సమీక్ష : నగరం – ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్

Nagaram movie review

విడుదల తేదీ : మార్చి 10, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం :లోకేష్ కనగరాజ్

నిర్మాతలు :అశ్విని కుమార్ సహదేవ్

సంగీతం :జావేద్ రియాజ్

నటీనటులు :సందీప్ కిషన్, రెజినా

గత కొన్నాళ్లుగా కెరీర్లో సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ‘నగరం’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్ర తమిళ్, తెలుగు రెండు భాషల్లోనూ రిలీజవుతోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఈ సినిమా అంతా సమాంతరంగా నడిచే నాలుగు విడి విడి కథల ఆధారంగా నడుస్తుంది. ఒక పెద్ద క్రిమినల్ కుమారుడి ప్రమేయమున్న ఒక కిడ్నాప్ లో అప్పటి వరకు సరదాగా, హాయిగా కాలం గడిపే సందీప్ కిషన్ మరియు రెజినాలు అనుకోకుండా ఇరుక్కుంటారు. సినిమా అంతా వాళ్ళు ఆ కిడ్నాప్ లో ఎలా ఇరుక్కున్నారు ? సమయంతో పాటు ఒక్కొక్క కథ ఎలా నడిచింది ? చివరకు ఆ నాలుగు కథలు ఎలా ముగిశాయి ? అనేది చూపబడుతుంది.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే చెప్పుకోవలసింది ఆరంభం నుండి చివరి వరకు కొనసాగించబడిన సస్పెన్స్. దీని వలన తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఉత్సుకత కొనసాగింపబడి ఎక్కడా ప్రేక్షకుడి ఆసక్తి సడలిపోలేదు. దర్శకుడు లోకేష్ తను రాసుకున్న మంచి స్క్రీన్ ప్లేని అద్భుతంగా తెరపై ఆవిష్కరించి కాస్త సంక్లిష్టమైన కథను అర్థమయ్యేలా వివరించాడు.

సందీప్ కిషన్ కూడా హీరో ఇమేజ్ ను వదిలేసి ఒక నటుడిగా కథలోని పాత్రలో కలిసిపోయాడు. నిర్లక్ష్యం ఉన్న కుర్రాడిగా అతని లుక్స్, హావభావాలు, నటన అన్నీ మెప్పించాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో చేసిన మరొక యువ నటుడు శ్రీ కూడా బాగా నటించాడు. మొదటి భాగం మొత్తాన్ని మంచి ఆసక్తికరమైన కిడ్నాప్ సన్నివేశాలతో చాలా బాగా నడిపాడు దర్శకుడు.

ఇక సెకండాఫ్ అంతా ఒక్కొక్క పాత్ర కథలో ఇన్వాల్వ్ అవుతూ చాలా బాగా తయారైంది. చిన్న చిన్న కథలను కలిపి మంచి కథనంతో ప్రధాన కథను తయారు చేయడం మెప్పించింది. అలాగే చెన్నై లాంటి మహా నగరంలో నేరాలు జరిగే విధానాన్ని రియలిస్టిక్ గా చూపడం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

హీరోయిన్ రెజినాకు కథలో అంతగా ప్రాధాన్యం లేదు. సినిమా కథనం బాగానే ఉన్న ఒక్కొక్క పాత్రను పరిచయం చేయడానికి, కథనంలో కుదురుకునేలా చేయడానికి దర్శకుడు మరీ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. ఇలాంటి వేగవంతమైన కథనం ఉన్న సినిమాల్లో సన్నివేశాలు కూడా వేగంగానే ఉండాలి. కానీ ఇందులో కాస్త సాగదీసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి కథనం యొక్క వేగాన్ని కాస్త దెబ్బతీశాయి. అలాగే ఫస్టాఫ్ బాగున్నా లెంగ్త్ కాస్త ఎక్కువైనట్టు తోచింది. చివరగా సినిమా ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ కథ కొన్ని చోట్ల రిపీట్ అవుతున్నట్టు తోచింది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో సాంకేతిక విభాగం పని తీరు గొప్పగానే ఉంది. ముఖ్యంగా సెల్వకుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. క్రైమ్ సన్నివేశాల్ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. చెన్నై మహా నగరాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ కూడా తగిన విధంగా ఉంది. సౌండ్ డిజైన్ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలు థ్రిల్స్ ని కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా ప్రభావవంతంగా చూపించారు.

దర్శకుడు లోకేష్ రాసుకున్న కథను చాలా బాగా చెప్పాడు. నాలుగు విడివిడి కథలను ఒకటిగా కలుపతూ సినిమాను నడపడంలో, నటీ నటుల నుండి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టడంలో అతను పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథనంలోని ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా వివరించాడు.

తీర్పు :
ఈ ‘నగరం’ చిత్రం హీరో సందీప్ కిషన్ కు తప్పక విజయాన్నందిస్తుందని చెప్పొచ్చు. నటీనటుల నటన, కట్టిపడేసే కథ కథనాలు, వాస్తవికతకు దగ్గరగా ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్. మొత్తం మీద కథనంలో కాస్త నెమ్మదితనాన్ని, రెగ్యులర్ తెలుగు సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఇందులో పెద్దగా లేకపోవడాన్ని పట్టించుకోకపోతే ఈ ‘నగరం’ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి మంచి చాయిస్ అవుతుంది.

గమనిక : హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోను వీక్షించి ఈ సమీక్ష ఇవ్వబడినది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :