సమీక్ష : నందిని నర్సింగ్ హోమ్ – సస్పెన్స్‌తో థ్రిల్, కామెడీతో జిల్..!!

Tanu Vachenanta review

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : పి.వి.గిరి

నిర్మాత : రాధాకిషోర్ జి, భిక్షమయ్య సంగం

సంగీతం : అచ్చు

నటీనటులు : నవీన్ విజయ్ కృష్ణ, శ్రావ్య, నిత్యా నరేష్..


సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘నందిని నర్సింగ్ హోమ్. నవీన్‌కు బంధువైన సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా ఆడియోను ఆవిష్కరించడంతో అప్పట్నుంచే మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ నందిని నర్సింగ్ హోమ్‌ ఎంతవరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

చంద్రశేఖర్ అలియాజ్ చందు (నవీన్ విజయ్ కృష్ణ)కు డబ్బంటే ఎంతో ఇష్టం. బాగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో హైద్రాబాద్ వచ్చిన అతడికి, అనుకోకుండా సిటీలోనే పెద్ద హాస్పిటల్స్‌లో ఒకటైన నందిని నర్సింగ్ హోమ్‌లో డాక్టర్‌గా ఉద్యోగం వస్తుంది. డాక్టర్ అవ్వడానికి తనవద్ద ఏ అర్హతా లేకున్నా, దొంగ డాక్టర్‌గా ఆ ఉద్యోగంలో చేరతాడు. నందిని నర్సింగ్ హోమ్‌లో చందు చేరకముందు నుంచే కొన్ని భయానక సంఘటనలు జరుగుతుంటాయి. చందు అక్కడ చేరాక ఈ సంఘటనలు మరింత పెరిగిపోతాయి. దీంతో నందిని నర్సింగ్ హోమ్ పేరు కూడా పడిపోతుంది. ఈ సంఘటనలు అన్నింటికీ కారణం ఎవరు? నందిని నర్సింగ్ హోమ్‍ను దెబ్బతీయాలని ఎవరు చూస్తూంటారు? దీన్ని చందు ఎలా కనిపెడతాడు? ఈ కథలో నందిని (నిత్యా నరేష్), అమూల్య (శ్రావ్య) ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదట్నుంచీ, చివరివరకూ ఎంతో ఆసక్తిగా నడిపించిన విధానాన్ని చెప్పుకోవాలి. రెగ్యులర్ కమర్షియల్ కామెడీగా కనిపించే కథలో మొదటి సీన్‌తోనే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదలుపెట్టడం, క్లైమాక్స్ వరకూ అది ఏమై ఉంటుందా అని ఆలోచించేలా చేయడం బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఊహించే విధంగా ఉండకపోవడం మరో బలం. ఈ సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ అయ్యే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయి. వైజాగ్ నేపథ్యంలో నడిచే నవీన్ – శ్రావ్యల ప్రేమకథ కూడా బాగుంది. వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్‌ల కామెడీ సినిమా ఆద్యంతం సాగుతూ బాగా నవ్వించాయి. ఈ ముగ్గురూ తమ కామెడీతో సినిమాకు ఓ మంచి స్థాయి తెచ్చారు.

నవీన్ విజయ్ కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా బాగా చేశాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ అన్నీ ఒక డెబ్యూట్ హీరో స్థాయికి మించి ఉండడంతో ఎక్కడా కొత్త హీరోను చూస్తున్న ఫీలింగ్ కనిపించలేదు. నిత్యా నరేష్ క్యూట్‌గా ఉంది. ఉన్నంతలో తన పాత్రలో ఆమె బాగా నటించింది. శ్రావ్య లుక్స్ బాగున్నాయి. జయప్రకాష్ తన స్థాయికి తగ్గ పాత్రలో బాగా నటించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే లెంగ్త్ కాస్త ఎక్కువవ్వడం అనే చెప్పుకోవాలి. కొన్ని అనవసరమైన సన్నివేశాలకు చోటిస్తూ పోవడం వల్ల అక్కడక్కడా సినిమా చాలా నెమ్మదిగా నడిచినట్లనిపించింది. ఇక కామెడీ పంచడంలో ఎక్కడా తగ్గకపోయినా, వెన్నెల కిషోర్, సప్తగిరి ట్రాక్ కాస్త ఎక్కువసేపు సాగినట్లనిపించింది. సెకండాఫ్‌లో అసందర్భంగా వచ్చే ఓ పాటను కూడా మైనస్‌గానే చెప్పుకోవాలి.

అదేవిధంగా తాను దొంగ డాక్టర్ అవ్వడం వల్ల, తన చేతుల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాక కూడా హీరో చాలా సాదాసీదాగా నవ్వుతూ తిరగడం చూస్తే కథ ఎమోషన్‌ను దెబ్బతీసినట్లే అనిపించింది. ఇక లాజిక్ అన్న దాన్ని చాలాచోట్ల పట్టించుకోలేదనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు పివి గిరి విషయానికి వస్తే, ఒక పక్కా కమర్షియల్ తెలుగు సినిమా ఫార్మాట్‌లోనే మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను పట్టుకొని దానిచుట్టూనే తెలివిగా ఓ కథ చెప్పడంలో మంచి విజయం సాధించాడు. సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ ఆసక్తికరంగా నడిపించేలా చేయడంలో దర్శకుడి ప్రతిభను గమనించవచ్చు. అనవసరమైన పాటలకు, సన్నివేశాలకు చోటివ్వకుండా, కాస్త లెంగ్త్ తగ్గించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదనిపించింది. సస్పెన్స్ ఎలిమెంట్ చుట్టూ సినిమా నడిచేటప్పుడల్లా మేకింగ్ పరంగా చేసిన ప్రయోగాలు బాగున్నాయి.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నర్సింగ్ హోమ్‌లోనే ఎక్కువగా నడిచే సినిమాలో, ఉన్న లొకేషన్స్‌నే తెలివిగా వాడిన విధానం మెచ్చుకోవచ్చు. ఎడిటింగ్ ఫర్వాలేదనలే ఉంది. పాటలు రెండు వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని అభినందించాల్సిందే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఒక మిడిల్ బడ్జెట్ సినిమా స్థాయిలో ఎక్కడా తగ్గకుండా బాగున్నాయి.

తీర్పు :

ఒక రెగ్యులర్ కమర్షియల్ కామెడీలో ఏ ప్రేక్షకుడైనా కొన్ని అంశాలను కోరుకొని వెళుతుంటారు. ఈ సినిమానూ అలాగే ఊహించుకొని వెళితే, బాగా నవ్వించే ఈ కమర్షియల్ కామెడీతో పాటు అదిరిపోయేలా ఓ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఉండడం సర్‌ప్రైజ్. ఆద్యంతం ఆ సస్పెన్స్ ఎలిమెంట్‌ను చాలా తెలివిగా దాచిపెడుతూ క్లైమాక్స్‌లో బయటపెట్టడం, ఈ మధ్యలో ఎక్కడా బోర్ కొట్టకుండా వచ్చే మంచి కామెడీ లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో అనవసరమైన సన్నివేశాలు కొన్ని సినిమాను నెమ్మదించడం, లెంగ్త్ కాస్త ఎక్కువవ్వడం అన్నది మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. కామెడీతో జిల్‌మనిపిస్తూనే, సస్పెన్స్‌తో థ్రిల్ చేసే సినిమా ‘నందిని నర్సింగ్ హోమ్’!

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More