సమీక్ష : ఉలవచారు బిర్యాని – బిర్యానిలో మసాలా మిస్సింగ్.!

సమీక్ష : ఉలవచారు బిర్యాని – బిర్యానిలో మసాలా మిస్సింగ్.!

Published on Jun 6, 2014 5:00 PM IST
Ulavacharu-Biryani-poster విడుదల తేదీ : 6 జూన్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : ప్రకాష్ రాజ్
నిర్మాత :వల్లభ
సంగీతం : ‘మాస్ట్రో’ ఇళయరాజా
నటీనటులు : ప్రకాష్ రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త..

ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ ప్రేక్షకులను మెప్పించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడిగా చేసిన ద్వితీయ ప్రయత్నమే ‘ఉలవచారు బిర్యాని’. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన ‘సాల్ట్ అండ్ పెప్పర్’కి రీమేక్. ఈ సినిమా మూడు భాషల్లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రకాష్ రాజ్, స్నేహ ప్రధాన పాత్రల్లో తేజస్, సంయుక్త హీరో హీరోయిన్స్ గా పరిచయమైన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ ఉలవచారు బిర్యాని ఎంత టేస్టీగా ఉందా లేక టేస్ట్లెస్ గా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఫుడ్ అంటే బాగా ఇష్టమైన కాళిదాసు(ప్రకాష్ రాజ్) ప్రభుత్వ పురావస్తు పరిశోధన శాఖలో పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి ఉన్న సమస్య 45 వయసు వచ్చిన పెళ్లి కాకపోవడం. ఇతని మేనల్లుడు తేజస్ (వినయ్) ఉద్యోగ వేటలో భాగంగా కాళిదాసు దగ్గర ఉంటాడు. కాళిదాసు లానే బాగా ఫుడ్ లవర్ అయిన గౌరీ(స్నేహ) ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. తనకున్న సమస్య కూడా 36 వయసు వచ్చినా పెళ్లి కాకపోవడం. గౌరీ చెల్లెలు మేఘన(సంయుక్త).

ఒక రాంగ్ ఫోన్ కాల్ వల్ల కాళిదాసు – గౌరీల మధ్య ఫోన్ టాకింగ్ మొదలవుతుంది. అది కాస్త ప్రేమగా మారిందనుకొని ఒకరినొకరు కలుసు కోవాలనుకుంటారు. కానీ వారి వయసు దృష్ట్యా ఒకరికి ఒకరు నచ్చుతామో లేదో అన్న సందేహంలో కాళిదాసు తన ప్లేస్ లో తన మేనల్లుడు వినయ్ ని, గౌరీ ఏమో తన ప్లేస్ లో మేఘనని పంపిస్తుంది. ఇలా ఒకరి స్థానంలో ఒకరిని ఒకరు మార్చి పంపడం వల్ల ఈ నలుగురు జీవితాల్లో వచ్చిన మార్పు లేమిటి? చివరికి ఎవరికి ఎవరనే విషయం తెలిసిందా? లేదా? అనే విషయాలు తెలియాలి అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ అంటే ఈ సినిమా కోసం ఎంచుకున్న నటీనటులనే చెప్పాలి. 45 వయసుగల పాత్రలో ప్రకాష్ రాజ్ పెర్ఫార్మన్స్ బాగుంది. పెళ్ళైన తర్వాత స్నేహ చేసిన సినిమా ఇది. గౌరీ పాత్రలో స్నేహ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే పెర్ఫార్మన్స్ పరంగా కూడా అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమాతో పరిచయమైన తేజస్, సంయుక్తల స్క్రీన్ స్పేస్ తక్కువైనప్పటికీ ఉన్నంతలో మెప్పించారు. తేజస్ కి మంచి కథలు దొరికితే నటుడిగా నిరూపించుకునే అవకాశం ఉంది.

ఎంఎస్ నారాయణ, బ్రహ్మాజీలు తమ పాత్రలకు న్యాయం చేయడమే కాకుండా కాస్త నవ్విస్తారు. ఓవరాల్ గా సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే కొన్ని కొన్ని సీన్స్ ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇళయరాజా మ్యూజిక్, ప్రీత సినిమాటోగ్రఫీ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా ఒరిజినల్ కథ మలయాళం నుంచి తీసుకున్నదే అయినా ఇలాంటి కథనే మనం తెలుగులో ‘లవ్లీ’ సినిమా రూపంలో, హిందీలో ‘ముజ్ సే ఫ్రెండ్షిప్ కరోగి’ సినిమాల్లో ఇప్పటికే చూసాం. కానీ ఈ సినిమాలో పాత్రలను తీసుకున్న నేపధ్యం మాత్రం వేరేలా ఉంటుంది. కానీ అది కూడా మన నేటివిటీకి తగ్గట్టు అల్లుకోకపోవడం వలన ప్రేక్షకులు బాగా నిరుత్సాహానికి గురవుతారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ స్లోగానే సాగుతుంది. సినిమాలో బోరింగ్ ఎలిమెంట్స్, నిమిషం సీన్ ని 3 నిమిషాలుగా సాగదీసిన సీన్స్ చాలానే ఉన్నాయి. వాటి వల్ల ఆడియన్స్ చాలా బోర్ ఫీలవుతారు.

కథా పరంగా ఉండాల్సిన ఫీలింగ్ ని కూడా సినిమా మొత్తం ఉండేలా చూసుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. అలాగే రెండు జంటల మధ్య సరైన కెమిస్ట్రీ ఉండదు. ఫస్ట్ హాఫ్ అయ్యాక సెకండాఫ్ బాగుంటుందేమో అనుకుంటాం కానీ సెకండాఫ్ పూర్తయ్యే టైంకి ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ గా ఉందే అనే ఫీలింగ్ మీకనిపిస్తుంది. దీన్నిబట్టి సెకండాఫ్ ఎంత స్లో మరియు బోరింగ్ గా ఉందో మీరు అర్థం చేసుకున్నారనుకుంటా.! సినిమా స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ తీసుకొని రన్ టైంని ఇంకాస్త తగ్గించి ఉంటే సినిమా బాగుండేది.

కథా పరంగా సినిమాలో చాలా లొసుగులు ఉన్నాయి. ముఖ్యంగా ఆదివాసిగా చూపిన జగ్గయ్య పాత్రకి సరైన ముగింపు లేదు. సినిమా అయ్యే సరికి ఆ పాత్ర ఎందుకు పెట్టారా అనే అనుమానం ఆడియన్స్ కి కలుగుతుంది. పాటలు బాగున్నాయి కానీ బాగా స్లోగా సాగుతున్న సినిమాని ఇంకాస్త స్లో చేస్తాయి. బి, సి సెంటర్ ప్రేక్షకులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్, బాగా నవ్వుకునే కామెడీ లేకపోవడం కూడా పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదట చెప్పుకోవాల్సింది లేడీ సినిమాటోగ్రాఫర్ ప్రీత గురించి.. ఆమె సీజన్ సీజన్ కి మారే వెదర్ లా ఒక్కో స్టొరీకి ఒక్కో లైటింగ్ ఎఫెక్ట్ ని ఉపయోగించి విజువల్స్ ని చాలా గ్రాండ్ గా ఉండేలా చూపించారు. ఇక మాస్ట్రో ఇళయరాజా సందర్భానికి సరిపోయే చక్కని పాటలు అందించారు, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటర్ సినిమాపై శ్రద్ధ తీసుకొని సాగదీసిన సీన్స్ ని కట్ చేసి రన్ టైం తగ్గించి ఉంటే సినిమాకి హెల్ప్ అయ్యేది. డైలాగ్స్ పరవాలేదు.

కథలో కొత్తదానం ఏమీ లేదు. ఇక స్క్రీన్ ప్లే – దర్శకత్వ బాధ్యతలు ప్రకాష్ రాజ్ తీసుకున్నాడు. ఇలాంటి సినిమాలను స్క్రీన్ ప్లే చాలా కీలకం కానీ ఆ విషయంలోనే ప్రకాష్ రాజ్ ఫెయిల్ అయ్యాడు. ఇక డైరెక్టర్ గా అందరి నుంచి నటనని రాబట్టుకున్నా ఈ సినిమాకి కావాల్సిన ఫీల్ ని, రెండు జంటల మధ్య కెమిస్ట్రీని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ద్వితీయ యజ్ఞంగా ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన ‘ఉలవచారు బిర్యాని’ సినిమా ఉప్పు, మసాలా లేని బిర్యానిలా చాలా చప్పగా ఉంది. నటీనటుల పెర్ఫార్మన్స్, అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు తప్ప సినిమాలో చెప్పుకోదగిన అంశాలు ఏమీ లేవు. నటుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఈ సినిమాతో కూడా డైరెక్టర్ గా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయాడు. బి,సి సెంటర్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేని ఈ సినిమా మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని ఎంతవరకూ ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు