సమీక్ష : జక్కన్న – మాస్ కామెడీ!

సమీక్ష : జక్కన్న – మాస్ కామెడీ!

Published on Jul 29, 2016 8:57 PM IST
'Jakkanna review

విడుదల తేదీ : 29 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ

నిర్మాత : ఆర్. సుదర్శన్ రెడ్డి

సంగీతం : దినేష్

నటీనటులు : సునీల్, మన్నారా చోప్రా..

కమెడియన్‌గా సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఆయన హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేక ఆయన హీరో కెరీర్‌ను అయోమయంలో పడేశాయి. దీంతో మళ్ళీ ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాలన్న ప్రయత్నంలో భాగంగా ఆయన ‘జక్కన్న’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా అయినా సునీల్‌కు హిట్ తెచ్చేలానే ఉందా? చూద్దాం..

కథ :

గణేష్ /జక్కన్న (సునీల్).. తనకు సాయం చేసిన వారికోసం ఎంతదూరమైనా వెళ్ళి, వారి బాగుకోసం కష్టపడే మనస్థత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి వైజాగ్ సిటీకి పెద్ద రౌడీ అయిన భైరాగి (కబీర్ సింగ్) అనుకోకుండా ఒక సాయం చేస్తాడు. ఆ సాయానికి బదులుగా భైరాగి బాగుండాలని అతడి కోసం వెతుకుతూ గణేష్ వైజాగ్ వస్తాడు. గణేష్‌కి భైరాగి చేసిన సాయం ఏంటి? అసలు ప్రపంచానికి తానెవరో తెలీకుండా రౌడీయిజం చేసే భైరాగిని గణేష్ ఎలా కలుసుకుంటాడు? తనకు చేసిన సాయానికి బదులుగా భైరాగికి గణేష్ ఏం చేశాడు? ఈ కథలో సహస్ర (మన్నారా చోప్రా) ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

హీరో సునీల్‌నే ఈ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. మొదట్నుంచీ చివరివరకూ సినిమాను అంతా తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ.. ఇలా కమర్షియల్ హీరో ప్రయత్నాలన్నీ ఎప్పట్లానే బాగానే చేశాడు. ఇక మన్నారా చోప్రా నటన పరంగా ఫర్వాలేదనిపించింది. పాటల్లో, కొన్ని సన్నివేశాల్లో వీలైనంత అందాల ప్రదర్శన చేసింది. మన్నారా చోప్రా నుంచి ఈ అంశాలనే కోరి వచ్చేవారికి ఇదో ప్లస్ పాయింట్.

ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెడీ బాగుంది. సెకండాఫ్‌లో పోలీసాఫీసర్ కట్టప్ప పాత్రలో పృథ్వీ, నందమూరి నటసింహం బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. విలన్‌గా నటించిన కబీర్ సింగ్ కూడా బాగానే చేశాడు. సినిమా పరంగా చూసుకుంటే, సెకండాఫ్‌లో ట్విస్ట్ రివీల్ అయ్యాక ఒక ఇరవై నిమిషాల ఎపిసోడ్‌ను ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సప్తగిరి మాస్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది.

మైనస్ పాయింట్స్ :

సునీల్ లాంటి హీరోతో ఒక కామెడీ సినిమా చేయాలన్న ప్రయత్నంలో చాలాచోట్ల విఫలం కావడాన్ని ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఒక అర్థం లేని కథను, సాధారణ కథనంతో రెండు గంటలకు పైనే సాగే సినిమాగా నడిపించడంతో సినిమా కొన్నిచోట్ల బోరింగ్‌గా కనిపించింది. కామెడీ అని చెప్పి చాలాచోట్ల ఏవేవో ప్రయత్నాలు చేసినా, అవన్నీ బెడిసికొట్టి ఏమాత్రం నవ్వించలేకపోయాయి. హీరో పాత్ర నుంచి పుట్టే ఈ కథలో, అసలు హీరో పాత్రకు స్పష్టమైన అవగాహన లేకుండా చేయడం బాగోలేదు. ముఖ్యంగా తనకు సాయం చేసిన వారికి తిరిగి వాళ్ళు వద్దనే వరకూ సాయం చేసే లక్షణాలున్న హీరో పాత్రను స్పష్టంగా డిజైన్ చేయలేకపోయారు.

ఇక హీరో పాత్ర అలా ఉంటే, హీరోయిన్, విలన్ పాత్రలూ, ఆ పాత్రల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలూ అలాగే ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా అంతా గోలగోలగా, అయోమయంగా మారిపోయింది. పాటలు వినడానికి ఏమాత్రం బాగోలేకపోగా, అవి వచ్చే సందర్భాలు అంతకు మించి బాలేవు. ఇక డైలాగ్స్ కూడా ఈ సినిమాకు మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. అంతటా ప్రాసలతోనే తప్ప ఎక్కడా సరైన డైలాగ్స్ లేవు. ప్రాసల ద్వారానే కామెడీ పుడుతుందనే ఆలోచన అస్సలు బాగోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ సి. రాం ప్రసాద్ పనితనం బాగుంది. ఫస్టాఫ్‌లో విలన్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాల్లో రాం ప్రసాద్ పనితనం చూడొచ్చు. సంగీత దర్శకుడు దినేష్ ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడింది లేదు. ఆయన అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ఆకట్టుకునేలా లేవు. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఇక దర్శక, రచయిత ఆకెళ్ళ వంశీకృష్ణ గురించి చెప్పుకుంటే, ఒక కామెడీ సినిమాకు సరిపడే పాయింట్‌నే ఎంచుకున్నా దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో మాత్రం వంశీ కృష్ణ విఫలమయ్యాడు. ఆయన రాసిన స్క్రీన్‌ప్లేలో చెప్పుకోదగ్గ అంశాలు పెద్దగా ఏవీ లేవు. హీరోకి, విలన్‌కి లింక్ కుదర్చడం, పృథ్వీ కామెడీ, సునీల్ టైమింగ్‌ని కొన్నిచోట్ల వాడడం.. ఇలాంటి విషయాల్లో దర్శకుడిగా ఫర్వాలేదనిపించాడు. మేకింగ్ పరంగా వంశీ కృష్ణ పెద్దగా చేసిందేమీ లేదు.

తీర్పు :

కమర్షియల్ హీరో అంటే ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ చెప్పడం, ఎమోషన్ పండించడం, కామెడీ.. ఇలా ఆయా హీరోని పట్టి ఏయే అంశాలు ఉండాలో అవి మారిపోతూ ఉంటాయి. కమెడియన్ నుంచి కమర్షియల్ హీరోగా మారిన సునీల్, మొదట్నుంచీ తనకు బలమైన కామెడీనే నమ్ముకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాలోనూ ఆయన అదే తరహా కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే కథ, కథనాల్లో బలం లేకపోవడం, రొటీన్ సినిమా నెరేషన్‌లోనే పెద్దగా ఎగ్జైటింగ్ అంశాలు లేకపోవడం లాంటివి ఈ సినిమాను ముందుకు నడిపించలేక అడ్డంగా నిలిచాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సునీల్ కోసం, పృథ్వీ డైలాగ్స్‌తో సాగే మాస్ కామెడీ కోసం చూస్తే ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. ఒక పూర్తి స్థాయి కామెడీ సినిమా అనుభూతి పొందాలనుకొని ‘జక్కన్న’ను చూస్తే మాత్రం నిరాశ తప్పదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు