సమీక్ష : నా కథలో నేను – ఈ కథ లో అంతగా ఏమి లేదు

సమీక్ష : నా కథలో నేను – ఈ కథ లో అంతగా ఏమి లేదు

Published on Apr 27, 2018 9:03 PM IST
Na Kadha Lo Nenu movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 27, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సాంబశివ, సంతోషి శర్మ

దర్శకత్వం : శివప్రసాద్‌ గ్రంధే

నిర్మాతలు : శివప్రసాద్‌ గ్రంధే

సంగీతం : నవనీత్‌

సినిమాటోగ్రఫర్ : లక్క ఏకారి

స్క్రీన్ ప్లే : శివప్రసాద్‌ గ్రంధే

భిన్నమైన కథాంశంతో తెరకెక్కిస్తే సక్సెస్ సాదించవచ్చు అనే నమ్మకంతో ఇప్పటికే అనేకమైన చిన్న సినిమాలు మన ముందుకొచ్చాయి. ఈ తరహాలోనే ఇప్పుడు మన ముందుకు వచ్చిన సినిమా ‘నా కథలో నేను’. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
సంజయ్ (సాంబశివ) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే మామూలు వ్యక్తి. అతనికి భార్య ప్రియ (సంతోషి శర్మ). ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అలాంటిది వారి జీవితంలో ఒక అనుకోని కష్టం చోటు చేసుకుంటుంది. దాంతో సంజయ్ ఉన్నపళంగా కోటి రూపాయల్ని వెచ్చించాల్సి వస్తుంది. ఆ కష్టం ఏంటి, దానికి కారకులెవరు, చివరికి సంజయ్, ప్రియల జీవితం ఏమైంది అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో పెద్దగా మెచ్చుకోదగిన అంశాలేవీ లేకపోయినా ఉన్నవాటిలోనే కాస్తో కూస్తో బాగుందనిపించే పాయింట్ కథలోని కీలక మలుపు. అప్పటి వరకు బోరింగ్ ట్రాక్లో సాగుతున్న సినిమా ఈ మలుపుతో కొంత పర్వాలేదు అనేలా మారుతుంది.

డబ్బు కోసం ఈ కాలంలో మనుషులు ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని కూడ ప్రస్తావించాడు దర్శకుడు శివప్రసాద్‌ గ్రంధే. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు చిన్న చిన్న ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదు కొంత బాగానే ఉన్నాయి. అలాగే హీరోయిన్ అంత గొప్పగా కాకపోయినా అందరిలోకి బెటర్ అనే పెర్ఫార్మెన్స్ కనబర్చింది.

మైనస్ పాయింట్స్ :

విఫలవడానికి ఒక సినిమాలో ఎన్ని పొరపాట్లు ఉండాలో అన్ని పొరపాట్లు ఈ సినిమాలో దొర్లాయి. కథ, కథనం దగ్గర్నుంచి మొదలుపెడితే శుభం కార్డు పడే వరకు ప్రతి సన్నివేశంలోనూ తప్పులు కనబడ్డాయి. కథ ఎలాగూ కొత్తది కాదు కాబట్టి కథనం పైన అయినా దర్శకుడు శివ ప్రసాద్ కొంత ఎఫర్ట్ పెట్టాల్సింది. సినిమా మొత్తం మీద పలానా సన్నివేశాన్ని, పాత్రని, ట్రాక్ ను కష్టపడి రాశారు అని చెప్పడానికి అవకాశమే దొరకదు.

పోనీ సన్నివేశాల టేకింగ్ అయినా బాగుందా అంటే అదీ లేదు. ఇలాంటి భారీ పొరపాట్లకు తోడు ఏమాత్రం ఆకట్టుకోకపోగా చిరాకు పెట్టిన నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం కలిసి సినిమాను చాలా వరకు విసుగు తెప్పించేలా తయారుచేశాయి. ముఖ్యంగా హీరో స్నేహితుల మీద నడిచే సన్నివేశాలు తల పట్టుకునేలా చేశాయి.

ఇక కథలో ప్రధానమైన లవ్ ట్రాక్ కూడ బోర్ కొట్టించింది. హీరో హీరోయిన్ల మధ్యన రొమాన్స్ అనేదే పండలేదు. మధ్యలో వచ్చే పాటలైతే విసిగించి సినిమా ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అనిపించింది.

సాంకేతిక విభాగం:
దర్శకుడు శివప్రసాద్‌ గ్రంధే డబ్బు మనిషి చేత ఎంతటి తప్పునైనా చేయిస్తుంది అనే సందేశం ఇవ్వడానికి రాసుకున్న కథాంశం కొంత పర్వాలేదనిపించినా కథనం మాత్రం అస్సలు బాగోలేదు. ఇక ఆయన ఎంచుకున్న నటీ నటుల నటనైతే తలా నొప్పిగా పరిణమించింది. సన్నివేశాల టేకింగ్ కూడ సరిగాలేదు.

లక్క ఏకారి సినిమాటోగ్రఫీ స్థాయి షార్ట్ ఫిల్మ్ క్వాలిటీ కన్నా తక్కువగా స్థాయిలో ఉంది. నవనీత్‌ అందించిన సంగీతం అస్సులు ఆకట్టుకోలేదు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చెప్పుకోదగినంత స్థాయిలో లేవు.

తీర్పు:
డబ్బు మనిషి చేత ఏమైనా చేసేలా చేస్తుంది అనే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో శివప్రసాద్‌ గ్రంధే రూపొందించిన ఈ చిత్రం సందేశాన్ని గట్టిగా అందించలేకపోగా చూస్తున్నంతసేపు తెగ బోర్ కొట్టించింది. ఏమాత్రం బలంలేని కథనం, ఒక కనీస సినిమాకు ఉండాల్సిన స్థాయిలో సన్నివేశాల మేకింగ్ లేకపోవడం, మెప్పించలేకపోయిన నటీ నటుల నటన అన్నీ కలిసి సినిమాను నీరుగార్చేసాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారాంతంలో ఈ సినిమాను మర్చిపోవడం మంచింది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు