సమీక్ష : ఇంద్రసేన – ఒక్క కథే అయితే బాగుండేది

Balakrishnudu movie review

విడుదల తేదీ : నవంబర్ 30, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : జి. శ్రీనివాసన్

నిర్మాత : రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ

సంగీతం : విజయ్ ఆంటోని

నటీనటులు : విజయ్ ఆంటోని, డయానా చంపిక

తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘అన్నాదురై’ తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో ఈరోజే విడుదలైంది. విడుదలకు ముందే ఆడియో వేడుకలో 10 నిముషాలు ప్రదర్శితమై ఆసక్తిని నెలకొల్పిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఇంద్రసేన (విజయ్ ఆంటోని), రుద్రసేన (విజయ్ ఆంటోని) ఇద్దరూ ఒకేలా ఉండే అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇంద్రసేన ప్రేమ విఫలమై తాగుడుకు బానిసై బాధపడుతుంటాడు. అతని తమ్ముడు రుద్రసేన మాత్రం మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతుంటాడు.

అలాంటి తరుణంలోనే అనుకోకుండా ఇంద్రసేన ఒక హత్య కేసులో జైలుకు వెళతాడు. దాంతో అతని కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోతుంది. అలా చేయని తప్పులకు కష్టాలపాలైన ఇంద్రసేన, రుద్రసేనలు ఎలా తయారయ్యారు, చివరికి వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్లస్ పాయింట్ సహజత్వానికి దగ్గరగా అనే పాత్రలు. వాటిలో కూడా ప్రేమించిన అమ్మాయి దూరమై తాగుబోతుగా మారిన ఇంద్రసేన పాత్ర బాగుంటుంది. అందులో విజయ్ అంటోనీ నటన కూడా బాగుంది. ఆ పాత్ర చుట్టూ ఉండే మథర్ సెంటిమెంట్ కూడా కొంత వరకు ఆకట్టుకుంది. అలాగే ఫస్టాఫ్ లో ఇంద్రసేన, రుద్రసేనల మధ్యన ఉండే బ్రదర్ రిలేషన్ కొన్ని సన్నివేశాల్లో బాగుందనిపించింది.

ఇక ఇంటర్వెల్ సమయంలో వచ్చే చిన్నపాటి ట్విస్ట్ సెకండాఫ్ మీద అంచనాల్ని రేకెత్తించింది. ప్రేక్షకుడు ఊహించిన దానికి భిన్నంగా కథ మలుపు తిరగడం ఆసక్తికరంగా అనిపించింది. ఇక హీరో కుటుంబం చేయని తప్పులకు, మోసాలకు కష్టాల్లో కూరుకుపోవడం, వాటి వలన అన్నదమ్ముల జీవితాలు తారుమారవడం అనే పాయింట్ బాగుంది. అలాగే హీరో విజయ్ ఆంటోనీకి ఇచ్చిన హీరోయిక్ ఎలివేషన్, దానికి సంబందించిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ప్రాపర్ గా ఒక కథంటూ లేకపోవడమే పెద్ద డ్రా బ్యాక్. చిత్రం ఒక పాయింట్ మీద మొదలై ఇంటర్వెల్ సమయానికి ఇంకో మలుపు తీసుకుని సెకండాఫ్లో అనేక మలుపులు తిరుగుతూ కాసేపు ప్రేమ, ఇంకాసేపు యాక్షన్, కాసేపు బ్రదర్ సెంటిమెంట్ వంటి సబ్ ప్లాట్స్ నడవడంతో సినిమాని ఏ కోణం నుండి చూడాలో అర్థం కాక తికమక ఎదురైంది. ఇక ఫస్టాఫ్లో ఇంద్రసేన పాత్ర తాలూకు కొన్ని సీన్లు బాగానే ఉన్నా కథనం చాలా చాలా నెమ్మదిగా నడవడంతో బోర్ అనిపించింది.

అలాగే ఇంటర్వెల్ సమయంలో చిన్నపాటి ట్విస్ట్ ఎదురవడంతో సెకండాఫ్ సినిమా అంతా ఒకేలా యాక్షన్ తో నడుస్తుందనుకొంటే ఊహించని ట్రాక్స్ లోకి వెళ్లి భారీ నిరుత్సాహాన్ని కలిగించింది. దర్శకుడు జి.శ్రీనివాసన్ తనకు కావాల్సిన ప్రతి చోట అతిగా స్వేచ్ఛను వాడేసుకుని రాసిన సన్నివేశాలు, మలుపు సినిమాను పూర్తిగా కిందికి దించేశాయి. సరే ప్లాట్స్ ఎన్నైనా సన్నివేశాలైనా ఆసక్తికరంగా నడిచాయి అంటే అదీ లేదు. చాలా సన్నివేశాలు చాలా నెమ్మదిగా, నిస్సారంగా నడుస్తూ చిరాకు పెట్టాయి. ఇక డబ్బింగ్ పాటలు కూడా ఏమంత వినదగినవిగా లేవు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శ్రీనివాసన్ కేవలం ఒకే పాయింట్ మీద కథను రాసుకుని ఉంటే కనీసం సినిమా పర్వాలేదని స్థాయిలో అయినా ఉండేది. కానీ అలా చేయకుండా అనవసరంగా స్వేచ్ఛను వాడేసుకుని అనేకమైన ఉప కథల్ని సినిమాలోకి బలవంతంగా జొప్పించడంతో చిత్రం బోర్ కొట్టేసింది. ఇక విజయ్ అంటోనీ సంగీతం కూడా ఏంటా గొప్పగా లేదు.

యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని బాగున్నాయి. ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లోని కొన్ని అనవసరమైన ప్లాట్స్ ను తొలగించి ఉండాల్సింది. దిల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

ఒక ఖచ్చితమైం కథనంతో లేకుండా అనేక ఉప కథలతో నడిచే ఈ ‘ఇంద్రసేన’ చిత్రం అక్కడక్కడా పర్వాలేదనిపించినా ద్వితీయార్థంలో మాత్రం బాగా చికాకు పెట్టింది. ఫస్టాఫ్లోని కొన్ని సన్నివేశాలు, ఇంద్రసేన పాత్ర, ఇంటర్వెల్ ట్విస్ట్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా ఏమాత్రం క్లారిటీ, వేగంలేని కథనం, అనవసమైన సబ్ ప్లాట్స్ నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం అక్కడక్కడా మెప్పిస్తూ ఎక్కువ భాగం బోర్ కొట్టిస్తుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :