సమీక్ష : సత్య 2 – మెప్పించలేకపోయిన వర్మ సీక్వెల్..

సమీక్ష : సత్య 2 – మెప్పించలేకపోయిన వర్మ సీక్వెల్..

Published on Nov 8, 2013 11:45 PM IST
satya-2 విడుదల తేదీ : 08 నవంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : సమంత్ కుమార్ రెడ్డి
సంగీతం : అమర్ మొహిలే, కారి అరోరా
నటీనటులు :శర్వానంద్, అనైక సోతి, అర్చన గుప్త..

విలక్షణ మరియు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చివరి సారిగా మాఫియాని టార్గెట్ చేస్తూ చేసిన సినిమా ‘సత్య 2’. ఈ సినిమా గతంలో వచ్చిన సత్య సినిమాకి సీక్వెల్. కానీ ఈ రెండు సినిమాలకు వ్యత్యాసం ఉంటుందని అంటున్న వర్మ ఈ సినిమాలో కొత్త రకమైన క్రైమ్ ని చూపించానని చెబుతున్నాడు. శర్వానంద్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో అనైక సోతి, ఆరాధన గుప్త హీరోయిన్స్ గా కనిపించారు. గత కొంత కాలంగా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాల్నే మూటగట్టుకుంటున్న వర్మ ఈ సరికొత్త మాఫియ ట్రెండ్ తో హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

సత్య(శర్వానంద్) ఓ బలమైన కోరికతో హైదరాబాద్ సిటీలోకి అడుగుపెడతాడు. అలా అడుగుపెట్టిన తను టాప్ బిజినెస్ మేన్, కాంట్రాక్టర్ అయిన ఈశ్వర రావు(మహేష్ ఠాకూర్) దగ్గర పనికి చేరుతాడు. ఈశ్వర రావు ఒక గ్యాంగ్ స్టర్ బ్యాచ్ తో కలిసి తమకు కావాల్సిన కొన్ని అనధికార పనులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి తరుణంలో ఈశ్వర రావుకి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యని సత్య చాలా తెలివిగా డీల్ చేస్తాడు. చాలా తక్కువ టైంలోనే సత్య తన టాలెంట్ తో ఓ కంపెనీని మొదలు పెడతాడు. ఈ కంపెనీ పేరుతో కొంతమంది ప్రముఖులను చంపుతూ ఉంటారు. కానీ ఈ కంపెనీ ఎవరిది? ఎందుకు చేస్తున్నారు? అని తెలుసుకోవాలని వరుసగా వస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ కూడా చనిపోతుండడంతో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పురుషోత్తం(కౌశల్ కపూర్) రంగంలోకి దిగుతాడు.

ఆ తర్వాత సత్య పోలీసులకి దొరక్కుండా తన కంపెనీని సజావుగా ముందుకు నడిపించాడా? లేదా? లేక పోలీసులు సత్యని పట్టుకున్నారా? అనేది చూడాలంటే మీరు ఈ సినిమాకి వెళ్ళాల్సిందే.. అసలు సత్య ఎందుకు ఆ కంపెనీని స్థాపించాడు? దాని వెనుక గల కారణాలు ఏంటి? అనేది తెలుసు కోవాలంటే మీరు ఈ సినిమా సీక్వెల్ కోసం వేచి చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సత్య 2 సినిమాకి బిగ్గెస్ట్ హైలట్ అంటే శర్వానంద్ నటన. ఇలాంటి పాత్రలని సూపర్బ్ గా చేయగలిగిన శర్వానంద్ నెగటివ్ షేడ్స్ ఉన్న సత్య పాత్రలో మంచి నటనని కనబరిచాడు. సత్య పాత్రకి శర్వానంద్ డైలాగ్ డెలివరీ బాగా కుదిరింది. అలాగే గతంలో వరుసగా వచ్చిన వర్మ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్ గా అనిపిస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులని కట్టిపడేసే సీన్స్ కొన్ని ఉన్నాయి. అలాగే సినిమాలో వచ్చే కొన్ని క్రైమ్ సీన్స్ ని చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వల్ ముందు 20 నిమిషాలు వచ్చే సీన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు మీకు పాత రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కనపడుతుంది.

మైనస్ పాయింట్స్ :

మొదటగా చెప్పాల్సింది సత్య 2లో కొత్తగా చెప్పింది అంటూ ఏమీ లేదు. సినిమా మొదట్లో మరియు కొన్ని చోట్ల మహేష్ బాబు చేసిన ‘బిజినెస్ మేన్’ సినిమాని పోలి ఉంటుంది. అలాగే చాలా సీన్స్ లో ఉండాల్సిన ఎమోషన్స్, సినిమాలో ఉండాల్సిన సస్పెన్స్ మిస్ అయ్యింది. ఇంటర్వల్ బ్లాక్ అందరికీ కనెక్ట్ చేసినప్పుడు మాములుగా సెకండాఫ్ మీద అంచనాలు పెరిగిపోతాయి. కానీ ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయారు.

ఈ సినిమాలో పాటలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏదో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే బిట్ సాంగ్స్ ని పక్కన పెడితే, మిగతా సాంగ్స్ అన్నీ హీరో హీరోయిన్ గురించి తలచుకోగానీ లేదా కలుసుకోగానే పాటలు వచ్చేస్తుంటాయి. సెకండాఫ్ అంతగా లేదు అనుకుంటున్నా టైంలో ఇలాంటి పాటలు చాలా చిరాకు తెప్పిస్తాయి.

సినిమాలో హీరో శర్వానంద్ తప్ప మిగిలిన వారంతా హిందీ నటీనటులే ఉండడం, తెలుగు నటీనటులు ఎవరూ లేకపోవడం వల్ల తెలుగు వారికి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. హీరోయిన్ అనైక సోతి నటన, లుక్ ఈ రెండింటిలో ఏ ఒక్కటీ చూడటానికి బాగోలేదు.

సాంకేతిక విభాగం :

అన్ని రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో సాంకేతిక విలువలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలో కెమెరా యాంగిల్స్ విషయంలో ప్రయోగం చేయకపోవడం వల్ల సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్పాలి. ‘ఈగల్ కెమెరా’ని ఉపయోగించి తీసిన షాట్స్ బాగున్నాయి. హైదరాబాద్ ని చూపించిన ఏరియల్ షాట్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయి. అమర్ మొహిలే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చాలా సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ యావరేజ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ని ఎంతో ఆసక్తికరంగా తీసిన వర్మ సెకండాఫ్ ని మాత్రం ఊహాజనితంగా తీయడం వల్ల ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు.

తీర్పు :

సత్య 2 సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది, అలాగే ఈ సీక్వెల్ పార్ట్ సత్య సినిమా రేంజ్ కి దరిదాపుల్లో కూడా లేదు. ఇంటర్వల్ కి ముందు ఓ 20 నిమిషాలు, అక్కడక్కడా కొన్ని సీన్స్ లో వర్మ టేకింగ్ చాలా బాగుంది. ఆ సీన్స్ చూసినప్పుడు వర్మ ఈజ్ బ్యాక్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండాఫ్ చూసిన తర్వాత ఆ మాటని మనకు మనమే వెనక్కి తీసేసుకుంటాం. రామ్ గోపాల్ వర్మ తన రాబోయే సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడని ఆశించాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు