మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara)ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ జాప్యం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రేక్షకులకు, మెగా ఫ్యాన్స్‌కు ఒకేసారి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఒక పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేసి దానితో పాటే కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. శ్రీరామనవమి రోజే ఒక అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ, ఇతర చిత్రాల హడావిడి దృష్ట్యా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
యువీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. రాబోయే ట్రైలర్ గనుక ప్రేక్షకులను మెప్పిస్తే, ఈ సినిమాపై గతంలో కంటే డబుల్ అంచనాలు పెరగడం ఖాయం. మరి మెగాస్టార్ ఈ డబుల్ ట్రీట్ ఎప్పుడు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.


