లాక్ డౌన్ రివ్యూ : ‘ పాటల్ లోక్’ (అమెజాన్ ప్రైమ్)

లాక్ డౌన్ రివ్యూ : ‘ పాటల్ లోక్’ (అమెజాన్ ప్రైమ్)

Published on May 18, 2020 4:01 PM IST

 

నటీనటులు: జైదీప్ అహ్లవత్, నీరజ్ కబీ తదితరులు

డైరెక్టర్ : సుదీప్ శర్మ

 

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన వెబ్ సిరీస్ ‘ పాటల్ లోక్’. సుదీప్ శర్మ దర్శకత్వం వహించారు. అనుష్క శర్మ నిర్మించిన ఈ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్’లో అందుబాటులో ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

 

కథా నేపథ్యం :

ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయిన ఢిల్లీలో నలుగురు నేరస్థులు సిటీ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కాగా ప్రముఖ టీవీ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా (నీరజ్ కబీ) ను చంపడానికే ఈ బృందం సిటీలోకి వచ్చినట్లు వార్తలు వస్తాయి. ఈ కేసును ఛేదించడానికి ఇన్ స్పెక్టర్ హతి రామ్ చౌదరి (జైదీప్ అహ్లవత్)ను డిల్లీ పోలీసులు సెలెక్ట్ చేస్తారు. ఆ తరువాత జరిగిన పరిణామాల అనంతరం ఈ టీం వెనుక దేశంలోనే అతిపెద్ద నాయకుడు ఉన్నారని హతీ రామ్ తెలుసుకుంటాడు. మరి అతను కేసును ఎలా ఛేదించాడు ? దాని కోసం ఏమి చేశాడు అనేదే మిగిలిన కథ.

 

ఏం బాగుంది :

పాటల్ లోక్ మంచి స్క్రిప్ట్ ని కలిగి ఉంది. ఈ వెబ్ సిరీస్ యొక్క ప్రధాన బలం కూడా స్క్రిప్ట్ నే. ప్రతి ఎపిసోడ్ లో కథ చెప్పే విధానం ఉత్సాహంగా ఉంటుంది. పైగా సాధ్యమైనంత ఉత్తమంగా ప్రెజెంట్ చేయబడింది. ప్రతి నేరస్థుల వెనుక కథను భీకరమైన రీతిలో చూపించారు. ప్రతిది లాజిక్ తో చిత్తశుద్ధితో తెరకెక్కించారు. .

జైదీప్ అహ్లవత్ తన కెరీర్ లో అత్యుత్తమ నటనను కనబర్చాడు. డిల్లీ పోలీసుగా అతని యాస మరియు కేసును ఛేదించడానికి అతను ఒంటరిగా ఎలా పోరాడుతున్న క్రమంలో వచ్చే సీన్స్ లో అతని నటన చాల బాగుంది. అభిషేక్ బెనర్జీ కూడా తన క్రూరమైన పాత్రలో చక్కగా నటించాడు. గుల్ పనాగ్ భార్య పాత్రను బాగా చేసింది. యూపీలో కుల ఆధారిత రాజకీయాలు బాగా చూపించారు.

వెబ్ సిరీస్ అన్ని రకాలుగా ఉత్తమ ప్రదర్శనలను కలిగి ఉంది. మరియు చాలా వాస్తవికంగా కూడా ఉంటుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ ప్రభావవంతంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ క్రైమ్ మరియు సస్పెన్స్‌తో నిండి ఉంటుంది, ఇది మిమ్మల్ని చివరి వరకు కట్టిపడేస్తుంది.

 

ఏం బాగాలేదు :

కథ చాలా సింపుల్ గా ఉంటుంది. ప్లే కూడా కొంచెం క్లిష్టంగా ఉంటుంది. మీరు కొన్ని సన్నివేశాలను లేదా ఎపిసోడ్ లను మధ్యలో మిస్ అయితే ఆ తరువాత కథలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక విచారణ సీన్స్ సామాన్యులు కూడా తేలికగా అర్థం చేసుకోవడానికి ఇంకా సరళీకృతంగా చెప్పి ఉంటే బాగుండేది. పైగా ఈ సిరీస్ ఖచ్చితంగా కుటుంబ ప్రేక్షకుల కోసం అయితే కాదు.

 

చివరి మాటగా :

మొత్తంమీద, పాటల్ లోక్ ఇటీవలే వచ్చిన ఉత్తమ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలుస్తోంది. స్క్రిప్ట్, సెటప్, నటీనటుల ప్రదర్శనలు బాగా ఆకట్టుకుంటాయి. కొన్ని ఎపిసోడ్లలో కొంచెం సంక్లిష్టమైన కథనాన్ని మినహాయించి, మిగిలినిదంతా బాగానే ఉంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారందరూ ఈ సిరీస్‌ను ఇష్టపడతారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సిరీస్ ను హ్యాపీగా చూడొచ్చు.
Rating: 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు