సమీక్ష : ఒక మనసు – ఓపికపట్టి చూస్తే ‘ఓకే’!

విడుదల తేదీ : 24 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : రామ రాజు

నిర్మాత : మధుర శ్రీధర్

సంగీతం : సునీల్ కశ్యప్

నటీనటులు : నాగశౌర్య, నిహారిక

నాగశౌర్య, నిహారిక హీరో, హీరోయిన్లుగా నటించగా, ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమాతో మెప్పించిన దర్శకుడు రామరాజు తెరకెక్కించిన సినిమా ‘ఒక మనసు’. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకూ హీరోలే పరిచయం కాగా, మొదటిసారి హీరోయిన్‌గా నిహారిక పరిచయమవుతూ చేసిన సినిమా కావడంతో ‘ఒక మనసు’పై మొదట్నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలతోనే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

సూర్య (నాగశౌర్య).. ఎప్పటికైనా, తన తండ్రి కోరికను నెరవేర్చి ఓ మంచి రాజకీయ నాయకుడవ్వాలని కలలు కనే యువకుడు. తన ఆశయాన్ని చేరుకునేందుకు చిన్న చిన్న సెటిల్‌మెంట్స్‌తో అందరికీ దగ్గరయ్యే పయత్నాలు చేస్తూండే అతడికి, సంధ్య (నిహారిక) అనే ఓ హౌస్ సర్జన్ చదివే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం తర్వాత ఇద్దరూ ఒకరినొకరు వదులుకోలేనంత ప్రేమగా మారుతుంది.

అయితే సూర్య జీవితంలో ఇదే సమయంలో అనుకోని మార్పులు వస్తాయి. ఒక తప్పు వల్ల అతడు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. రాజకీయ జీవితం కూడా అయోమయంలో పడిపోతుంది. సూర్య జీవితంలో వచ్చిన ఈ మార్పులు, అతడి ప్రేమకథను ఎటువంటి మలుపులు తిప్పాయి? ఒకరినొకరు వదులుకోలేనంత ప్రేమలో పడిపోయిన సూర్య-సంధ్య ఈ పరిస్థితులకు ఎలాంటి సమాధానం ఇచ్చారు? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే కథను ఎక్కడా అతికి పోకుండా, నిజాయితీగా, కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసిన విధానాన్ని చెప్పుకోవాలి. అదేవిధంగా మొదట్నుంచీ చివరివరకూ సూర్య-సంధ్యల ప్రేమకథలోని కన్ఫ్యూజన్‌ను నడిపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇక ఈ రెండు పాత్రల్లో నటించిన నాగశౌర్య, నిహారిక ఇద్దరి కెమిస్ట్రీ కట్టిపడేసేలా ఉంది. నాగశౌర్య క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆ పాత్రతో ఇట్టే కనెక్ట్ అయిపోయితాం.

నాగశౌర్య ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచే నటన ప్రదర్శించాడు. ఆ పాత్రలోని ఎమోషన్‌ను నాగశౌర్య క్యారీ చేసిన విధానం అద్భుతంగా ఉంది. నిహారిక మొదటి సినిమాతోనే తన ప్రెజెన్స్ ఏంటో చూపించింది. కొన్ని సన్నివేశాల్లో, ఒకేషాట్‌లో మారిపోయే ఎక్స్‌ప్రెషన్స్‌నే నిహారిక చాలా బాగా పట్టుకుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో నిహారిక చూపిన ప్రతిభను మెచ్చుకోవాల్సిందే! రావు రమేష్ ఎప్పట్లానే తన పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. అవసరాల శ్రీనివాస్ కథకు ఉపయోగపడే ఓ మంచి పాత్రలో కనిపించి బాగానే మెప్పించాడు.

సినిమా పరంగా చూసుకుంటే కథను మొదలుపెట్టిన విధానం, హీరో-హీరోయిన్లు ఇద్దరూ ఒక కథను రెండు కాలాలు, కోణాల్లో చెప్పడం ఫస్టాఫ్‌లో మేజర్ హైలైట్స్. ఇక సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, నాగశౌర్య రాజకీయ జీవితం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, ప్రాక్టికల్ కనిపించకపోయినా ప్రేమకథల్లో ఎప్పుడూ వచ్చే క్లైమాక్స్ లాంటివి హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

‘ఒక మనసు’కి మైనస్ పాయింట్స్ అంటే ముందుగా, ఒకే తరహాలో సాగే సంభాషణలు మళ్ళీ మళ్ళీ రావడం గురించే చెప్పాలి. ఇలా ఒకేలాంటి సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ రావడం వల్ల కథ నిడివిని పెరగడమే కాక, సినిమా అంతా నెమ్మదిగా అస్సలు ముందుకే కదలనట్లుగా కనిపించింది. ప్రధానంగా రెండు పాత్రల చుట్టూనే కథ తిరగాలన్న ఆలోచనతో, కాస్త స్కోప్ ఉన్నా మిగతా పాత్రలతో సినిమాను నడిపించడం వదిలేసినట్లున్నారు. ఇక సంభాషణలు కూడా కొన్నిచోట్ల పాత్రల స్థాయికి మించి ఉన్నట్లుగా కనిపించింది.

అదేవిధంగా సినిమా అంతా 1980,90ల దశకంలోని ప్రేమకథలా సాగుతూంటుంది. ఈతరం ఆలోచనలు అందుకునే కథ కాకపోగా, మళ్ళీ ఇదే ఆలోచనలు, నేపథ్యాల చుట్టూ తిరగడంతో సినిమా అంతా అయోమయంగా కనిపించింది. ఇక క్లైమాక్స్ విషయంలోనూ రెండు కోణాలు ఉన్నాయి. సినిమాలో చూపిన కోణం స్టీరియోటైప్ అనిపించింది. ఇక తెలుగు సినిమా ఫార్మాట్ ప్రకారంగా నడిచే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన సినిమాలనే కోరుకునే వారికి ఇందులో మెప్పించే అంశాలేవీ పెద్దగా లేవు.

సాంకేతిక విభాగం :

దర్శక, రచయిత రామ రాజు, కథగా చెప్పాలనుకున్న ఆలోచన బాగుంది. కెరీర్, ప్రేమ రెండూ వదులుకోలేని పరిస్థితుల్లో ఒక ప్రేమజంట పడే మథనం ఏంటీ? వారి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందీ? అన్న ఆలోచనతో ఓ కథ చెప్పాలన్న ఆలోచన మంచిదే! అయితే దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం, సినిమాటిగ్గానూ వర్కవుట్ అయ్యేవిధంగా మలచడంలో రామ రాజు పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. మేకింగ్ పరంగా రామ రాజు కొన్నిచోట్ల మెప్పించాడు. హీరో-హీరోయిన్ల చేతులు కలవడాన్ని వాళ్ళ ఆలోచనలుగా చెప్పడం, అద్దంపై రాసుకునే చిన్న చిన్న గీతలు కథ గమనాన్ని సూచించడం.. లాంటివి రామరాజు దర్శకుడిగా చూపిన ప్రతిభగా చెప్పుకోవచ్చు.

సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ‘ఓ మనసా’ పాట సినిమా మొత్తం వినిపిస్తూ బాగా రిజిస్టర్ అవుతుంది. నేపథ్య సంగీతంలోనూ సునీల్ మంచి ప్రతిభే చూపాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ కథకు సరిపడేలా కలర్ గ్రేడింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

ప్రేమకథల్లో ఎప్పుడూ ఒకే కథ ఉన్నా, కొత్త ఆలోచనతో ఆ కథ చెప్పిన ప్రతిసారీ బాగుంటుంది. చెప్పాలనుకున్న ఆ ఆలోచనను సరిగ్గా చెప్పకుండా, అదే కథను చెబితే మాత్రం విసుగొస్తుంది. ‘ఒక మనసు’.. ఈ రెండింటికీ మధ్యలో ఆగిపోయిన ఓ ప్రేమకథ. నెమ్మదిగా సాగినా ఆహ్లాదకరంగా కనిపించే నెరేషన్, నాగ శౌర్య, నిహారికల నటన, కట్టిపడేసే నాగ శౌర్య పాత్ర చిత్రణ లాంటివి ఈ సినిమాకు అనుకూలాంశాలు. ఇకపోతే పాతకాలం కథను ఇప్పుడు చెప్పినట్లు కనిపించడం, ఒకే తరహా సంభాషణలు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు ఉండడం లాంటివి ఈ సినిమాకు ప్రతికూలాంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాస్త ఓపికపట్టి చూస్తే బాగుందనిపించే సినిమా ‘ఒక మనసు’.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :