సమీక్ష : మధుమతి – ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసే సినిమా..

సమీక్ష : మధుమతి – ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసే సినిమా..

Published on Dec 13, 2013 5:00 PM IST
Udayabhanu-Madhumathi-revie విడుదల తేదీ : 13 డిసెంబర్ 2013 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
దర్శకుడు : రాజ్ శ్రీధర్
నిర్మాత : కదీం రమేష్ బాబు – రాణి శ్రీధర్
సంగీతం :రాజ్ కిరణ్
నటీనటులు : ఉదయ భాను, విష్ణు ప్రియన్..

టీవీ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఉదయ భాను వేశ్య పాత్రలో నటించిన సినిమా ‘మధుమతి’. చాలా రోజుల నుంచి రిలీజ్ కి నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విష్ణు ప్రియన్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీక్ష పంథ్ సెకండ్ హీరోయిన్ నటించింది. రాజ్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రాజ్ కిరణ్ సంగీతం అందించాడు. వేశ్య అనే కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చాయి. మరి మధుమతి సినిమాలో రాజ్ శ్రీధర్ ఏం కొత్త దానం చూపించాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

కార్తీక్(విష్ణు ప్రియన్) సిటీలో ఓ సొంత కంపెనీ పెట్టుకొని తన ఫ్రెండ్ తో కలిసి నివసిస్తుంటాడు. కానీ కార్తీక్ ఉన్న సమస్యల్లా అమ్మాయిలన్నా, పెళ్ళాన్నా ఆమడదూరం పారిపోతాడు. కార్తీక్ సొంత ఊరు కేరళలోని ఓ గ్రామం. కార్తీక్ భామ అయిన తెలంగాణ శకుంతలకి మాత్రం తన మనవడిని తన తమ్ముడి కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటున్న సమయంలో కార్తీక్ తనకి మరదలిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తనకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని చెప్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళు చేసేదేమీ లేక కార్తీక్ కి తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంటికి తీసుకురమ్మని చెబుతాడు.

అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని కార్తీక్ వేశ్య అయిన మధుమతి(ఉదయ భాను)కి డబ్బు ఇస్తానని చెప్పి తన భార్యలాగా ఇంటికి తీసుకెళతాడు. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? మధుమతి వల్ల కార్తీక్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? చివరికి మధుమతి వేశ్య అని కార్తీక్ వాళ్ళ ఇంట్లో తెలిసిందా? లేదా? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

వేశ్య పాత్రలో ఉదయ భాను నటన బాగుంది. అలాగే కాస్త గ్లామరస్ గా కనిపించి తన అభిమానులను మెప్పించింది. అలాగే సెకండ్ హీరోయిన్ అయిన దీక్ష పంథ్ వల్ల సినిమాకి ఆవగింజంత ఉపయోగం లేకపోయినా ఈ అమ్మాయిపై రెండు పాటలు షూట్ చేసారు. ఈ రెండు పాటల్లో అందాలు ఒలకబోసి ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకుంది. విష్ణు ప్రియన్ తన పాత్రకి న్యాయం చేసాడు.

మైనస్ పాయింట్స్ :

పైన ప్లస్ పాయింట్స్ లో చెప్పిన ఒకరి ఇద్దరి పెర్ఫార్మన్స్ లు తప్ప సినిమాలో ప్లస్ అని చెప్పుకోవడానికి ఒకటి లేవు. కావున మిగతా అన్నీ సినిమాకి మైనస్ అవుతాయని సెపరేట్ గా చెప్పనక్కర్లేదు. వేశ్య కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని తీసిన ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఇటీవలే వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ సినిమా కూడా దాదాపు 90% ఇలానే ఉంటుంది. స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు. డైరెక్టర్ మనకు ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు అనేది టైటిల్స్ వేసేటప్పుడు ఇచ్చిన వాయిస్ ఓవర్ లోనే చెప్పేసాడు. దాంతో ప్రేక్షకులు పెద్దగా ఉత్కంఠకి గురవ్వరు. అలాగే సినిమా మొత్తం నిదానంగా ఉండడం, ఈ సీన్ చాలా బాగుంది అనుకునేలా ఒక్క సీన్ కూడా లేకపోవడం మరియు ప్రతి సీన్ ని మనం ముందే ఊహించేయగలగడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదు. మొదట్లో కాసేపు నల్ల శీను, జబర్దస్త్ వేణు నవ్వించడానికి ట్రై చేసారు. ఆ కామెడీ నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకి చిరాకు తెప్పించింది. ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఫేమస్ అయిన ‘గంగ్నం స్టైల్’ సాంగ్ కి రీమిక్స్ అని చెప్పి ‘ఐ యాం ఏ బఫెలో బాయ్ లైక్ కౌబాయ్’ అని ఓ పాట చేసారు. ఈ పాటని నల్ల శీను పై షూట్ చేసిన విధానం చూస్తె మన కడుపులో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. సినిమా నిడివి బాగా ఎక్కువ, నిడివి ఎక్కువగా ఉంది. కాన్సెప్ట్ అన్నా ఉందా అంటే అదీ లేదు. సినిమాలో చాలా సీన్స్ లేపేస్తే సినిమాకి వచ్చే వారికి కాస్త మంచి చేసిన వారవుతారు.

సినిమాలో ఓ చోట ఉదయభాను పై స్పెషల్ సాంగ్ రావాలి కానీ మన డైరెక్టర్ క్రియేటివిటీ ఉపయోగించి అక్కడ యానిమేషన్ లో ఓ ఐటెం సాంగ్ ని పెట్టడం ఏదైతే ఉందో అది వర్ణనాతీతం. సెకండాఫ్ మరీ రొటీన్ గా ఉంటుంది. సినిమా క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా లేదు. విజువల్స్ అయితే చాలా నాశిరకంగా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో బాగుంది అని చెప్పుకోదగ్గ విభాగం ఒక్కటి కూడా లేదు. సినిమాటోగ్రఫీ బిలో యావరేజ్ గా ఉంది. రాజ్ కిరణ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి 1% కూడా హెల్ప్ అవ్వలేదు. ఎడిటర్ అన్నా కాస్త కేర్ తీసుకొని కాస్త జాగ్రత్తగా ఎడిటింగ్ చేసుంటే సినిమాకి ఏమన్నా హెల్ప్ అయ్యేదేమో? కానీ ఆయన కూడా హ్యాండ్ ఇచ్చేయడంతో ప్రేక్షకులకి ఈ సినిమా బోర్ కొట్టేస్తుంది.

కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం. ముఖ్యమైన ఈ నాలుగు విభాగాలను రాజ్ శ్రీధర్ డీల్ చేసాడు. ఆయన ఎంచుకున్న కథని పలు పాత తెలుగు, తమిళ సినిమాల నుండి కాపీ కొట్టి ఓ కిచిడీలా తయారు చేసాడు. ఆ కిచిడీలో అన్నీ సరిగ్గా కుదరక పోవడంతో మొత్తానికే మోసం వచ్చింది. స్క్రీన్ ప్లే – చాలా చెత్తగా, బోరింగ్ గా ఉంది. మాటలు – మాములుగా ఇలాంటి సినిమాల్లో డైలాగ్స్ కి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మెచ్చుకోదగిన డైలాగ్ ఒకటి కూడా లేదు. చివరిగా దర్శకత్వం – అసలు ఆయన ఏం తియ్యాలనుకొని మొదలు పెట్టాడో, చివరికి ఆయన ఏమో తీసాడనేది రాజ్ శ్రీధర్ కి అన్నా అర్థమైందో? లేదో?.. ఎందుకంటే సినిమాలో ఒక్క పాత్రకి కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఇలాంటి సినిమాల్లో ఎప్పుడైతే ఆడియన్స్ సినిమాలోని పాత్రలకి కనెక్ట్ కాలేరో అప్పుడు ఆ సినిమా కంచికి వెళ్లిపోయినట్లే. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఓవరాల్ గా రాజ్ శ్రీధర్ దర్శకుడిగా నెగటివ్ మార్క్స్ తెచ్చుకున్నాడు.

తీర్పు :

ఫేమస్ యాంకర్ అయిన ఉదయ భాను ప్రధాన పాత్రలో చేసిన ఈ ‘మధుమతి’ అనే సినిమా ‘ప్రేక్షకుల మతి పోగొట్టేలా ఉంది’. ఈ సినిమాకి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఉదయ భాను ఈ సినిమాలో నటించడం మరియు ఉదయ భానుకి ఉన్న ఇమేజ్. ఉదయభాను లేకపోతే ఈ సినిమాకి ఓపెనింగ్ డే రోజు కూడా థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించడం బాగా కష్టమయ్య్యేది. అలాగే ఉదయభాను ఉంది కదా అని సినిమా చూడదగ్గ విధంగా అన్నా ఉందా అంటే అదీ లేదు. డబ్బులిచ్చి మరీ తలనొప్పి తెచ్చుకోవడం ఇష్టమైతే ఈ సినిమాకి మీరు హ్యాపీ గా వెళ్ళచ్చు లేదా లైట్ తీస్కోండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు