సమీక్ష : మైనింగ్ మాఫియా మీద పోరాటం – కృష్ణం వందే జగద్గురుమ్

సమీక్ష : మైనింగ్ మాఫియా మీద పోరాటం – కృష్ణం వందే జగద్గురుమ్

Published on Dec 1, 2012 5:00 PM IST
విడుదల తేదీ: 30 నవంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : క్రిష్
నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, Y.రాజీవ్ రెడ్డి
సంగీతం : మణిశర్మ
నటీనటులు : రానా, నయనతార, బ్రహ్మానందం


రానా, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుం’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. విమర్శకులు మెచ్చే దర్శకుడు క్రిష్ ఈసారి తన పంథాని మార్చి కమర్షియల్ అంశాలు మేలవిస్తూ కృష్ణం వందే జగద్గురుం తెరకెక్కించాడు. రానా సరసన నయనతార నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు కాగా సాయి జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి నిర్మాతలు. కృష్ణం వందే జగద్గురుం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

బి.టెక్ బాబు (రానా) వీసా వస్తే అమెరికా వెళ్లిపోదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. బాబుకి తమ వారసత్వంగా వస్తున్న నాటకాల మీద ఆసక్తి ఉండదు. సుబ్రహ్మణ్యం (కోట శ్రీనివాస రావు) కి మాత్రం మనవడు అమెరికా వెళ్ళడం ఇష్టం ఉండదు. నాటకాల వల్ల ఏం ఉపయోగం ఉండదు అని బాబు నమ్మకం. తన తాత బలవంతం మీద నాటకాల్లో నటిస్తుంటాడు. తన సొంత ఊరు బళ్ళారిలో ఒకసారి నాటకం వేయాలని సుబ్రహ్మణ్యం కోరిక. ఆ కోరిక తీరకుండానే సుబ్రహ్మణ్యం చనిపోతాడు. బళ్ళారిలో నాటకం వేసి తాత చివరి కోరిక తీర్చి అక్కడే ఆయన అస్థికలు కలపడానికి వెళతాడు. అక్కడే జర్నలిస్ట్ దేవిక (నయనతార) పరిచయమవుతుంది. దేవిక మాటలు బి.టెక్ బాబు ఆలోచనని మారుస్తాయి. తన ఊరిలో జరుగుతున్న మైనింగ్ మాఫియాని నడుపుతున్న రెడ్డప్ప (మిలింద్ గునాజి) అరచాకాలని ఎలా అడ్డుకున్నాడు అనేది కృష్ణం వందే జగద్గురుం చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

ఒక విధంగా చెప్పాలంటే రానాకి ఛాలెంజ్ రోల్. ఇలాంటి పాత్రలు కూడా అందరు హీరోలకు రావు, చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చిన సదవకాశాన్ని రానా ఉపయోగించుకున్నాడు. ఈ రోజుల్లో సురభి నాటకాలు వేసే ఇలాంటి అవకాశం రానాకి రావడం అతని అదృష్టమే. ఇక రానా ఎలా చేసాడు అనే విషయానికి వస్తే సురభి నాటక పాత్రలు చాలా బాగా చేసాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చాలా బాగా నటించాడు. నాటకాలు వేసినపుడు డైలాగ్స్ చెప్పిన తీరు కూడా బావుంది. ఇప్పటి వరకు అతను చేసిన వాటిలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే. దేవికగా నయనతార ప్రాధాన్యత ఉన్న పాత్రలో బాగా నటించింది. కేవలం అందాల ప్రదర్శన అని కాకుండా కథకి ఉపయోగపడే పాత్ర ఆమెది. అరెరే పసి మనసా పాటలో అందంగా బావుంది. కోట శ్రీనివాస రావు చిన్న పాత్రే అయినా ఉన్నంతలో బాగా చేసాడు. విలన్ పాత్రలో నటించిన మిలింద్ గునాజికి ఇది మొదటి తెలుగు సినిమా అయినా బాగానే చేసాడు. టిప్పు సుల్తాన్ పాత్రలో పోసాని కృష్ణ మురళి, రంపం పాత్రలో బ్రహ్మానందం కొన్ని సన్నివేశాల్లో బాగానే నవ్వించారు. మట్టిరాజు పాత్రలో ఎల్బీ శ్రీరామ్ కూడా బాగా చేసాడు. మిగతావారిలో మురళి శర్మ, రఘుబాబు, సత్యం రాజేష్ పాత్ర పరిధి మేరకు నటించారు. సై ఆంధ్రి నాను పాటలో వెంకటేష్ గెస్ట్ అప్పీరియెన్స్ ఫాన్స్ ని అలరిస్తుంది. ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా ప్రారంభంలో వచ్చే సురభి నాటకాల ఎపిసోడ్స్ రెగ్యులర్ ఆడియెన్స్ అర్ధం చేసుకోడానికి కొంత సమయం పట్టింది. మొదటి 30 నిముషాలు కూడా స్లోగా సాగుతుంది. మొదటి భాగంలో వచ్చే స్పైసి స్పైసి గర్ల్, రెండవ భాగంలో వచ్చే చల్ చల్ పాటల టైమింగ్ సరిగా లేదు. ఈ రెండు పాటల సినిమా ఫ్లో దెబ్బ తినడమే కానీ సినిమాకి ఉపయోగపడింది కూడా ఏమి లేదు. సినిమా ప్రారంభం నుండి బలంగా చూపిస్తూ వచ్చిన రెడ్డప్ప మనుషుల్ని చివరికి వచ్చేసరికి పేలగా ముగించాడు. కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ మీద జాగ్రత్త తీసుకుంటే బావుండేది.

సాంకేతిక విభాగం :

మణిశర్మ నేపధ్య సంగీతం సినిమాకి అతి పెద్ద బలం. జరుగుతున్నది జగన్నాటకం పాటని సినిమా మొత్తం వాడుకున్న తీరు చాలా బావుంది. అరెరే పసి మనసా, సై ఆంధ్రి నాను పాటలు బావున్నాయి. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ నేచురల్ గా బావుంది. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ఆలోచన రేకిత్తిస్తాయి. ఫైట్స్, యాక్షన్స్ సీక్వెన్స్ కూడా బావున్నాయి.

తీర్పు :

క్రిష్ తన రెగ్యులర్ స్టైల్ అఫ్ మేకింగ్ కి కమర్షియల్ అంశాలు జోడించి కృష్ణం వందే జగద్గురుం చాలా బాగా తెరకెక్కించారు. సినిమాటిక్ పరంగా ఎంచడానికి కొన్ని లోపాలు ఉన్నా ఒక మంచి సినిమా ముందు అవన్ని మర్చిపోవచ్చు. కమర్షియల్ గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది విషయం పక్కన పెడితే కృష్ణం వందే జగద్గురుం తప్పక చూడవలసిన సినిమా.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘ Krishnam Vande Jagadgurum’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు