ఓటిటి రివ్యూ: పావ కథైగల్ (తమిళ చిత్రం ‘నెట్ ఫ్లిక్స్’)

ఓటిటి రివ్యూ: పావ కథైగల్ (తమిళ చిత్రం ‘నెట్ ఫ్లిక్స్’)

Published on Dec 21, 2020 3:40 PM IST

నటీనటులు: కాళిదాస్ జయరామ్, అంజలి, కల్కి కొచ్లిన్, పదం కుమార్, గౌతమ్ మీనన్, సిమ్రాన్, ప్రకాష్ రాజ్, సాయి పల్లవి

దర్శకత్వం: సుధ కొంగర, విఘ్నేష్ శివన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెట్రిమారన్

నిర్మాత: ఆశి దువా, రియా కొంగర

ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్, గణేష్ రాజవేలు

సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లను సమీక్షించే విధానాన్ని కొనసాగిస్తూ నెట్‌ఫ్లిక్స్‌లో కొత్తగా విడుదలైన తమిళ సంకలన చిత్రం ‘పావ కథైగల్’ చిత్రాన్ని ఈరోజు సమీక్ష చేస్తున్నాం. మరి నాలుగు కథల ఈ సంకలనం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ ఆంథాలజీ చిత్రంలో సుధ కొంగర, విఘ్నేష్ శివన్, గౌతమ్ మీనన్, మరియు వెట్రీ మారన్ దర్శకత్వం వహించిన కథలు ఉన్నాయి. సుధ కొంగర కథ ట్రాన్స్ జెండర్ ఆయిన సత్తార్ (కాళిదాస్ జయరామ్), అతని కుటుంబానికి సంబంధించినది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన రెండవ కథలో కవల సోదరీమణుల పరువు హత్య ప్రధాన అంశం. గౌతమ్ మీనన్ కథలో అతని 12 సంవత్సరాల కుమార్తె మీద జరిగిన దురాగతం ప్రధాన అంశం. చివరగా వెట్రిమరన్ దర్శకత్వం వహించిన చివరి కథలో తండ్రి తన గౌరవం మరియు ప్రతిష్ట కోసం గర్భవతి అయిన తన కుమార్తెను (సాయి పల్లవి) ఎలా చంపేస్తాడు అనేది చూపించారు.

ప్లస్ పాయింట్స్:

ఈ కథా సంకలనం నిస్సందేహంగా దేశంలో ఇప్పటివరకు వచ్చిన ఉత్తమైన ఆంథాలజీ సిరీస్ లలో ఒకటి. ఈ కథలు సమాజంలో జరిగే అత్యాచారం, గౌరవ హత్యలు మరియు అభ్యంతరకర విషయాలతో వ్యవహరిస్తుంది. నాలుగురు దర్శకులు ఎవరి కథలను వాళ్ళు గట్టిగానే చెప్పారు. ప్రతి కథలోనూ హ్యూమన్ ఎమోషన్స్ బలంగా ఉన్నాయి. ఎంతలా అంటే షో పూర్తయ్యాక కూడ వాటి ప్రభావం మన మీద కాసేపటి వరకు అలాగే ఉంటుంది. తమిళ పరిశ్రమలో మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్న నలుగురూ సమకాలీన అంశాలతో నిండిన, నటీనటుల మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చిన నాలుగు కథలను వివరించారు.

ట్రాన్స్ జెండర్ పాత్రలో కాళిదాస్ జయరామ్ అద్భుత నటన కనబరిచారు. అతని హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అద్బుతంగా ఉన్నాయి. అంజలి బోల్డ్ పాత్రలో ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా కవలల పాత్రల్లో ఆకట్టుకునేలా నటించింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన కథలో నటి సిమ్రాన్ సంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళగా, భార్యగా, తల్లిగా ఆకట్టుకునేలా నడిచారు. గౌతం మీనన్ స్వయంగా భర్త పాత్రలో నటించడం విశేషం. గౌతం మీనన్ తో కలిసి తమ కుమార్తె అత్యాచారం విషయంలో వారు వ్యవహరించే తీరు, నటన భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి.

వెట్రి మారన్ దర్శకత్వం వహించిన కథ అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉంది. గర్భవతి అయిన పైమాటే పాత్రలో సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ కథకు హైలెట్. అండగా నిలవాల్సిన తండ్రే తన కుమార్తెకు విషం పెట్టి చంపడమనేది కదిలిస్తుంది. లోపల క్రూరత్వాన్ని దాచిపెట్టి బయటకు ఏమీ కనబడనీయకుండా మేనేజ్ చేసే ప్రకాష్ రాజ్ నటనా ప్రతిభ కట్టిపడేస్తుంది. ఇందులో పాటలు, నేపథ్య సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ అన్నీ కథలకు అనుకూలంగా ఉండి ప్రేక్షకులను లీనమయ్యేలా చేస్తాయి.

మైనస్ పాయింట్స్:

ప్రతి కథను దర్శకులు ఒక్కొక్కరు ఒక్కొక స్టైల్లో చక్కగా చెప్పడం వలన ఈ ఆంథాలజీలో పెద్దగా డ్రాబ్యాక్స్ ఏవీ కనబడవు. గౌతమ్ మీనన్ నటన ఒకింత విపరీతంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండాల్సింది. సుధ కొంగర చేసిన కథలో హీరో శాంతను బాగ్యరాజ్ పట్ల కాళిదాస్ ప్రేమను ఇంకా బెటర్ వేలో చూపించి ఉండాల్సింది. అప్పుడు లవ్ స్టోరీ ఎస్టాబ్లిఓష్ కాబడి కథ ఇంకాస్త బాగా కనెక్టయ్యేది.

తీర్పు:

మొత్తానికి, పావ కథైగల్ ఇటీవలి కాలంలో వచ్చిన మంచి కథా సంకలనాల్లో ఒకటని చెప్పొచ్చు. ఈ సంకలనంలో ప్రతి కథ బలమైన అంశాన్ని చూపిస్తూ మనిషిలోని మానవత్వాన్ని, నైతిక విలువల స్థాయిలను ప్రశ్నిస్తుంది. వీటన్నింటికీ మించి మంచి సమర్థులైన దర్శకుల దర్శకత్వం, టాలెంటెడ్ కలిగిన నటీనటుల ఆకట్టుకునే నటన కలిసి దీన్ని తప్పక చూడవలసిన కథా సంకలనంగా నిలబెట్టాయి.

123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు