సమీక్ష : రయ్ రయ్ – పేరులో ఉన్నంత జోరు లేదు..

సమీక్ష : రయ్ రయ్ – పేరులో ఉన్నంత జోరు లేదు..

Published on Mar 15, 2013 4:40 PM IST
Rye-Rye విడుదల తేదీ : 15 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : సుధీర్ రాజు
నిర్మాత : బి. రామకృష్ణ, ఎస్.ఎస్ రెడ్డి
సంగీతం : శ్రీ వసంత్
నటీనటులు : శ్రీ, అక్ష…  

‘ఈ రోజుల్లో’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్రీ హీరోగా, అక్ష హీరోయిన్ గా తెరకెక్కిన ‘రయ్ రయ్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాలో ఫుల్ క్లాస్ పాత్ర చేసిన శ్రీ ఈ సినిమాలో మాస్ పాత్రలో కనిపించనున్నాడు. సుధీర్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బి. రామకృష్ణ, ఎస్.ఎస్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మించారు. శ్రీ వసంత్ సంగీతం అందించిన ఈ సినిమా ‘రయ్ రయ్’ మంటూ జనాల్లోకి దూసుకు పోయిందా లేక తుస్సుమందా అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

శ్రీను(శ్రీ), చంటి, రాంబాబు, సందీప్ లు చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్. ఈ నలుగురు స్కూల్ కి వెళ్ళకుండా ఊరిమీదపడి ఇష్టమొచ్చినట్టు చేస్తుంటారు. దీంతో గ్రామ ప్రజలంతా కంప్లైంట్ చెయ్యడంతో ఆ ఊరి పెద్ద కమ్ విలన్ భద్రం(ఆహుతి ప్రసాద్) వాళ్ళు ఊరిలో ఉన్న ఆంబోతులతో సమానమని వారిని ఎవ్వరూ పట్టించు కోవద్దని తీర్పిస్తాడు. ఈ సందర్భంలోనే ఈ నలుగురిలో ఒకడైన సందీప్ ఊరు విడిచి పారిపోతాడు. వీరిముగ్గురూ అదే ఊరిలో ఉంటూ అల్లర్లు చేస్తూ గడిపేస్తుంటారు. అలాంటి తరుణంలో శ్రీ భద్రం కూతురు లక్ష్మీ (అక్ష) తో ప్రేమలో పడతాడు. లక్ష్మీ కూడా శ్రీనుని ప్రేమిస్తుంది. భద్రం శ్రీ – లక్ష్మీ పెళ్ళికి ఒప్పుకోడని వీరిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ చేస్తారు. ఆ టైంలో శ్రీను ఫ్రెండ్స్ ఓ ట్విస్ట్ ఇస్తారు.

భద్రం శ్రీను అన్నయ్య, వదినా పిల్లల్ని బందించి తన కూతుర్ని తనకు అప్పగించమనడంతో శ్రీను లక్ష్మీ వెతికే పనిలో పడతాడు. ఈ చేజ్ లో దుర్గ లక్ష్మీని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలుసుకున్న శ్రీను లక్ష్మీ ని విపించడానికి ఏం చేసాడు? లక్ష్మీని విడిపించి శ్రీను తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా, లేదా? సాఫీగా సాగిపోతున్న కథలోకి దుర్గ ఎలా వచ్చాడు, అసలు ఈ దుర్గ ఎవరు? ఫ్రెండ్స్ శ్రీనుకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అనేదే ఈ సినిమా మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మొదటి సినిమాలో క్లాస్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్న శ్రీ ఈ సినిమాలో కూడా మాస్ పాత్రతో కొన్ని పంచ్ డైలాగ్స్, కొన్ని పేరడీ డైలాగ్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అక్ష ఒక పల్లెటూరి అమ్మాయిలా చాలా బాగా సరిపోయింది. ఆమె పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మామూలుగా ఇండియన్ ట్రెడిషన్ కి అద్దం పట్టే చీర అమ్మాయిలోని ఏ పార్ట్ చూపించాలో ఏ పార్ట్ చూపించకూడదో అనే విషయాన్ని పర్ఫెక్ట్ గా డీల్ చేస్తుందని అని అంటుంటారు, డైరెక్టర్ ఈ సామెతని వాడుకొని ట్రెడిషనల్ గానే అక్షని సీన్స్ లో, అలాగే పాటల్లో బాగా గ్లామరస్ గా చూపించాడు. క్రూరమైన విలన్ భద్రం(ఆహుతి ప్రసాద్) పాత్రలో బాగా నటించాడు. 35 ఏళ్ళు వచ్చినా పర్ఫెక్ట్ అమ్మాయి కావాలి లేకపోతే పెళ్లి చేసుకోను అనే కామెడీ విలన్ దుర్గ తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు . ఇంటర్వెల్ ముందు చిత్రం శ్రీను పై చేసిన ‘కొంటె చూపుతో’ సాంగ్ పేరడీ, అలాగే ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

హీరో శ్రీ యాక్టింగ్, ఫైట్స్ విషయంలో మెప్పించినా డాన్స్ విషయంలో మాత్రం మెప్పించలేకపోయాడు. డాన్సుల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మామూలుగా అందరూ కోపం వచ్చినప్పుడు “కోసి కారం పెడతా నా ….. (సెన్సార్ మీరే ఫైల్ చేసుకోండి ఆ గ్యాప్ ని)” అంటూ ఉంటారు, ఈ సినిమాలో మన విలన్ ఈ డైలాగ్ అనడు కానీ అదేపనిని డైరెక్ట్ గా చేసేస్తుంటాడు. ఎవరన్నా ఎమన్నా చేస్తే చాలు వారి ప్యాంటు ఊడదీసి కోసి కారం పెడుతుంటాడు. మన విలన్ దగ్గర మరో యాంగిల్ కూడా ఉందండోయ్ ఎవరన్నా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే చాలు ఏదో కూరగాయలు తరిగినంత ఈజీగా వాన్ని అక్కడికక్కడే చంపేస్తాడు, అలాగే ఓ సీన్ లో చిన్నపిల్లల్ని జుట్టు పట్టుకొని టార్చర్ చెయ్యడం ఇలాంటి సీన్స్ ఎబ్బెట్టుగా, చూసేవారికి ఇబ్బంది కలిగించేలా ఉంటాయి. అందుకనే క్రూరమైన విలన్ అని చెప్పా.

ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు గతంలో వచ్చాయి కానీ అక్కడక్కడా దర్శకత్వ ప్రతిభతో బాగానే డీల్ చేసిన దర్శకుడు కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఎందుకంటే రొటీన్ కాన్సెప్ట్ కావడంతో ఊహా జనితంగా లేకుండా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకోవాల్సింది. సెకండ్ విలన్ దుర్గా పాత్రని బాగా డిసైన్ చేసుకున్నప్పటికీ ఆ పాత్ర నెక్స్ట్ ఎం చేస్తుందా అనేది ముందే తెలిసిపోతూ ఉండడంతో సస్పెన్స్ మిస్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో వచ్చే చేస్జింగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అంత ఎఫెక్ట్ గా ఉండవు. సెకండాఫ్ లో కామెడీ కోసం ఉపయోగించిన బంచిక్ బాబా, ప్ర పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకుండా కథని ముగించేసాడు. సినిమాలో కాకుండా విడిగా చూస్తె కొన్ని పాటలు బాగానే ఉంటాయి కానీ సినిమాలో అయితే ఒకటి రెండు పాటలు తప్ప మిగతా అన్ని పాటలు ఇరికించినట్టు ఉంటాయి.

కథలో అక్కడక్కడా వచ్చిన రెండు చిన్న ఫైట్స్ ని డీసెంట్ గానే ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ కి ఏమైందో ఏమో గానీ క్లైమాక్స్ ఫైట్ లో హీరో గాల్లోకి ఎగిరి ఎగిరి కొట్టడం, హీరో కొడితే రౌడీలు గాల్లోకి ఎగరడం లాంటివి పెట్టి ఆడియన్స్ కి చిరాకు తెప్పించాడు. నా కూతుర్ని నాకు అప్పగించకపోతే హీరో అన్న ఫ్యామిలీని చంపేస్తాను అన్న విలన్ కి ఏమవుతుందో ఏమో తెలియదు చివర్లో హీరో హీరోయిన్ ని తీసుకు రాగానే అల్లుడు అని పిలిచి శుభం కార్దు వెయ్యడంలో ఎంత లాజిక్ ఉందో అనేది దర్శకుడికే తెలియాలి.

సాంకేతిక విభాగం :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా మూడు విభాగాలను డీల్ చేసిన సుధీర్ రాజు డైరెక్షన్ శాఖలో మాత్రమే యావరేజ్ మార్కులతో పాసయ్యాడు మిగతా రెండు విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యాడు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పాటలు, హీరోయిన్ చూపించే సీన్స్ లో బాగుంది మిగతా సీన్స్ లో జస్ట్ యావరేజ్ గా ఉంది. ఎడిటింగ్ ఓకే కానీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్ ని, సెకండాఫ్ లో చేజింగ్ సీన్స్, అలాగే బంచిక్ బాబా ఎపిసోడ్స్ దగ్గర కాస్త కత్తిరించి ఉంటే ఇంకాస్త బాగుండేది. ఎంత మాత్రం మాస్ సినిమా అనడంతో శ్రీ వసంత్ అన్ని పాటల్లో, బ్యాక్ గ్రాండ్ స్కోర్ లో డప్పు సౌండ్, డ్రమ్స్ తప్ప ఇంకే వాయిద్యాలు పెద్దగా ఉపయొగించలేదు. సినిమాకి మ్యూజిక్ పెద్దగా హెల్ప్ చెయ్యలేకపోయింది. డైలాగ్స్ పరవాలేధనిపించేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే.

తీర్పు :

పాత కాన్సెప్ట్ నే మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా ‘రయ్ రయ్’. సినిమా పేరులో ఉన్నంత జోరు సినిమాలో లేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. కథ, స్క్రీన్ ప్లే ఊహించే విధంగా ఉండటం, కామెడీ లేకపోవడం, స్లోగా ఉండే మొదటి 50 నిమిషాలు సినిమాకి మైనస్ పాయింట్స్. హీరో మాస్ పెర్ఫార్మన్స్, హీరోయిన్ ట్రెడిషనల్ గ్లామర్, సెకండ్ విలన్ దుర్గ పాత్ర సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ సినిమా ఎ క్లాస్ కి నచ్చదు, బి క్లాస్ కి చిరాకు తెప్పిస్తుంది, సి క్లాస్ ని కొంతవరకూ ఆకట్టుకోవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ – 2/5

రాఘవ

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు