సమీక్ష : లవ్ K రన్ – అర్థం లేని ‘ప్రేమ’ పరుగు!

సమీక్ష : లవ్ K రన్ – అర్థం లేని ‘ప్రేమ’ పరుగు!

Published on Sep 17, 2016 4:53 PM IST
Nirmala Convent review

విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : కోటపాటి శ్రీను

నిర్మాత : కందిమళ్ళ వెంకట చంద్రశేఖర్

సంగీతం : జే.పి.

నటీనటులు : దీపక్, మాళవిక మీనన్..

బాలనటుడిగా ‘భద్ర’, ‘అతడు’, ‘లెజెండ్’ లాంటి సినిమాల్లో మెప్పించిన దీపక్, పూర్తి స్థాయి హీరోగా మారి చేసిన టీనేజ్ ప్రేమకథే ‘లవ్ K రన్’. కోటపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మీనన్ హీరోయిన్‌గా నటించింది. మరి నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

కిరణ్ (దీపక్), అంజలి (మాళవిక మీనన్).. ఇద్దరూ చదువుల్లో ఎప్పుడూ ముందుంటారు. ఒకే కాలేజీలో చదివే ఇద్దరూ తమ తమ ఆలోచనలు కలవడంతో కొద్దికాలంలోనే ఒకరికొకరు దగ్గరై, ప్రేమలో పడతారు. అయితే వారి ప్రేమకు కాలేజీలోనే ఒకతడి వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యను ఎదుర్కొని మళ్ళీ తమ ప్రేమను నిలబెట్టుకున్న వెంటనే, ఈ ఇద్దరికీ తమ కుటుంబాల నుంచి కూడా ఓ పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్య ఏంటి? ఆ సమస్యను ఎదుర్కొని ఈ జంట తమ ప్రేమను ఎలా నిలబెట్టుకుందన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఉన్నంతలో బలమైన అంశమంటే హీరో, హీరోయిన్ల మధ్యన కెమిస్ట్రీ అనే చెప్పాలి. ఇద్దరి ఆలోచనలు ఒక్కటవ్వడం, ప్రేమలో పడడం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. హీరో దీపక్ తన పాత్రలో బాగా నటించాడు. కథ అవసరానికి తగ్గట్టు ఇన్నోసెంట్‌గా కనిపిస్తూనే పంచ్ డైలాగ్స్ కూడా బాగానే చెప్పాడు. హీరోయిన్ మాళవిక చూడడానికి చాలా బాగుంది. ఇక ఆమెకు ఉన్న పరిధిలో నటన పరంగానే బాగానే మెప్పించింది. తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్ తదితరులు తమ కామెడీతో నవ్వించారు.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్యన అరకు టూర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

బలమైన కథంటూ ఒకటి లేకపోవడమే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్. టీనేజ్ ప్రేమకథల్లో ఉండే ఇన్నోసెన్స్ కానీ, కమర్షియల్ సినిమా అన్న కోణంలో చూస్తే అవసరమయ్యే ట్విస్ట్‌లు కానీ ఏవీ లేక సినిమా అంతా తీరూ తెన్నూ లేకుండా అలా సాగిపోతూంటుంది. స్క్రీన్‌ప్లేలో బలమైన పాయింట్ ఒక్కటి కూడా లేకపోవడం నిరాశపరచే అంశం. కాలేజీ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథలో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉన్న, అరిగిపోయిన సన్నివేశాలే మళ్ళీ వచ్చినట్లు కనిపించాయి.

ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ కోసం సినిమానంతా నడిపించుకుంటూ వచ్చారు. ఆ ఫ్లాష్‌బ్యాక్ కూడా తేలిపోయేది కావడం మరింత నిరుత్సాహపరచే అంశం. క్లైమాక్స్ చాలా సిల్లీగా ఉంది. అప్పటివరకూ ఏదోలా నడుస్తుందనుకున్న సినిమాను ఈ సిల్లీ క్లైమాక్స్ పూర్తిగా పక్కదారి పట్టించేసింది. ప్రతి సన్నివేశం ముందే ఊహించేదిగా ఉండడం, డైలాగ్స్ అన్నీ పనిగట్టుకొని చెప్పించినట్లు ఉండడం కూడా మైనస్‌గానే చెప్పుకోవాలి. లవ్ కే రన్ అన్న టైటిల్‌కు, సినిమాకు అస్సలు సంబంధమే లేకపోవడం కూడా బాగోలేదు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు కోటపాటి శ్రీను గురించి చెప్పుకుంటే.. ‘సేవ్ లవ్’ అన్న కాన్సెప్ట్‌ను పట్టుకొచ్చిన ఆయన, దాన్ని తెలుగు సినిమాలో ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన పక్కా టెంప్లేట్ ప్రేమకథలో ఇరికించి మొదట్లోనే ఫెయిలయ్యారు. హీరో, హీరోయిన్ల మధ్యన కొన్ని మంచి సన్నివేశాలను రాయడం వదిలేస్తే, దర్శకుడిగా, రచయితగా కోటపాటి శ్రీను పూర్తిగా విఫలమయ్యాడు.

జే.పీ అందించిన సంగీతంలో రెండు పాటలు వినడానికి ఫర్వాలేదనలే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగోలేదు. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నంతలో బాగున్నాయి.

తీర్పు :

‘లవ్ కే రన్’ పేరుతో ప్రేమను బతికించుకోవాలన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఓ బలమైన కథంటూ లేకపోవడం, ఆ ఉన్న కథలోనూ ఎమోషన్ అనేదే లేకపోవడం, సిల్లీ క్లైమాక్స్ లాంటి ఎన్నో మైనస్‌లు అడుగడుగునా ఉన్నాయి. ఒక్క హీరో, హీరోయిన్ల మధ్యన వచ్చే కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆకట్టుకున్నవి అంతంతమాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘లవ్ కే రన్’, ఒక అర్థం లేని నీరసం తెప్పించే పరుగు!

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు