సమీక్ష : “మైఖేల్” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా!

సమీక్ష : “మైఖేల్” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా!

Published on Feb 4, 2023 3:02 AM IST
Michael Movie-Review-In-Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, గౌతం మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ, వరలక్ష్మి శరత్‌కుమార్

దర్శకుడు : రంజిత్ జయకోడి

నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు

సంగీత దర్శకులు: సామ్ సిఎస్

సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్

ఎడిటర్: ఆర్.సత్యనారాయణన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్ గా తెరకెక్కిన మూవీ మైఖేల్. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

మైఖేల్ (సందీప్ కిషన్) చిన్నప్పటి నుంచే తన తండ్రిని చంపాలనే కోరికతో గురునాథ్ (గౌతం మీనన్) అనే పెద్ద గ్యాంగ్ స్టర్ దగ్గరకు చేరతాడు. అక్కడ తన పనితనంతో గురునాథ్ కి బాగా దగ్గర అవుతాడు. ఐతే, గురునాథ్ పై హత్య ప్రయత్నం చేసిన వారిని చంపమని మైఖేల్ కి చెబుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మైఖేల్ తీరా (దివ్యాంశ కౌశిక్) కి దగ్గర అవుతాడు. ఆమెను ప్రేమిస్తాడు. దాంతో, గురునాథ్ చెప్పినట్టు చెయ్యడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా గురునాథ్ కి – మైఖేల్ కి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అనంతరం మైఖేల్ ఏం చేశాడు ?, ఇంతకీ, మైఖేల్ తండ్రి ఎవరు ?, ఈ మధ్యలో మైఖేల్ కి సాయం చేసిన విజయ్ సేతుపతి పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మైఖేల్ జీవితంలో జరిగిన పరిణామాలను, అలాగే తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తి పై పగ తీర్చుకునే క్రమాన్ని కొంతవరకు బాగానే ఎలివేట్ చేశారు. అదే విధంగా మైఖేల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు అనే కోణంలో ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. మైఖేల్ పాత్రలో సందీప్ కిషన్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా అతనిలోని ఆవేశం, ధైర్యసాహసాలు, అన్యాయం జరిగితే ఎదురుతిరిగే లక్షణాలను సందీప్ కిషన్ తన హావాబావాలలో బాగా పలికించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ బాగా నటించింది. అనసూయకి కీలక పాత్ర దొరికింది. విజయ్ సేతుపతి పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే గౌతం మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ పర్మార్మెన్స్ లు కూడా బాగున్నాయి. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

మైఖేల్ కథలో డెప్త్ ఉన్నా.. సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా స్లోగా అండ్ రొటీన్ గా సాగాయి. పైగా మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అలాగే ఎమోషన్ కూడా ఇన్ వాల్వ్ అయ్యేలా లేదు. పంజా, మున్నా, ముఖ్యంగా కేజీఎఫ్ చిత్రాలకు కాపీలా సాగింది మైఖేల్ ప్లే. అసలు ఇలాంటి యాక్షన్ ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగాలి.

అయితే, ఈ మైఖేల్ సినిమాలో అలాంటి అంశాలు మిస్ అయ్యాయి. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా మైఖేల్ పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా బాగాలేదు. దీనికి తోడు సినిమాలో ఇంట్రసింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. హీరో క్యారెక్టైజేషన్ ను ఇంకా ఎఫెక్టివ్ గా రాసుకోవాల్సింది.

ముఖ్యంగా పలు యాక్షన్ చిత్రాల తాలూకు సీన్స్ యాక్టివిటీస్ ఈ సినిమాలో ఎక్కువగా ఉండటం మైఖేల్ కి బాగా మైనస్ అయ్యాయి. పైగా కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ లో సహజత్వం లోపించింది. ఓవరాల్ మైఖేల్ లో లాజిక్స్ కూడా వదిలేశారు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. సామ్ సిఎస్ సంగీతం సినిమాకు ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాతలు భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే దర్శకుడు రంజిత్ జయకోడి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయారు.

 

తీర్పు :

 

యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ మైఖేల్ మూవీలో మెయిన్ పాయింట్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఐతే, స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం, అలాగే ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనంగా ఉండటం, పంజా, మున్నా, ముఖ్యంగా కేజీఎఫ్ వంటి చిత్రాలను ఎక్కువగా అనుకరించడం వంటి అంశాలు సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. ఐతే, సినిమాలో సందీప్ కిషన్ నటన బాగుంది. మైఖేల్ పాత్ర తాలూకు కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు