సమీక్ష : మిస్ లీలావతి – ‘మిస్ ఫైరైన లీలావతి..!’

Jil

విడుదల తేదీ : 3 ఏప్రిల్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25 /5

దర్శకత్వం : పి. సునీల్ కుమార్ రెడ్డి

నిర్మాత : యెక్కలి రవీంద్రబాబు

సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి

నటీనటులు : సురేష్, ఇషితా వ్యాస్, మహేష్ తదితరులు

‘గంగ పుత్రులు’, ‘సొంత ఊరు’ వంటి చిత్రాల ద్వారా విమర్శకుల ప్రశంసలనూ, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ వంటి చిత్రాల ద్వారా బాక్సాఫీస్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మిస్ లీలావతి’. సురేష్, లీలావతి, మహేష్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మిస్ లీలావతి ప్రేక్షకులను ఆకట్టుకుందా? చూద్దాం..

కథ :

కార్తీక్(సురేష్) అనే యువకుడు పెళ్ళై ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అతడి జీవితంలోకి ఓ రాంగ్‌కాల్ ద్వారా లీలావతి (ఇషితా వ్యాస్) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. వైజాగ్ నేపథ్యంలో ఒక అందమైన సినిమా తీయాలన్నది ఆమె కల. రాంగ్ కాల్ ద్వారా కార్తీక్ జీవితంలోకి ప్రవేశించిన లీల అతి కొద్దికాలంలోనే అతడి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ శారీరకంగానూ దగ్గరౌతారు. కార్తీక్‌కు అంతకు ముందే పెళ్ళై పోయిందన్న నిజం తెలుసుకొని లీలా అతడికి దూరమవుతుంది. మళ్ళీ కార్తీక్‌పై మోహంతో అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? మిస్ లీలా అతడి సంసారంలో ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? చివరికి లీలా ఏమైందన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

‘అక్రమ సంబంధాలు కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంది’ అన్న బేసిక్ సోషల్ మెసేజ్‌తో కూడిన సినిమా కావడం ఈ సినిమాకు ప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లోని చాలా సన్నివేశాలు ఆసక్తి కలిగించడంతో పాటు వేగంగా దూసుకెళతాయి. ఆ రకంగా ఫస్టాఫ్‌ను సినిమాకు బలంగా చెప్పుకోవచ్చు. హుదూద్ నేపథ్యంలో కొన్ని జీవితాల్లో వచ్చిన అలజడిని తెరకెక్కించడం బాగుంది. అచ్చంగా హుదూద్ ఎలా అయితే విశాఖ పరిసరాలను చిన్నాభిన్నం చేసిందో, అదే సమయంలో అక్కడి కొన్ని జీవితాలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నది చూపించాలన్న ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఫస్టాఫ్‌లో కార్తీక్, లీలాల మధ్య వచ్చే లవ్‌ట్రాక్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా పేలిన కొన్ని జోకులు గొప్ప రిలీఫ్ అనే చెప్పాలి.

లీలావతి పాత్రలో నటించిన ఇషితా వ్యాస్‌కు ఇది మొదటి సినిమాయే అయినా ఫర్వాలేదనేలా చేసింది. తన శక్తిమేర ఆ పాత్రకు న్యాం చేసింది ఇషిత. ఇక హీరో సురేష్, అతని ఫ్రెండ్‌గా నటించిన మహేష్ ఫర్వాలేదనిపిస్తారు. ఎఫ్.ఎం.బాబాయ్ తన మార్క్ నటనతో నవ్వులు పూయించారు. వీరందరి యాక్టింగ్ సినిమాకు ప్లస్‌పాయింట్లుగానే చెప్పుకోవాలి. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల వచ్చే ఎమోషనల్ సన్నివేశాలతో సినిమాకు కొంత జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది.

మైనస్ పాయింట్స్ :

కథా, కథనాలను సినిమాకు పెద్ద మైనస్‌పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో కథను నడిపించడానికి బాగానే కష్టపడినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. ఇంటర్వెల్ వద్ద కథను ఒక ఆసక్తికరమైన మలుపు తిప్పి, సెకండాఫ్‌ మొదలైన పది నిమిషాలకే దారి తప్పించడం విసుగు తెప్పిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ దగ్గరకొచ్చేసరికి సినిమా చెప్పాలనుకున్న విషయానికి, చెబుతున్న విషయానికి సంబంధం లేక సినిమా చతికిలబడింది. హుదూద్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో హుదూద్ విధ్వంసాన్ని, కథలోని ఎమోషన్‌ను కనెక్ట్ చేసే అంశం మిస్సయింది. సెకండాఫ్‌లో అక్కడక్కడా మంచి ఎమోషన్ ఉన్నా దాన్ని చివరిదాకా కొనసాగించడంలో విఫలమయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో వచ్చిన ఫ్యామిలీ డ్రామా సినిమాగా కథ మారిన క్షణం నుంచి సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది.

లీలావతి పాత్ర ఎందుకలా ప్రవర్తిస్తుందనే దానికి ఒక అర్థం లేకుండా పోయింది. ఒకసారి సైకోగా, మరోసారి తెలివైన అమ్మాయిగా చూపిస్తూ ఆ పాత్రకు ఒక దారితెన్నూ లేకుండా చేశారు. సినిమాలో చెప్పాలనుకున్న ‘సోషల్ మెసేజ్’ సెకండాఫ్‌ నుంచే మొదలైనట్టు కనిపించినా అక్కణ్ణుంచే ఆ మెసేజ్ కనిపించకుండానూ పోయింది. అసలైన పాయింట్‌ను మరిచిపోయి అర్థం పర్థం లేని సన్నివేశాలతో సినిమాను నడపడంతో కథపై పట్టు కోల్పోయినట్టు కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

కథ, కథనాల విషయంలో దర్శకుడు పెద్దగా చేసిందేమీ లేదనే చెప్పాలి. అయితే దర్శకుడిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నాన్ని చేశారు సునీల్ కుమార్ రెడ్డి. చాలాచోట్ల చెప్పాలనుకున్న విషయం పట్ల క్లారిటీ కనిపిస్తుంది. దాన్నే ఒక కథకు కనెక్ట్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. సామాజిక అంశాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించిన నైపుణ్యం గల దర్శకుడి దగ్గర నుంచి ఇలాంటి ఎమోషన్ లేని సినిమాను కోరుకోలేం. చిన్న సినిమా అయినా కూడా సినిమాటోగ్రాఫర్ తన శక్తిమేర చేసిన ప్రయత్నం తెరపై కనిపిస్తుంది. వైజాగ్ అందాలను, హుదూద్ విధ్వంసాన్ని బాగా తెరకెక్కించారు. సంభాషణల్లో మంచి డెప్త్ ఉంది. చాలా చోట్ల డైలాగులే సినిమాను నడిపించాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. కొన్ని చోట్ల అనవసర సన్నివేశాలని తీసేస్తే ఇంకా బాగుండేది. ఇక పాటలు సందర్భానుసరంగానే రావడంతో సినిమాలో బాగానే కలిసిపోయాయి. టెక్నికల్‌గా ఓ చిన్న సినిమాను ఇలా తీయడాన్ని మెచ్చుకోవచ్చు.

తీర్పు :

ఒక సోషల్ మెసేజ్ చెప్పాలనుకున్న సినిమా కావడం, అక్కడక్కడా కనిపించే దర్శకుడి మార్క్ సన్నివేశాలు, హీరోయిన్ అందచందాలు, ఫర్వాలేదనిపించే నటన ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు. ఒక బలమైన సోషల్ మెసేజ్ చెప్పే క్రమంలో కథపై ఓ క్లారిటీ లేకపోవడం, కథనంలో ఎక్కడా ఎమోషన్ లేకపోవడం, దారి తప్పిన మెసేజ్ వంటివి ఈ సినిమాకు మైనస్‌పాయింట్స్. ఇదే సినిమాను అటు పూర్తి ఆఫ్ బీట్ సినిమాగా చాలా సహజంగా హంగులేవీ లేకుండా చేసినా, లేదా మంచి కామెడీతో, పాటలు, హడావుడి, సెంటిమెంట్ సన్నివేశాలతో తీసినా ఆకట్టుకునేదేమో! ఎటూకాకుండా ఈ సినిమాను నడిపించడంతో ‘మిస్ లీలావతి’ టార్గెట్ మిస్‌ఫైర్ అయిందనే చెప్పాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :