Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఓ చెలియా నా ప్రియ సఖియా – చెలి కాదు, సఖీ కాదు..!

O Cheliya Naa Priya Sakhiya

విడుదల తేదీ : 03 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : పి. రమేష్ బాబుల్ రెడ్డి

నిర్మాత : పి. రమేష్ బాబుల్ రెడ్డి

సంగీతం : సాకేత్ నాయుడు

నటీనటులు : మనోజ్ నందం, స్మితిక, మోనిక సింగ్

కమలేశ్వరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై మనోజ్ నందం, స్మితిక, మోనిక సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. పి. రమేష్ బాబుల్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్‌ఫుల్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెప్పబడిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

ప్రతి విషయంలోనూ బెటర్‌మెంట్‌ను కోరుకుంటూ ఉండే వ్యక్తిత్వం ఉన్న యువకుడు మురళి (మనోజ్ నందం). ప్రేమకు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఆపాదించి బెటర్‌మెంట్ పేరుతో ఎవరినీ ప్రేమించే ఆలోచన చేయడు. ఈ క్రమంలోనే అతడికి కావ్య (స్మితిక) పరిచయం అవుతుంది. కావ్యతో కలిసి తిరగడం, ఆలోచనలు పంచుకోవడం ద్వారా అతి కొద్దిరోజుల్లోనే ఆమెకు దగ్గరవుతాడు. మురళి తనను ప్రేమిస్తున్నాడని అనుకుంటున్న తరుణంలోనే తాను ఒక పరిచయం లేని అమ్మాయి ప్రేమలో ఉన్నానని మురళి చెప్పడం కథలో ట్విస్ట్.

ఆ తర్వాత తాను ప్రేమించిన అమ్మాయి నమీ (మోనికా సింగ్) అనుకోకుండా అతడి జీవితంలోకి రావడం, ఓ ధనిక కుటుంబానికి చెందిన ఆ అమ్మాయితో అతి తొందర్లోనే మురళి దగ్గరైపోవడం జరుగుతుంది. అంతా తాను ఊహించిందే జరుగుతుందని అనుకుంటుండగానే నమీ, మురళికి ఓ షాక్ ఇస్తుంది. నమీ మురళికిచ్చిన షాక్ ఏంటి? ఆ తర్వాత కథేంటి? కావ్య ఎక్కడికెళ్ళింది? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ప్లస్‌ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్ అంటే.. మురళి క్యారెక్టర్ పాటించే బెటర్‌మెంట్ అనే కాన్సెప్ట్‌ను డీల్ చేయడం గురించి చెప్పుకోవాలి. డబ్బు, హోదా ఇలా ఏ విషయంలోనైనా బెటర్‌మెంట్ కోరుకోవాలి కానీ ప్రేమించే వారిలో, ప్రేమలో బెటర్‌మెంట్ కోసం వెతుకుతూ పోవడం మంచిది కాదనే విషయాన్ని ఈ సినిమా ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఆ విషయంలో దర్శకుడు కొంతమేరకు విజయం సాధించాడనే చెప్పొచ్చు.

మురళిగా మనోజ్ బాగానే నటించాడు. ముఖ్యంగా పెద్ద పెద్ద డైలాగులను కూడా బాగానే చెప్పాడు. అయితే అతడి వాయిస్, యాక్టింగ్‌లో మెచ్యూరిటీ ఇంకా రావాలి. ఇద్దరు హీరోయిన్లున్న ఈ సినిమాలో స్మితిక తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. ఇక మోనిక కూడా ఓ మోడర్న్ అమ్మాయిగా బాగానే నటించింది. గ్లామర్ పరంగా ఇద్దరూ ఫర్వాలేదనిపిస్తారు. ఇక ఈ సినిమాలో ఓ ఊరి పెద్దగా ప్రముఖ రాజకీయ నాయకుడు తులసి రెడ్డి ఓ పది నిమిషాలు కనిపించి మెప్పిస్తారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్‌లో ప్రేమ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, కామెడీతో ఫర్వాలేదనిపిస్తే, సెకండాఫ్‌లో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఓవరాల్‌గా రెండు భాగాలూ మరీ ఆకట్టుకునేలా ఏం లేవు.

మైనస్ పాయింట్స్ :

బెటర్‌మెంట్ కోసం హీరో తపించడమనే అంశాన్ని పక్కనపెడితే ఈ సినిమాలో కొత్తదనమనేదే లేదు. కథ, కథనాలు మనం ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చూసి ఉన్నవే కాక, అప్పటికే బోర్ కొట్టి ఉన్నవి కూడా. తెలిసిన కథనే అందంగానో, ఎంటర్‌టైనింగ్‌గానో చెప్పకపోవడంతో సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. ఇక హీరో, హీరోయిన్లిద్దరి క్యారెక్టరైజేషన్‌లకు ఎక్కడా సరైన జస్టిఫికేషన్ గానీ, క్లారిటీ గానీ లేక అంతా అయోమయంగా కనిపిస్తుంది.

సినిమాలో పాటలు ఎప్పుడు, ఎందుకొస్తాయో అస్సలు అర్థం కాదు. రెండు గంటల పది నిమిషాల రన్‌టైమే ఉన్నా ఈ పాటల వల్ల మూడు గంటల బోరింగ్‌ను భరిస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫైట్ల కోసమనే రెండు అనవసర సన్నివేశాలను తీసుకొచ్చారు. ఇక కమర్షియాలిటీ నెపంతో కొన్ని అనవసరమైన కామెడీ బిట్లు పెట్టి విసుగు తెప్పించారు. కావ్య పాత్ర చుట్టూ ఉండే ఫ్రెండ్స్ మధ్యన వచ్చే సంభాషణలకు చాలా వరకు కత్తెర పడినా కూడా ఆ సన్నివేశాలు వల్గర్‌గా ఉంటూ ఎబ్బెట్టుగా కనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగానూ ఈ సినిమా సోసోగానే ఉందని చెప్పాలి. వెంకట్ మంజుల అందించిన రొటీన్ కథకు దర్శకుడు రమేష్ బాబుల్ రెడ్డి అల్లిన రొటీన్ స్క్రీన్‌ప్లే కలిసి కథ, కథనాల విషయంలో ఆసక్తికర అంశాలేవీ లేకుండా పోయాయి. ఇక దర్శకత్వం పరంగానూ రమేష్ అరకొర మార్కులనే సంపాదించుకున్నారు. ఒక్క బెటర్‌మెంట్ అనే చిన్న కాన్సెప్ట్‌ను మాత్రం కొంతమేర నేర్పుగానే చెప్పే ప్రయత్నం చేశారు.

సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చిన్న సినిమాల్లో కథ తర్వాత మేజర్ హైలైట్‌గా నిలవాల్సిన సినిమాటోగ్రఫీ ఇక్కడ వీక్ అయింది. సాకేత్ అందించిన పాటల్లో ఒక్క పాట మినహా చెప్పుకోవాడానికి ఏమీ లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపించారు. ఎడిటింగ్ మామూలుగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా సాధారణంగానే ఉన్నాయి.

తీర్పు :

చిన్న సినిమా అంటే తెలుగులో ఎక్కువగా ప్రేమకథలపైనే ఆధారపడి ఉండడాన్ని ఎప్పట్నుంచో చూస్తూ ఉన్నాం. తాజాగా అదే కోవలో వచ్చిన మరో ట్రయాంగిల్ ప్రేమకథే ఈ ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. ప్రేమలో బెటర్‌మెంట్ అనే అంశం కోసం విపరీతంగా వెతుక్కోవద్దనే సందేశంతో వచ్చిన ఈ సినిమాలో మేజర్ హైలైట్ అంటే ఆ అంశం మాత్రమే! అతి సాధారణమైన కథను అంతే సాధారణమైన స్క్రీన్‌ప్లేతో నడిపించి ఈ సినిమాను కొత్తదనమేమీ లేని ఓ సాధారణ చిన్న సినిమాగానే మిగిల్చారు. చిన్న సినిమా అనేది నిలబడాలంటే ఓ బలమైన కథతో పాటు ఆసక్తికరమైన అంశాల మేళవింపు ఉండాలన్నది నిస్సందేహంగా ఒప్పుకోవాల్సిన సత్యం. ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ సినిమాను ఆ సత్యాన్ని విస్మరించిన సినిమాగానే చెప్పుకోవాలి!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం


సంబంధిత సమాచారం :