సమీక్ష : కబాలి – రజనీ సినిమా కాదిది!!

Kabali review

విడుదల తేదీ : 22 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : పా రంజిత్

నిర్మాత : కళైపులి థాను

సంగీతం : సంతోష్ నారాయణ్

నటీనటులు : రజనీ కాంత్, రాధికా ఆప్టే, ధన్సిక


‘కబాలి’.. కొన్ని నెలలుగా సౌతిండియన్ సినీ అభిమానులంతా ఈ పేరును కలవరించినంతగా మరే పేరును కలవరలించలేదేమో! సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ అనే సినిమా, టీజర్‌తో ఎవ్వరి ఊహకూ అందని ప్రభంజనం సృష్టించింది. ఇక అప్పట్నుంచి ఈ సినిమాపై మొదలైన అంచనాలన్నీ రోజు రోజుకీ పెరుగుతూ ఆకాశాన్నంటాయి. తమిళంలో రియలిస్టిక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న పా రంజిత్ తీసిన ఈ సినిమా ఈ భారీ అంచనాల మధ్యనే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకునేలానే ఉందా? చూద్దాం..

కథ :

కబాలి (రజనీ కాంత్).. మలేషియాలో ఓ పెద్ద గ్యాంగ్‍స్టర్. ఓ కేసులో పోలీసుల చేతికి చిక్కిన అతడు, 25 ఏళ్ళ పాటు జైలు జీవితం గడిపి, తిరిగి బయట ప్రపంచానికి అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. కబాలి బయటకు రావడంతోనే అతడ్ని చంపాలని ఏళ్ళుగా ఎదురుచూస్తున్న వాళ్ళంతా తిరిగి దాడి చేయడం మొదలుపెడతారు. ఇక 25 ఏళ్ళ క్రితం తాను దేనికోసమైతే పోరాడాడో ఆ సమస్య ఇప్పటికీ అలాగే ఉండడం గమనించిన కబాలి, మళ్ళీ తన గ్యాంగ్‍స్టర్ జీవితాన్ని మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఒక గొడవలో చనిపోయిన అతడి భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే) నిజంగానే చనిపోయిందా? చనిపోకపోతే ఆమె ఎక్కడుంది? రజనీ ఆమె దగ్గరకు చేరాడా? మలేషియాలో ఏళ్ళుగా అలాగే ఉన్న సమస్యపై కబాలి ఎలా పోరాడాడు? అసలు కబాలిని మొదట్లో గ్యాంగ్‍స్టర్‌గా మార్చిన పరిస్థితులు ఏంటి? చివరకు కబాలి కథ ఏమైందీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

రజనీ గతంలో చేసిన సినిమాలన్నింటిలానే ఈ సినిమాలోనూ ఆయన చరిష్మానే ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. ఓ వయసైన గ్యాంగ్‍స్టర్‌గా, కబాలి అనే పాత్రలో రజనీ స్టైల్, నటన అన్నీ టాప్ క్లాస్ అనేలా ఉన్నాయి. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ ఆవేశపరుడైన యువకుడిగానూ రజనీ చాలా బాగా ఆకట్టుకున్నాడు. రజనీ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆయన మ్యానరిజమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడు పా రంజిత్, మలేషియాలో జీవించే భారతీయుల బాగు కోసం పోరాడే సన్నివేశాలను, ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోని ప్రధానమైన ఎమోషన్‌ను చాలా బాగా క్యాప్చర్ చేయగలిగారు.

ఇక తాను అనుకున్న కథను ఎక్కడా అతికి పోనివ్వకుండా వీలైనంత వాస్తవికంగానే ఉండేలా చూసుకోవడంలో పా రంజిత్ సాహసాన్ని మెచ్చుకోవచ్చు. 25 ఏళ్ల తర్వాత జైలు నుంచి రజనీ తన ఇంటికి తిరిగి రావడం, ఎన్నో ఏళ్ళకు కనబడిన కూతురితో అతడి ప్రయాణం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ బలమైన ముద్ర వేశాయి. ఇక రజనీ భార్యగా నటించిన రాధికా ఆప్టే తన నటనతో కట్టిపడేశారు. ధన్సిక తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. విలన్స్‌గా నటించిన విన్‍స్టర్ చౌ, కిషోర్.. ఇద్దరూ మంచి ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా చౌ స్టైలిష్ నటన చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కథా వేగం చాలా నెమ్మదిగా నడవడాన్ని ప్రధానమైన ప్రతికూలాంశంగా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో సినిమా మరీ నెమ్మదిగా నడిచి చాలాచోట్ల బోర్ కొట్టించింది. అదేవిధంగా ఓ బలమైన కథాంశాన్నే ఎంచుకున్న దర్శకుడు, దాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు. ఇక రజనీ సినిమా అంటే ఆయన స్టైల్‌తో పాటు ఆయన ఇమేజ్‌కు సరిపడే అంశాలు కూడా ఉండాలన్నది ఏళ్ళుగా తెలియకుండానే ఓ అలవాటుగా మారిపోయింది. ఈ సినిమాలో అలాంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రజనీ అభిమానులను ఇది తీవ్రంగా నిరాశ పరిచే అంశమే!

ఇక ఈ సినిమాలో సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది పెద్దగా లేదనే చెప్పుకోవాలి. కేవలం కమర్షియల్ అంశాలను కోరుకునే వచ్చేవారికి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. క్లైమాక్స్‌ను కూడా మరీ వాస్తవికంగా ఉంచాలన్న ఉద్దేశంతో దర్శకుడు చేసిన సాహసం అభిమానులను ఆకట్టుకోదనే చెప్పాలి. ఇక తెలుగు ప్రేక్షకులకు సరిగ్గా పరిచయమున్న నేపథ్యం కాకపోవడం కూడా ఈ సినిమాకు ఓ ప్రతికూలాంశంగానే చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు పా రంజిత్, రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ ఉన్నా కూడా కథను సహజత్వంగానే చెప్పాలన్న ప్రయత్నం చేశాడు. ఇక్కడివరకూ మెచ్చుకోదగినదే. అయితే ఒక బలమైన కథాంశాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకూ కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో మాత్రం దర్శక, రచయితగా రంజిత్ చాలాచోట్ల విఫలమయ్యాడు. రజనీ స్థాయి ఇమేజ్‌ని అందుకోవడంలో దర్శకుడి ఆలోచన విధానం తేలిపోయింది. ఇవన్నీ అలా ఉంచితే మేకింగ్ పరంగా రంజిత్ చేసిన మ్యాజిక్‌ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. సౌండ్, కలర్, లైట్.. వీటన్నింటినీ కథ ఎమోషన్‌లో భాగంగా సరిగ్గా వాడడంలో రంజిత్ కొన్ని చోట్ల ఆకట్టుకున్నాడు. అయితే ఈ మేకింగ్ సినిమాకు కమర్షియల్‌గా ఉపయోగపడకపోవడమే నిరాశపరిచే అంశం.

సంతోష్ నారాయణ్ అందించిన ఆడియోలో ‘నిప్పు రా’ ఇట్టే ఎక్కేస్తుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సంతోష్ నారాయణ్ ప్రతిభను ఈ సాంకేతిక అంశాల పరంగా మేజర్ హైలైట్‌గా చెప్పుకోవాలి. జి.మురళి సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన సినిమాటోగ్రఫీ స్టైల్‌తో దర్శకుడి ఆలోచనకు, కథ మూడ్‌కు మురళి ఓ సరికొత్త రూపాన్నిచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. కళైపులి థాను నిర్మాణ విలువలకు ఎక్కడా వంకన్నదే పెట్టలేం.

తీర్పు :

‘కబాలి’.. రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్‌ని పెట్టుకొని ఓ వాస్తవిక కథతో సినిమా తీయాలన్న దర్శకుడు పా రంజిత్ ఆలోచన నుంచి పుట్టిన సినిమా. ఈ ఆలోచన మెచ్చుకోదగినదే అయినా, అలాంటి వాస్తవిక కథలోనూ, రజనీ ఇమేజ్‌కు సరిపడేలా సన్నివేశాలు పెట్టుకునే అవకాశం ఉంటుందని తెలిసీ, వాటి జోలికి పోకపోవడం ఈ సినిమా విషయంలో జరిగిన తప్పిదంగా భావించొచ్చు. రజనీ సినిమాలో ఏయే అంశాలు ఉంటాయనుకొని ప్రేక్షకులు ఆశించి వెళతారో అవన్నీ ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో లేవు. రజనీని పూర్తిగా కొత్తగా, ఓ రియలిస్టిక్ సినిమాలో చూడాలని కోరుకునే వారికి ఈ సినిమా నచ్చొచ్చు. అయితే రజనీ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే వెళితే మాత్రం నిరాశ తప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘కబాలి’, వాస్తవికతకు కాస్త దగ్గరగా, రజనీ సినిమా అనే ఆలోచనకు చాలాదూరంగా నిలిచింది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :