సమీక్ష : కర్తవ్యం – సోషల్ మెసేజ్ ఉన్న చిత్రం

సమీక్ష : కర్తవ్యం – సోషల్ మెసేజ్ ఉన్న చిత్రం

Published on Mar 16, 2018 2:00 PM IST
Karthavyam movie review

విడుదల తేదీ : మార్చి 16, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : నయనతార

దర్శకత్వం : గోపి నైనర్

నిర్మాత : శరత్ మరార్, రవీంద్రన్

సంగీతం : జిబ్రన్

సినిమాటోగ్రఫర్ : ఓం ప్రకాష్

ఎడిటర్ : రూబెన్

స్క్రీన్ ప్లే : గోపి నైనర్

రెగ్యులర్ సినిమాల్ని పక్కనబెట్టి కథాబలమున్న సినిమాలని మాత్రమే చేస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం ‘ఆరమ్’. తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఐఏఎస్ ఆఫీసర్ మధు వర్షిణి (నయనతార) చాలా సిన్సియర్ గా ప్రజల కోసమే పనిచేస్తుంటారు. ఆమె భాద్యతలు నిర్వహిస్తున్న జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కూలీ సుమతి కుమార్తె అయిన ధన్సిక ఆడుకుంటూ తెరిచి ఉంచిన బోరు బావిలో పడిపోతుంది.

ఆ సంఘటనతో అక్కడికి చేరుకున్న కలెక్టర్ మధు వర్షిణి ఆ పాపను ప్రాణాలతో బయటకు తీయాలని అన్ని విధాలా ప్రయత్నిస్తుంటుంది. ఆ ప్రయత్నంలో ఆమెపై లోకల్ పొలిటీషియన్ల ఒత్తిడి పెరుగుతుంది. సరైన పరికరాలు లేక పాపను బయటకు తీయడటం కష్టతరంగా మారుతుంది. ఆ ఇబ్బందులు మధ్య మధు వర్షిణి ఎలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది, ఆ క్రమంలో బయటపడిన వ్యవస్థలోని లోపాలేంటి, చివరికి బోరుబావిలో పడిన ధన్సిక బయటపడిందా లేదా అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు గోపి నైనర్ సంచుకున్న కథాంశం. దేశం మొత్తం అవగాహన ఉన్న సమస్యను తీసుకుని అందులో గ్రామీణ ప్రజల కష్టాలు ఎలా ఉంటాయి, వారి జీవితాల పట్ల ప్రభుత్వం ఎంత వరకు భాద్యతగా వ్యవహరిస్తోంది, నిజాయితీగా కర్తవ్యాన్ని నిర్వర్తించే అధికారులకు లోకల్ రాజకీయాలు ఎలా అడ్డుతగులుతున్నాయి అనే అంశాలను స్పష్టంగా చూపించారు.

అంతేగాక సినిమా నైపథ్యం మొత్తాన్ని శ్రీహరికోట అనే ప్రాంతంలో సెట్ చేసిన దర్శకుడు గోపి నైనర్ ఒకవైపు ప్రపంచం నివ్వెరపోయే స్పేస్ టెక్నాలజీ దేశంలో ఉంది, మరోవైపు 30 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన పేద చిన్నారిని కాపాడలేకపోతున్న నిస్సహాయత కూడ ప్రభుత్వాల్లో ఉంది అంటూ నాయకుల్ని ప్రశ్నించారు. బావిలో పడివున్న చిన్నారిని కాపాడే ప్రయత్నాలను చాలా వాస్తవికంగా చూపించి కొన్ని సన్నివేశాల్లో కళ్ళలో నీళ్లు తిరిగే భావోద్వేగాన్ని, ఊపిరి బిగబట్టే ఉత్కంఠతను కలిగించారు.

ఇక నయనతార అయితే అధికారుల ఒత్తిళ్లకు మధ్యన నలిగిపోతూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకునే అధికారిణిగా చాలా బాగా నటించారు. సంగీత దర్శకుడు జిబ్రన్ అయితే తన నైపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. సినిమా మొత్తాన్ని ఒకే మూడ్లో నడిపి ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రఫర్ ఓం ప్రకాష్ కూడ దర్శకుడి విజన్ కు తగ్గట్టు విజువల్స్ ను హృదయాన్ని తాకేలా కెమెరాలో బంధించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొత్తం సామాజిక అంశాల చుట్టూనే తిరుగుతుండటం వలన కమర్షియల్ అంశాలకు స్కోప్ లేకుండా పోయింది. ఈ తరహా కథల్ని కొందరు రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకులు పెద్దగా రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే సినిమాలో కష్టాలు కన్నీళ్లు తప్ప వినోదం మచ్చుకు కూడ కనబడదు.

ఇక సినిమా ఆరంభం నెమ్మదిగానే ఉంటుంది, ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్టు, ఇంకొన్ని రిపీట్ అయినట్టు ఉంటాయి. చిత్రంలో తమిళ ఫ్లేవర్ కూడ ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక చిత్రంలో కీలకమైన అంశం నయనతార తన కలెక్టర్ పోస్టుకు రాజీనామా చేయడం, ఆమెను పై అధికారులు విచారించడం అనే అంశాలను స్పష్టంగా చూపలేదు.

సాంకేతిక విభాగం :

వాస్తవికత కలిగిన సినిమాలను కోరుకునే ప్రేక్షకుల కోణం నుండి చూస్తే దర్శకుడు గోపి నైనర్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. సినిమాలో ఎన్నో సామాజిక అంశాలను ప్రస్తావించిన ఆయన తన విజన్, టేకింగ్ తో సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా చేశారు. కానీ రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకులని ఎక్కువగా సంతృప్తిపరలేరు.

ఇక జిబ్రన్ సంగీతం, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ రెండూ సినిమాకు రెండు కళ్లలా నిలబడ్డాయి. వీరిద్దరూ సరైన పనితనం చూపించకపోయుంటే చిత్రం ఇంత బాగా వచ్చి ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎడిటింగ్ బాగానే ఉంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

సామాజిక అంశాలను, సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాన్ని, అధికారుల్లోని అలసత్వాన్ని, నిజాయితీతో పనిచేసే అధికారులపై రాజకీయ ఒత్తిళ్లను, గ్రామీణ, పట్టణ జీవితాల్లోని వ్యత్యాసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిందీ చిత్రం. దర్శకుడు గోపి నైనర్ ఎంచుకున్న కథాంశం, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా తెరకెక్కించిన సన్నివేశాలు, నయనతార పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకులకు కావల్సిన వినోదం, పాటలు, హాస్యం లేకపోవడం, కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించడం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద సోషల్ మెసేజ్ ఉన్న ఈ ‘కర్తవ్యం’ చిత్రం వాస్తవికత కలిగిన సినిమాల్ని కోరుకునే వారికి నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు