సమీక్ష : మలుపు – థ్రిల్ చేసే ‘మలుపు’లు.!

Malupu review

విడుదల తేదీ : 19 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : సత్య ప్రభాస్ పినిశెట్టి

నిర్మాత : రవిరాజా పినిశెట్టి

సంగీతం : ప్రసన్ ప్రవీణ్ శ్యాం

నటీనటులు : ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని..

‘ఒక ‘v’ చిత్రం’, ‘గుండెల్లో గోదారి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఆది పినిశెట్టి హీరోగా రవిరాజా పినిశెట్టి పెద్ద కుమారుడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘మలుపు’. తమిళంలో గత ఏడాది రిలీజై డీసెంట్ ఫిల్మ్ అనిపించుకున్న ఈ సినిమాని తెలుగులో మలుపు పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఆది, నిక్కీ గాల్రాని జంటగా నటించిన ఈ సినిమా యూత్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మలుపు ఆడియన్స్ కి ఎలాంటి మలుపులు చూపించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సగ(ఆది పినిశెట్టి), శివ, రాజేష్, కిషోర్ లు బెస్ట్ ఫ్రెండ్స్. వీరు ఒకరి కోసం ఒకరికి ఏం చెయ్యడానికైనా సిద్దపడే మనస్తత్వం కలవారు. 2014 డిసెంబర్ 31వ తేదీ రాత్రి న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీ టైంలో ప్రియ(రిచా), అతని బాయ్ ఫ్రెండ్ సూర్య(శ్రవణ్)తో గొడవ పెట్టుకుంటారు ఈ నలుగురు ఫ్రెండ్స్.. అక్కడి నుంచి కట్ చేస్తే ఈ నలుగురు ఫ్రెండ్స్ ఒకరితో ఒకరి విడిపోతారు, అలాగే వీరిని చంపేయడానికి ముంబై అండర్ వరల్డ్ డాన్ అయిన మొదలియార్(మిథున్ చక్రబోర్తి) గ్యాంగ్ ట్రై చేస్తుంటారు.

తమని చంపాలనుకుంటున్నది ఎవరో తెలుసుకున్న సగ డైరెక్ట్ గా ముంబై వెళ్లి జరిగింది చెప్పి ఆయన్ని క్షమాపణలు అడగాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే సగ ముంబై చేరి మొదలియార్ కి జరిగింది చెప్పి క్షమాపణ కోరతాడు. కానీ అక్కడే ట్విస్ట్… సగ ఒక కారణం మీద క్షమాపణ చెప్తాడు, కానీ మొదలియార్ గ్యాంగ్ వారిని చంపాలనుకున్న కారణం వేరే ఉంటుంది. దాంతో సగకి షాక్. ఇంతకీ సగ అండ్ ఫ్రెండ్స్ ని మొదలియార్ గ్యాంగ్ ఎందుకు చంపాలనుకున్నారు? మొదలియార్ గ్యాంగ్ నుంచి తనని, తన ఫ్రెండ్స్ ని తప్పించడం కోసం ఏమేమి చేసాడు? అసలు వైజాగ్ లో ఉండే ఈ నలుగురుకి – మొదలియార్ కి సంబంధం ఏంటి? అనే ఆసక్తికర అంశాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

‘మలుపు’ అనే టైటిల్ ని బట్టే అర్థమవుతోంది.. ఇదొక సస్పెన్స్ డ్రామా అని. ఆ సస్పెన్స్ ని చూపించడంలో డైరెక్టర్ 80% సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ మొదటి నుంచి అసలు కథని మొదలు పెట్టి ప్రీ క్లైమాక్స్ వరకూ ఆ సస్పెన్స్ డ్రామాని నడిపించిన తీరు సూపర్బ్ అని చెప్పాలి. అదే సినిమాకి మేజర్ హైలైట్. ఒరిజినల్ ప్లాట్ లో రాసుకున్న చిన్న చిన్న ట్విస్ట్ లన్నీ బాగున్నాయి. ఇకపోతే ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్స్ మీద తీసిన కొన్ని సీన్స్ మరియు కొన్ని జాయబుల్ మోమెంట్స్ బాగుంటాయి. అలాగే ఆది – నిక్కిల లవ్ ట్రాక్ కూడా కాస్త పరవాలేదనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఆది పినిశెట్టి సింగిల్ గా ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. ఎన్ని పాత్రలు ఉన్న హైలైట్ అయ్యేది మాత్రం ఆదినే, ఎందుకంటే.. నేటితరం స్టూడెంట్ లుక్ లో, అల్లరి పిల్లాడిలా, లవర్ బాయ్ గా, ఒక సమస్యని పరిష్కరించే రెస్పాన్సిబుల్ పర్సన్ గా అన్ని హావ భావాలను పర్ఫెక్ట్ గా పలికించాడు. మెయిన్ గా యాక్షన్ ఎపిసోడ్స్ లో తన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ బాగుంది. నిక్కి గార్లాని టామ్ బాయ్ పాత్రలో బాగుంది. ఇక మెయిన్ విలన్స్ గా మిథున్ చక్రబోర్తి, హరీష్ ఉత్తమన్ లు ప్రేక్షకులను మెప్పించారు. ఆది ఫ్రెండ్స్ గా చేసిన సిద్దార్థ్, శ్యామ్, శ్రీలు తమ తమ పాత్రల్లో మెప్పించారు. అతిధి పాత్రల్లో కథని మలుపు తిప్పే పాత్రల్లో కనిపించిన రిచా, శ్రవణ్ లు తమ పాత్రలకి న్యాయం చేసారు.

సినిమా పరంగా చూసుకుంటే.. సినిమాని మొదలు పెట్టిన విధానం బాగుంటుంది. ఆ తర్వాత ఫ్రండ్స్ మధ్య వచ్చే కొన్ని కొన్ని మోమెంట్స్ బాగున్నాయి. అక్కడి నుంచి కట్ చేస్తే సెకండాఫ్ లో అసలు కథ మొదలయ్యాక బాగా ఆసక్తికరంగా ఉంటుంది.

మైనస్ పాయింట్స్ :

సస్పెన్స్ డ్రామాలని 2 గంటల 30 నిమిషాల పాటు ఆసక్తికరంగా తీయడం చాలా కష్టమైన పని. ఆ కష్టం, ఆ తడబాటు ఇందులోనూ కనిపించింది. ఎందుకంటే డైరెక్టర్ సత్య ప్రభాస్ ఓ సింపుల్ ఎలిమెంట్ నే ఎంచుకున్నాడు. కానీ దానిని ఒక పార్ట్ వరకూ ఆసక్తిగానే రాసుకున్నాడు. అందుకే సెకండాఫ్ మాత్రమె రాసుకున్నాడు. సెకండాఫ్ కోసం అల్లుకుంటూ రాసుకున్న ఫస్ట్ హాఫ్ బాగా బోరింగ్ గా అనిపిస్తుంది. మొదలైన 5 నిమిషాల తర్వాత నుంచి సినిమా స్లోగా సాగుతుంది, ఆసక్తికరంగా ఏమీ జరగవు. ఫస్ట్ హాఫ్ లోని మెయిన్ పాయింట్ ఏంటంటే ఒరిజినల్ కథలోకి అస్సలు ఎంటర్ కాకపోవడమే.. అటు ఎంటర్టైన్మెంట్, ఇటు సస్పెన్స్ ఏదీ లేకపోవడం వలన ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా తయారవుతుంది.

ఇక సినిమాలోని మరో మైనస్ క్లైమాక్స్.. ప్రీ క్లైమాక్స్ వరకూ ఆసక్తిని క్రియేట్ చేసి థ్రిల్ చేసిన డైరెక్టర్ రొటీన్ గా ఉండకూడదని క్లైమాక్స్ ని కొత్తగా డిజైన్ చెయ్యాలనే ఉద్దేశంతో ఇంటెలిజెంట్ గా రాసుకున్నాడు. కానీ ఇది అందరికీ అర్థమయ్యేలా లేకపోవడం వలన అసంపూర్తిగా అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో పాటలు సినిమా ఫ్లోని దెబ్బ తీస్తాయి. మెయిన్ గా సెకండాఫ్ లో వచ్చే ఓ క్లబ్ పాట సినిమాకి అవసరం లేదు. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ ని కాస్త తగ్గించి, పాటల్ని తీసేసి సినిమా రన్ టైంని 2 గంటలకి కుదించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సత్య ప్రభాస్ పినిశెట్టి గురించి మొదట మాట్లాడుకుందాం.. సత్య ప్రభాస్ మొదటి సినిమా డిఫరెంట్ గా ఉండాలని సస్పెన్స్ డ్రామాని సెలక్ట్ చేసుకోవడం బాగానే ఉంది, కానీ దానిని 100% సక్సెఫుల్ గా తెరపైకి తీసుకు రాలేకపోయాడు. తన దగ్గర ఉన్న మెయిన్ థ్రిల్లింగ్ మోమెంట్స్ ని సెకండాఫ్ లో పెట్టేయడం వలన ఫస్ట్ హాఫ్ ని సరిగా డీల్ చేయలేకపోయాడు. కథనం విషయంలో ఇంకాస్త క్లారిటీగా ఉంటే మంచి సినిమా చేయగలడు. డైరెక్టర్ గా మాత్రం సినిమాకి అవసరమైన మెయిన్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా తీసాడు.

శన్ముగ సుందరం సినిమాటోగ్రఫీ బాగుంది. డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాలలను, సన్నివేశాలలోని మూడ్ వేరియేషన్స్ ని విజువల్ గా చాలా బాగా చూపించాడు. ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ అందించిన సాంగ్స్ తెలుగులో అస్సలు బాలేవు, కానీ నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. సాబు జోసెఫ్ ఎడిటింగ్ జస్ట్ యావరజ్.. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ని ట్రిమ్ చేసి ఉండాల్సింది. విజయ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మరియు అమరన్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక రవిరాజా పినిశెట్టి నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి.

తీర్పు :

హాలీవుడ్ తరహాలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్య సౌత్ లో కూడా ఎక్కువయ్యాయి. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ లో బాగుంది, థియేటర్ కి వెళ్లి చూడచ్చు అనే సినిమానే ‘మలుపు’. డైరెక్టర్ సత్య ప్రభాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించడంలో ఫస్ట్ హాఫ్ లో ఫెయిల్ అయినప్పటికీ సెకండాఫ్ లో మాత్రం సక్సెస్ అయ్యాడు. వన్ మాన్ ఆర్మీలా సినిమా మొత్తాన్ని నడిపించిన ఆది పినిశెట్టి పెర్ఫార్మన్స్ మరియు సెకండాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ స్టొరీ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేదే అనే ఫీల్ లాంటివి చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. రొటీన్ సినిమాలతో విసుగెత్తి, ఏదైనా కొత్తగా చెబితే చూద్దాం అనుకునేవారికి, అలాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ థ్రిల్ చేసే ‘మలుపు’ బాగా నచ్చుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :