సమీక్ష : జానకి రాముడు – బోరింగ్ ప్రేమ కథ !

సమీక్ష : జానకి రాముడు – బోరింగ్ ప్రేమ కథ !

Published on Dec 16, 2016 12:55 PM IST
Janaki Ramdudu review

విడుదల తేదీ : డిసెంబర్ 16, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : తమ్మినీడు సతీష్ బాబు

నిర్మాత : ఎమ్.పి నాయుడు

సంగీతం : గిఫ్టన్ ఎలియాస్

నటీనటులు : నవీన్ సంజయ్, మౌర్యాని

ప్రేమ కథలకున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని అలాంటి సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో నూతన దర్శకుడు సతీష్ బాబు చేసిన ప్రయత్నమే ఈ ‘జానకి రాముడు’. నవీన్ సంజయ్, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈరొజేప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ ప్రేమ కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఒక పల్లెటూరిలో చదువుకునే కుర్రాడు రాము (నవీన్ సంజయ్) అదే ఊరిలో ఉంటూ తనతో పాటే చదువుకునే అమ్మాయి జానకి(మౌర్యాని)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. జానకి కూడా రాముని ప్రేమిస్తుంది. అలా ప్రేమలో ఉండగా రాము తాను ఎన్నాళ్లగానో అనుకుంటున్న లక్ష్యాన్ని గెలిచి గొప్ప పేరు తెచ్చుకుని జానకిని పెళ్లి చేసుకోవాలని అనుకుని హైదరాబాద్ వస్తాడు.

కానీ రాము తిరిగి తన ఊరికి వెళ్లేసరికి జానకి అతనికి దూరమవుతుంది. అసలు రాము ఏ లక్ష్యం కోసం హైదరాబాద్ వెళ్ళాడు ? ఆ లక్ష్యాన్ని గెలిచాడా లేదా ? జానకి రాముకి ఎలా దూరమైంది ? వాళ్ళ ప్రేమ చివరికి ఏమైంది ? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కించిన తీరు గురుంచి. అందమైన పల్లెటూరి లొకేషన్లను చాలా బాగా ఉపయోగించుకున్నారు. అనిల్ తన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ప్రతి ఫ్రెమ్ చూడ చక్కగా ఉంటూ ఆకర్షణీయంగా అనిపించింది. అలాగే ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి.

సినిమాలోని రెండు పాటల్లో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్,, కెమిస్ట్రీ చాలా బాగా కుదిరాయి. ఫస్టాఫ్ లో సుదర్శన్ చేత చేయించిన కామెడీ అక్కడక్కడా కాస్త పండింది. ఇక సెకండాఫ్ లో వచ్చే కీలకమైన ట్విస్ట్ సినిమాలోని చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లో ముఖ్యమైనది. ఊహించని ఆ మలుపు కాస్త థ్రిల్లింగా అనిపించింది. హీరో హీరోయిన్లు నవీన్ సంజయ్, మౌర్యాని తమ పాత్రల మేర బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది రొటీన్ ప్రేమ కథ గురించి. ఈ సినిమా కథ కూడా చాలా ప్రేమ కథల్లాగే రొటీన్ గా ఉంది. ఎక్కడా కొత్తదనమనేదే కనిపించలేదు. కొన్ని సన్నివేశాలైతే మరీ అసహజంగా ఉన్నాయి. కథ పాతదే అయినా కథనంలో పట్టు ఉంటే సినిమా నిలబడుతుంది. కానీ ఈ సినిమా కథనంలో అలాంటి పట్టు ఎక్కడా కనిపించలేదు. ఫస్టాఫ్ లో హీరో, అతని ఫ్రెండ్స్ మీద నడిచే చాలా సన్నివేశాలు ముఖ్యంగా సుబ్బు అనే పాత్ర మీద నడిచే సీన్లు మరీ చికాకు తెప్పించాయి.

అలాగే సెకండాఫ్ లో హీరో తన గోల్ సాదించే ప్రయత్నంలో చూపే సన్నివేశాలు ఏమాత్రం చూడటానికి ఆకర్షణీయంగా లేవు. ఆ సన్నివేశాల్లో ఎక్కడా ఇంటెన్సిటీ అనేదే కనిపించలేదు. ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాయి అన్నట్లు అనిపించాయి. సెకండాఫ్ కథనం కూడా ఏమంత ఆకట్టుకోలేదు. చాలా సినిమాల్లో చూసినట్టే రొటీన్ గా ఉండి విసుగు తెప్పించింది. ఈ భాగంలో ఒక థ్రిల్ మినహా మిగతా ఏవీ ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ బాగాలేకపోవడంతో సినిమా స్థాయి ఇంకాస్త కిందికి దిగిపోయింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికొస్తే దర్శకుడు, రచయితగా వ్యవహరించిన తమ్మినీడు సతీష్ బాబు ఎక్కడా కొత్తదనం చూపలేకపోయాడు. కథ పాతదే అయినా కనీసం కథనం అయినా కాస్త బలంగా రాసుకోవాల్సింది. అనిల్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలిచి రిలీఫ్ ఇచ్చింది. శ్రీమణి, అనంత శ్రీరామ్ లు కొన్ని పాటలకందించిన సాహిత్యం బాగుంది. గిఫ్టన్ ఎలియాస్ సంగీతం పరవాలేదనిపించింది. ఎడిటింగ్ బాగోలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
తీర్పు :

అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే ప్రేమ కథను నమ్ముకుని వచ్చిన సినిమానే ఈ ‘జానకి రాముడు’. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, కొన్ని పాటలు, సెకండాఫ్ లో వచ్చే ఒకే ఒక మలుపు, కాస్తో కూస్తో హీరో హీరోయిన్ల నటన, తక్కువ రన్ టైమ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా కథలో కొత్తదనం లేకపోవడం, కథనంలో పూర్తిగా పట్టు లోపించడం, బోరింగ్ రొటీన్ సన్నివేశాలు ఇందులో మైనస్ పాయింట్స్ . మొత్తం మీద చెప్పాలంటే ‘జానకి రాముడు’ అనే టైటిల్ చూసి అదిరిపోయే ప్రేమ కథ ఉంటుందనుకుని థియేటర్లలోకి వెళితే మాత్రం భారీ నిరుత్సాహం తప్పదు.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు