటనేది అర్థమైపోతుంది. అలాగే నేరేషన్ కూడా చాలా చాలా స్లోగా ఉంటుంది. దీనికి తోడు సినిమా సుమారు రెండున్నర గంటలు ఉండడం సినిమాకి పెద్ద మైనస్. ఇదే కథని ఒకే లైన్ మీద కేవలం 2 గంటల్లో చెప్పి ఉంటే చాలా బాగుండేది. ఇకపోతే సెకండాఫ్ లో ఊరి కోసం కొన్నేళ్లుగా కొండను తవ్వుతూ ఉండే జగపతి బాబు సడన్ గా చివర్లో వదిలేసి వచ్చేస్తారు. అన్ని రోజులు ఆ ఊరి ప్రజల్లో రాణి మార్పు అక్కడ సడన్ గా ఎందుకు వస్తుంది అనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం. సినిమా పరంగా పాటలు కూడా సినిమా వేగాన్ని మరింత తగ్గిస్తాయి.

సాంకేతిక విభాగం :

సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందించిన పాటలు సినిమా చూస్తున్నప్పుడు పెద్దగా ఎక్కవు, కానీ నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. భరణి కె ధరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. వైజాగ్ లోని పల్లెటూరి లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ వర్క్ అంత బాలేదు. ఎక్కడా ఆయన షార్ప్ గా ఎడిట్ చేయాలని అనుకోలేదు. అందుకే సినిమా సాగుతూ సాగుతూ ఉన్న ఫీలింగ్ వస్తుంది.

ఇక కథ — స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విప్లవ్ విషయానికి వస్తే.. విప్లవ్ అనుకున్న స్టొరీ లైన్ బాగుంది కానీ దానిని కథగా చెప్పినప్పుడు ఆ ఒరిజినల్ లైన్ ని ఎక్కడో వదిలేసి పలు సబ్ ప్లాట్స్ పైకి వెళ్ళిపోవడం వలన ఓవరాల్ ఫిల్మ్ ద్వారా తను చెప్పాలనుకున్నది ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు. కథనం ఇకాస్త స్పీడ్ గా ఆసక్తికరంగా ఉండాల్సింది. డైలాగ్ రైటర్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సీన్స్ లో తన డైలాగ్స్ మనసుకు హత్తుకుంటాయి. ఇక డైరెక్టర్ గా తను అనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా లేకపోయినా అక్కడక్కడా కొన్ని సీన్స్ లో చెప్పగలిగాడు, అలాగే నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కె.ఎస్.వి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

జగపతి బాబు – మీరా నందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హితుడు’ సినిమా ఆర్ట్ సినిమాలు నచ్చే వారికి బాగా నచ్చుతుంది. అలాగే మానవతా విలువలకి అమితంగా ప్రాముఖ్యత ఇచ్చే వారికి ఈ ‘హితుడు’ బాగా నచ్చుతాడు. రెగ్యులర్ ఎంటర్టైనింగ్ సినిమాలు ఆశించే వారికి ఈ సినిమా నచ్చదు. విప్లవ్ అనుకున్న స్టొరీ లైన్, జగపతి బాబు – మీరా నందన్ ల సూపర్బ్ పెర్ఫార్మన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అయితే, కథా విస్తరణ, కథనం, స్లోగా సాగే నేరేషన్, సినిమా రన్ టైం చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా మానవతా విలువలున్న సినిమాలు చూసే వారు చూడదగిన సినిమా ‘హితుడు’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :