Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఓ స్త్రీ రేపు రా – ‘హర్రర్’ అనుకుంటే నిరాశే!

O Sthree Repu Raa review

విడుదల తేదీ : 11 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : అశోక్ రెడ్డి

నిర్మాత : రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్

సంగీతం : ఘంటసాల విశ్వనాథ్

నటీనటులు : అశిష్ గాంధీ, వంశీకృష్ణ, దీక్షా పంథ్, శృతి మోల్..

1990వ దశకంలో ఊర్లో దయ్యం తిరుగుతుందని, అది తమ తమ ఇళ్ళల్లోకి రాకుండా ఉండడానికి ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసుకోవాలని అప్పట్లో చాలాకథలు ప్రచారంలోకి వచ్చాయి. అదే ‘ఓ స్త్రీ రేపు రా’ పేరుతో ఇప్పటికీ అలాంటి తరహా కథలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కాన్సెప్ట్‌కు ఓ కల్పిత కథను జోడించి ‘కల్పితమా, నిజమా..’ అన్న ట్యాగ్‌లైన్‌తో దర్శకుడు అశోక్ రెడ్డి చేసిన ప్రయత్నమే ‘ఓ స్త్రీ రేపు రా’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

మోనిక (దీక్షా పంథ్) ఓ రచయిత్రి. తాను రాసిన కథను ఎలాగైన పబ్లిష్ చేయించాలని తపన పడే ఆమెకు, ఓ పబ్లిషర్ ద్వారా ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ చాలా ఊర్లను వణికించిన విషయం వెనుక కథను తెలుసుకొని రాయమనే ఆఫర్ వస్తుంది. దానికోసం ఎంతో కష్టపడి తన ప్రియుడు కళ్యాణ్ (అశీష్ గాంధీ)తో కలిసి రకరకాలుగా వెతగ్గా, మోనికకు ఆత్మలతో మాట్లాడడం అనే గేమ్ ద్వారా ఆమె ఓ స్త్రీ రేపు రా కథ తెలుస్తుంది.

అసలు ఇంతకీ ఈ ఓ స్త్రీ రేపు రా కథేంటీ? ఆ కథలో శీను (వంశీకృష్ణ), కళ్యాణి (శృతి మోల్) ఎవరు? ఓ స్త్రీ రేపు రా కథ తెలుసుకొని మోనిక ఏం చేసింది? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథ. ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ ఎన్నో ఊర్లను వణికించిన కాన్సెప్ట్‌కు ఓ కల్పిత కథను అల్లి, దాన్ని రెండు సమాంతర కథలుగా చెప్పడంలో ఒక మంచి సినిమాకు సరిపడేంత మ్యాటర్ ఉంది. ఇక సినిమా ఓపెనింగ్ సీన్ మంచి ఆసక్తి కలిగిస్తుంది. అలాగే ఫస్టాఫ్‌లో ప్రవేశ పెట్టిన ‘ఓ స్త్రీ రేపు రా’ అనే సస్పెన్స్ ఎలిమెంట్‌ను క్లైమాక్స్ వరకూ బాగానే లాక్కొచ్చారు. ఇక సెకండాఫ్‌లో వచ్చే శీను, కళ్యాణి ప్రేమకథ సహజత్వానికి దగ్గరగా, బాగుంది.

ఇక సినిమాలో నటీనటులంతా తమ పరిధిమేర బాగానే నటించారు. అశీష్ తన పాత్రకు న్యాయం చేశాడు. వంశీ కృష్ణ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో ది బెస్ట్ ఇచ్చాడు. హీరోయిన్లు ఇద్దరూ గ్లామర్ పరంగా, నటన పరంగా ఫర్వాలేదనిపించారు. సినిమా పరంగా చూసుకుంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, సెకండాఫ్‌లో వచ్చే శీను-కళ్యాణిల ప్రేమకథను హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ ఒక హర్రర్ కథగా సినిమాను ప్రచారం చేయడం, సినిమాలో ఈ హర్రర్ పార్ట్ పదిహేను, ఇరవై నిమిషాలకు మించి లేకపోవడాన్ని చెప్పుకోవచ్చు. ఇదేదో హర్రర్ సినిమా అనుకొని, ఆ తరహా సన్నివేశాలను చూడాలని వస్తే నిరాశ తప్పదు. అదేవిధంగా రెండు కథలతో ఒక ప్రధాన కథను చెప్పాలనుకోవడం, ఆ రెండింటికీ మంచి లింక్ కూడా కలబడం బాగానే ఉన్నా, ఈ కథను ఒక పూర్తి స్థాయి సినిమాగా తెరకెక్కించడంలో మాత్రం చాలాచోట్ల విఫలమయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో మొదటి పదినిమిషాల తర్వాత ఇంటర్వెల్ వరకూ సినిమా అతి సాధారణంగా గమ్యం లేనట్టుగా నడుస్తూంటుంది.

ఇక సెకండాఫ్‌లో వచ్చే ప్రేమకథ లెంగ్త్ చాలా ఎక్కువైంది. కొన్ని సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు కనిపిస్తాయి. పాటలు కూడా అనవసరంగా, అసందర్భంగా వచ్చి సినిమా మూడ్‌ను దెబ్బతీశాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సాధారణంగా ఉంది. ఇక సినిమా మొత్తమ్మీద బలమైన హర్రర్ సీన్ ఒక్కటీ లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. దయ్యం చేత కథ చెప్పించడం, అదీ గేమ్ ద్వారా అన్న కాన్సెప్ట్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు అశోక్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. ఇలాంటి ఒక నిజంగా జరిగిన అంశానికి ఓ కథను అల్లి, దానిచుట్టూ సినిమా తీయాలనుకున్న ఆలోచన ఫర్వాలేదు. అయితే ఆ కథను ఒక పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో మాత్రం అశోక్ రెడ్డి పెద్దగా మెప్పించలేకపోయాడు. పవన్‌తో కలిసి స్క్రీన్‌ప్లే రాసుకున్నా అది సాదాసీదాగా ఉంది. ఇక దర్శకుడిగా మాత్రం కొన్ని సన్నివేశాల్లో ఫర్వాలేదనిపించాడు.

సంగీత దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ కీలక సన్నివేశాల్లో మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అయితే అక్కడక్కడా టెంప్లేట్ మ్యూజిక్‌ను వాడినట్లనిపించింది. సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో లవ్‌స్టోరీకి ఓ మంచి మూడ్ తేవడంలో సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ ప్రతిభను చూడొచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నంతలో బాగున్నాయి.

తీర్పు :

ప్రజల్లో ఒకానొక కాలంలో అలజడి సృష్టించిన అంశాన్నే కథాంశంగా ఎంచుకొని, దానిచుట్టూ రెండు కల్పిత కథలను అల్లి ఆ కథాంశాన్ని చెప్పే ప్రయత్నం చేసిన సినిమాయే ‘ఓ స్త్రీ రేపు రా’. పైన చెప్పుకున్న సస్పెన్స్‌తో కూడిన ఈ కథాంశాన్నే మేజర్ హైలైట్‌గా నింపుకున్న ఈ సినిమాను సెకండాఫ్‌లో వచ్చే అసలు కథ, చివరివరకూ సస్పెన్స్ ఎలిమెంట్‌ను కొనసాగించిన విధానం లాంటి అంశాల కోసం చూడొచ్చు. అయితే అసలు కథలో ఉన్నంత విషయం పూర్తి స్థాయి సినిమాలో లేకపోవడం, హర్రర్ సినిమా అన్న ఫీలింగ్ కలిగించి ఎక్కడా హర్రర్ ఎలిమెంట్ అన్నదే లేకపోవడం, కథను పక్కదారి పట్టించే అనవసర సన్నివేశాలు, పాటలు తదితర మైనస్‌లు ఈ సినిమాను నిరాశాజనకంగానే నిలుపుతాయి. . ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక ఏమాత్రం క్రేజ్‌ లేని ఓ చిన్న సినిమా అన్న ఫీలింగ్‌తో చూస్తే ఫర్వాలేదేమో కానీ, అలాకాకుండా పేరు చూసి ఇదేదో హర్రర్ సినిమా అనుకొని చూస్తే భారీ నిరాశ తప్పదు.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :