సమీక్ష : మిణుగురులు – ప్రేక్షకులను మెప్పించి, ఆలోజింపజేసే మూవీ

సమీక్ష : మిణుగురులు – ప్రేక్షకులను మెప్పించి, ఆలోజింపజేసే మూవీ

Published on Jan 25, 2014 7:09 PM IST
minugurulu-telugu-review విడుదల తేదీ : 24 జనవరి 2014
దర్శకుడు : అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి
నిర్మాత : అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి
సంగీతం : జోస్యభట్ల
నటీనటులు : ఆశిష్ విద్యార్థి, సుహాసిని, దీపక్ సరోజ్, రుషిని…


సినిమా అనే మాద్యమం ద్వారా కమర్షియల్ పరంగానే కాకుండా ఏదో మనం తీసే సినిమా ద్వారా ఏదో ఒక విషయం ప్రేక్షకులకు చెప్పాలనుకొని వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా వచ్చిన సినిమానే ‘మిణుగురులు’. యుఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ సినిమాలపై ఉన్న ఇష్టంతో డైరెక్టర్ మా మారిన అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి ఈ సినిమాని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. అంధుల చుట్టూ తిరిగే ఈ కథాంశం ద్వారా దర్శకుడు ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ సినిమా కథాంశం మొత్తం అనాధలైన అంధులు ఉండే ఓ స్కూల్ చుట్టూ తిరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలోని ఓ పల్లెటూరిలో ఓ అంధుల పాఠశాల ఉంటుంది. అందులో సుమారు 20-30 మంది పిల్లలు ఉంటారు. ఆ హాస్టల్ కి వార్డన్ అయిన నారాయణ(ఆశిష్ విద్యార్థి) గవర్నమెంట్ నుంచి ఆ స్కూల్ ఫండ్స్ అన్నిటినీ తన జల్సాల కోసం తగలేస్తూ స్కూల్లో పిల్లలకు మాత్రం కనీస అవసరాలు సమకూర్చకుండా, భోజనం కూడా సరిగ్గా పెట్టకుండా వాళ్ళని కష్టపెడుతూ ఆ స్కూల్ ని నడుపుతూ ఉంటాడు.

ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనుకున్న రాజు(దీపక్ సరోజ్) తన ఫ్రెండ్ శివ(శ్రీనివాస్ సాయి)తో కలిసి ఓ ప్రకటన తీసే క్రమంలో తన చూపుని పోగొట్టుకుంటాడు. చూపు లేని రాజుని వాళ్ళ నాన్న భారం అనుకొని నారాయణ నడిపే అంధుల స్కూల్ లో చేరుస్తాడు. అక్కడ చేరిన రాజు తనతో సహా మిగతా వారంతా పడుతున్న కష్టాలను అర్థం చేసుకుంటాడు. అక్కడున్న బాచి, మైనా(రుషిని), మిగిలిన అందరి సహాయంతో ఎలాగైనా తమ సమస్యలను కలెక్టర్ కి చేరవేసి అక్కడి వారికి అన్ని వసతులు కల్పించాలనుకుంటాడు. దానికోసం రాజుతో మిగిలిన అంధులంతా కలిసి ఏం చేసారు? ఏలా కలెక్టర్ కి అక్కడి విషయాలను చేరవేశారు? చివరికి నారాయణ ఏమయ్యాడు? వారి కష్టాలు తీరిపోయయా? లేదా? అనే ఆసక్తికరమైన అంశాలను మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ప్రతి సినిమా విషయంలో ఇది ఇలా ఉండబోతుంది లేదా ఇది కమర్షియల్ మూవీ లేదా కుటుంబ కథా చిత్రం లేదా ఆర్ట్ ఫిల్మ్ అనే ఉద్దేశంతో సినిమా హాల్ లోకి వెళ్తాం. ఈ సినిమాని కూడా ఆర్ట్ ఫిల్మ్ అనుకునే వెళ్తాం. మీరనుకున్నట్లుగా ఇది ఆర్ట్ సినిమానే కానీ సినిమా మొదలైన మొదటి నిమిషం మాత్రం డైరెక్టర్ మిమ్మల్ని బాగా నవ్విస్తాడు. దాంతో అదే హ్యాపీ మూడ్ తో మీరు సినిమాని చూడటం మొదలు పెడతారు. దాంతో మీరు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు, ఇదే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. అలాగే సినిమాలో సందర్భానుసారంగా చాలా సన్నివేశాల్లో ప్రేక్షకులను బాగా నవ్విస్తాడు. సినిమాలో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.

ఫస్ట్ హాఫ్ అంతా కొద్ది పాటి నవ్వులు, పాత్రల పరిచయాలతో సాగిపోయినప్పటికీ సెకండాఫ్ ని మాత్రం ఆసక్తికరంగా నడిపించాడు. అలాగే క్లైమాక్స్ లో సంకల్పం ఉంటే కళ్ళు ఉన్నా లేకపోయినా అనుకున్నది సాధించగలం అనే పాయింట్ ని బాగా చూపించాడు. అంధులు ఈ లోకాన్ని చూడకపోయినా వారికి కనీస అవసరాలు ఉన్నా లేకపోయినా వారు అంతా కలిసి ఉంటే వారు పొందే ఆనందాల్ని, అనుభూతుల్ని చాలా బాగా చూపించాడు. థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులు వారికి తెలియకుండానే వారి ఆనందాన్ని ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. పిల్లలను, పెద్దలను మెప్పించడమే కాకుండా ఆలోజింపజేసే సినిమా ‘మిణుగురులు’.

అంధులుగా నటించిన రాజు, బాచి, మైనా( ఇవి సినిమాలోని పేర్లు)లు చాలా మంచి నటనని కనబరిచారు. అలాగే కొంతమంది నిజమైన అంధులను కూడా ఈ సినిమాలో చూపించారు. వాళ్ళకి నటనలో ఎలాంటి అవగాహన లేకపోయినా వారి నుంచి కూడా డైరెక్టర్ మంచి నటనని రాబట్టుకున్నాడు. సుహాసిని కనపడేది రెండు మూడు నిమిషాలే అయినా బాగా నటించారు. అలాగే స్వార్ధ పూరితమైన వార్డన్ పాత్రలో ఆశిష్ విద్యార్థి మంచి నటనని కనబరిచాడు. మిగిలిన పాత్రలు చేసిన వారు కూడా వారి పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో చిన్న పిల్లలైన అంధుల చేత చెప్పించిన డైలాగ్స్ మాత్రం అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఆర్ట్ సినిమా అంటే కచ్చితంగా అక్కడక్కడా బోర్ కొట్టే సన్నివేశాలు ఉంటాయి. అలాంటివి ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అలాగే సినిమా స్లోగా ఉంటుంది. అంధుల చేత చేయించిన కొన్ని సీన్స్ ఇవి వాళ్ళు నిజంగా చేయగలరా? లేదా? అనే అనుమానం ప్రేక్షకుల్లో వస్తుంది. కానీ కొన్ని సీన్స్ లో ప్రేక్షకులకి ఆ అనుమానమే రాకుండా బాగా తీసాడు. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం డైరెక్టర్ ఆడియన్స్ ని నమ్మించలేకపోయాడు. కొన్ని కీలక సన్నివేషాలు ఊహాజనితంగా ఉన్నాయి.

ఎంటర్ టైన్మెంట్ అనేది ఎక్కడో ఓ చోట ఉంటుంది కావున రెగ్యులర్ మరియు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి ఈ సినిమా అంతగా నచ్చదు. కావున అలాంటి వాళ్ళు ఈ సినిమాకి మంచింది.

సాకేంతిక విభాగం :

ఈ సినిమాకి జోస్యభట్ల అందించిన పాటలు చాలా ప్లస్ అయ్యాయి . ప్రతి పాటలోనూ ఎంతో అర్థం వచ్చే సాహిత్యం ఉండటం సినిమాకి కూడా ప్లస్ అయ్యింది. అలాగే వివేక్ ఫిలిప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ లోని ఫీల్ ని పెంచేలా ఉంది. డైరెక్టర్ ఎంచుకున్న లోకేషన్స్ ని, పర్ఫెక్ట్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. డైలాగ్స్ అందరినీ ఆలోజింపజేసేలా ఉన్నాయి. సాగదీసినట్టు ఉంది అన్న సీన్స్ పై ఎడిటర్ కాస్త శ్రద్ధ తీసుకొని కత్తిరించి ఉంటే బాగుండేది.

అంధులపై సినిమా చేస్తున్నాం, సినిమా పూర్తయ్యేలోపు అంధులపై ప్రేక్షకులకి జాలి అనే ఫీలింగ్ కలిగించాలి అనుకోకుండా అంధులకి కూడా భావాలుంటాయి, వారు కూడా మనలాంటి వారే, వారు కూడా ఏదైనా చెయ్యాలి అని సంకల్పించుకుంటే చేసి చూపించగలరు అని తను కాన్సెప్ట్ ని ఎక్కడా తప్పుదోవ పట్టించకుండా పర్ఫెక్ట్ గా తీసిన డైరెక్టర్ అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి కి హ్యాట్సాఫ్ చెప్పాలి. మొదటి సినిమా అయినా తడబడకుండా తను అనుకున్నది అనుకున్నట్టుగా తీసి డైరెక్టర్ గా మంచి పేరుతెచ్చుకున్నాడు. ఇక ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ అయినా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇతను కూడా చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘మిణుగురులు’ అనేది కళ్ళు లేని అంధులపై తీసిన సినిమా. కళ్ళున్న అందరూ చూసి మెచ్చుకునే మూవీ మరియు చూసిన వారందరినీ ఆలోజింపజేసే సినిమా ‘మిణుగురులు’. ఈ అంధుల సినిమా చాలా మంది కళ్ళున్న వారికి స్పూర్తిగా కూడా నిలిచే అవకాశం ఉంది. ఆర్ట్ సినిమా కావడం వల్ల అక్కడక్కడా బోరింగ్ గా అనిపించే సీన్స్, కొన్ని నమ్మశక్యంగా అనిపించని లాజిక్స్ మైనస్ పాయింట్స్ అయితే డైరెక్టర్ అనుకున్న స్టొరీ లైన్, తను చూపించిన విధానం, నటీనటుల పనితీరు, మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్. అంధత్వంతో ఈ ప్రపంచంలోని అందాల్ని చూడలేకపోయినా ప్రతి దాన్ని ఫీలవుతూ ఆనందంగా గడుపుతున్న అంధుల పై తీసిన ఈ ‘మిణుగురులు’ చిత్రాన్ని కళ్ళుండి ప్రపంచంలోని అందాల్ని, ఆనందాల్ని అనుభవించలేకపొతున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.

123తెలుగు.కామ్ రేటింగ్ : ఈ సినిమాకి మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఇచ్చినట్లు 1 నుంచి 5 లోపు రేటింగ్ ఇవ్వలేము, అలా ఇచ్చే సినిమా కాదు కావున ఈ సినిమాకి మేము రేటింగ్ ఇవ్వడం లేదు.

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు