సమీక్ష : ఆర్ఎక్స్ 100 – కాస్త స్లోగా వెళ్లినా బాగానే నడుస్తోంది

RX100 movie review

విడుదల తేదీ : జులై 12, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : కార్తికేయ, పాయల్ రాజపుత్‌, రావు రమేష్

దర్శకత్వం : అజయ్ భూపతి

నిర్మాత : అశోక్ రెడ్డి గుమ్మకొండ

సంగీతం : చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫర్ : రామ్

ఎడిటర్ : ప్రవీణ్. కే .ఎల్

స్క్రీన్ ప్లే : అజయ్ భూపతి

కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరో హీరోయిన్లుగా, నూతన దర్శకుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన చిత్రం “ఆర్ఎక్స్ 100” ‘ ఇన్ క్రెడిబుల్ లవ్ స్టోరి’ అనేది ఉప‌శీర్షిక. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

శివ (కార్తికేయ) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే, డాడి(రాంకీ) అన్ని తానై శివను పెంచుతాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కాగా ఇందు (పాయల్ రాజపుత్‌) శివను చూడగానే ఇష్టపడుతుంది. కావాలని అతన్ని టీజ్ చేస్తూ వెంట పడుతూ శివని ప్రేమలో దింపుతుంది. ఇద్దరు ఫిజికల్ గా దగ్గరవుతారు. అలా ఇందు మాటలకి చేతలకి శివ ఇంకా డీప్ ప్రేమలోకి వెళ్తాడు. పెళ్లి చేసుకుందాం అని ఇందుని ఫోర్స్ చేయగా.. ఇందు మా నాన్న(రావు రమేష్)కి చెప్పి ఒప్పిస్తానని వెళ్తుంది. కట్ చేస్తే రావు రమేష్ ఇందుకి పెళ్లి చేసి అమెరికా పంపించేశాడని శివకు తెలుస్తోంది. ఇక శివ తాగుతూ ప్రేమ పిచ్చోడిలా ఇందు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. .

ఆ క్రమంలో ఇందుకు పెళ్లి చేసింది రావు రమేష్ కాదని తెలుస్తోంది. అసలు ఇందు, మహేష్ అనే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది ?.శివని అంతలా ప్రేమించిన ఇందు ఎందుకు అతనికి కనబడకుండా తిరుగుతుంది ? ప్రేమ కోసం రోజురోజుకి పిచ్చోడిలా అయిపోతున్న శివను మార్చటానికి డాడి (రాంకీ) ఏం చేశాడు ? అసలు మళ్ళీ శివ,ఇందు కలుసుకుంటారా ? చివరకి శివ ఏమైపోతాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూడాల్సిదే

ప్లస్ పాయింట్స్ :

మొదటి సారి హీరోగా నటించిన కార్తికేయ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా తన సిక్స్ ప్యాక్ తో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ గురించి అసలు విషయం తెలుసుకున్న సన్నివేశంలో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని కార్తికేయ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.

ఇక బోల్డ్ క్యారెక్టర్ లో నటించిన పాయల్ రాజపుత్‌ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో నటించిన రాంకీ కూడా డాడి పాత్రలో ఒదిగిపోయారు. ఇక రావు రమేష్ ఎప్పటిలాగే తనకు మాత్రమే సాధ్యమైన ఆ ఎక్స్ ప్రెషన్స్ ఆ మాడ్యులేషన్ తో ఈ సినిమాను మరో స్థాయికు తీసుకువెళ్లే ప్రయత్నం చేసారు.

కార్తికేయ, పాయల్ రాజపుత్‌ మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు. వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడు అజయ్ భూపతి చెప్పాలనుకున్న థీమ్ బాగుంది. రాసుకున్న ట్రీట్మెంట్, ప్లాష్ బ్యాక్ లో హీరో గురించి రివీల్ చేసే సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కథాంశం బాగున్నా అంతే స్థాయిలో ఉండాల్సిన కథనం మాత్రం ఆ స్థాయిలో ఉండదు. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. పైగా సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించి అక్కడక్కడ బోర్ కొడుతుంది.

కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలతో, ప్రేమ కోసం పిచ్చోడిలా తిరుగుతున్న హీరో ఏం అయిపోతాడో అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ కంటెంట్ ను అంతే గొప్పగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన సెకండాఫ్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అజయ్ భూపతి మంచి స్టోరీ ఐడియా, ప్లాట్ ను తీసుకున్నా దాన్ని అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేది.

సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటల సంగీతం ఆకట్టుకుంటుంది. స్మరన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలెట్ నిలుస్తోంది. విషయం లేని సీన్ లో కూడా ఆయన తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ లో ఊపు తీసుకొచ్చారు.

రియల్ సతీష్ సమకూర్చిన స్టంట్స్ కూడా బాగున్నాయి. ప్రవీణ్. కే .ఎల్ ఎడిటింగ్ బాగుంది. కాకపోతే సెకండాఫ్ లో ఆయన కత్తెరకి ఇంకొంచెం పని చెప్పి ఉండాలసింది. రామ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది.పెల్లెటూరి విజువల్స్ ను ఆయన చాలా బాగా చూపించారు. నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

కార్తికేయ హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో నటనతో, డ్యాన్సులతో, ఫైట్స్ తో కార్తికేయ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడు అజేయ్ భూపతి రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్, కూతురితో రావు రమేష్ మాట్లాడే సన్నివేశం ఇలా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కానీ సెకండాఫ్,సాగతీతతో విసుగు తెప్పిస్తుంది. పైగా సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడ కరువైంది. మొత్తం మీద ఈ ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ను ఆశించే వాళ్ళను నిరాశ పరుస్తోంది. ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమాను చూద్దామనే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :