Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : తను వచ్చెనంట – భయపెట్టలేకపోయిన జాంబి

Tanu Vachenanta review

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : వెంకట్ కంచెర్ల

నిర్మాత : చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల

సంగీతం : రవిచంద్ర

నటీనటులు : తేజ, రష్మీ గౌతమ్, ధన్య బాలకృష్ణనన్


హర్రర్ కామెడీ జానర్ కు ఆదరణ పెరిగిన నైపథ్యంలో అదే జానర్ కు కాస్త కొత్తదనం జోడించి జామెడీ అనే సరికొత్త జానర్ ను తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నంతో వచ్చిన సినిమానే ఈ ‘తను వచ్చెనంట’. ‘గుంటూరు టాకీస్’ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ జామెడీ జానర్ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం….

కథ :

కుటుంబపరమైన కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయి శ్వేత(ధన్య బాలకృష్ణన్) కు దూరమైన తేజ (తేజ) అనే యువకుడు విధి లేక వేరొక అమ్మాయి శృతి (రష్మి) ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమె పెట్టె ఇబ్బందులు తట్టుకోలేక, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక తేజ శృతి తనకు దూరం చెయ్యాలనే ప్రయత్నంలో ఊహించని తప్పు చేస్తాడు.

అతను చేసిన ఆ తప్పేమిటి ? ఆ తప్పు వల్ల అతని భార్య శృతికి ఏమైంది ? మళ్ళీ ఆమె తేజ జీవితంలోకి ఎలా వచ్చింది ? వచ్చి అతన్ని ఎలా ఇబ్బంది పెట్టింది ? తేజ ఆ ఇబ్బందుల్ని తట్టుకుని తను ప్రేమించిన అమ్మాయి శ్వేతను దక్కించుకున్నాడా లేదా ? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది సినిమా మొత్తంలో హీరో స్నేహితుడి పాత్రలో చలాకి చంటి పండించిన కామెడీ గురించి. సినిమా మొదలైన దగ్గర్నుంచి హీరోకి సంబందించిన ప్రతి సన్నివేశంలో చలాకి చంటి ప్రమేయం ఉంటుంది. ఆ సమయంలో అతను పండించిన కామెడీ మంచి టైమింగ్ తో, సెటైరికల్ గా చాలా చోట్ల బాగా పనిచేసింది. ముఖ్యంగా సెకండాఫ్ క్లైమాక్స్లో వచ్చే అతని కామెడీ జామెడీ అనే ఈ సినిమా జానర్ కు చేయాల్సిన సగం న్యాయాన్ని పరిపూర్ణంగా చేసింది.

అలాగే ఇంటర్వెల్ బాంగ్ కూడా బాగుంది. ఉన్నట్టుండి ఊహించని పరిస్థితిలో తేజ భార్య శృతి పాత్రలో రష్మీ గౌతమ్ ఎంట్రీ కాస్త థ్రిల్ కలిగిస్తుంది. హీరోయిన్లు రష్మీ, ధన్య బాలకృష్ణన్ లు స్క్రీన్ మీద కలర్ ఫుల్ గా కనిపించడమే గాక నటన పరంగా మెప్పించారు. జాంబీ పాత్రలో రష్మిసెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. కొత్త హీరో తేజ్ నటన ఆమోదయోగ్యంగానే ఉంది. నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల అందించిన జాంబీ స్టోరీ లైన్ కాస్త కొత్తగా అనిపించింది.

మైనస్ పాయింట్స్ :

మైన్స్ పాయింట్స్ విషయానికొస్తే జాంబీ అనే స్టోరీ లైన్ బాగానే ఉన్నా దర్శకుడు ఎక్కడా దాన్ని ప్రేక్షకులకు కనెక్టయ్యే విధంగా చెప్పలేకపోయాడు. ఒకానొక సందర్భంలో జాంబీ అంటే ఇదేనా అనే నిరుత్సాహం కలిగింది. ఒకవైపు జాంబీకి మైండ్ తప్ప మనసుండదు అని చెబుతూనే చివరికి క్లైమాక్స్ లో జాంబీకి ఎమోషనల్ సీన్ పెట్టి కథను ముగించడం ఏమాత్రం లాజిక్ లేని విషయం. జాంబీ కథలోకి ఎంటరైన దగ్గర్నుంచి అబ్బో సెకండాఫ్ లో అదిరిపోయే హర్రర్ సీన్లు వచ్చేస్తాయి, జాంబీ హీరోని ఒక ఆట ఆడేసుకుంటుంది అనుకుంటే తృప్తినిచ్చే అలాంటి సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు.

మరీ కొన్ని చోట్ల, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం అయితే మరీ వీక్ గా, సిల్లీగా అనిపించడమే గాక విసుగు తెప్పించింది కూడా. జాంబీగా రష్మీ చేత ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టి ఉండవచ్చు కానీ ఎందుకో దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు. పైగా రష్మీ నటించిన సినిమా నుండి ప్రేక్షకుడు ఆశించే హాట్, హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో మచ్చుకి కూడా కనిపించకపోవడం అతి పెద్ద మైనస్ పాయింట్. కొన్ని సన్నివేశాలైతే పాత హర్రర్ కామెడీ సినిమాల్లోని సీన్లని కాపీ కొట్టినట్టే ఉండి బోర్ కొట్టించాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికొస్తే నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ అందించిన జామెడీ అనే కొత్త రకం జానర్ పాయింట్ బాగానే ఉంది. కానీ దర్శకుడే దాన్ని ప్రభావవంతంగా చెప్పలేకపోయాడు. ఇక జామెడీ జానర్ లో సగమైన కామెడీని మాత్రం డైరెక్టర్ అవసరమైన చోట మంచి టైమింగ్ తో వాడుకున్నాడు. శశి ప్రీతమ్ అందించిన నైపత్య సంగీతం బాగానే ఉన్నా రవిచంద్ర సంగీతం ఏమంత ఆకట్టుకోలేదు. రాజ్ కుమార్ కెమెరా పనితనం, ఎడిటింగ్ టీమ్ ఎడిటింగ్, విజయ్ విజువల్ ఎఫెక్ట్స్ పరవాలేదనిపించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నంలో బాగున్నాయి.

తీర్పు :

ఆత్మల చుట్టూ తిరిగే రొటీన్ హర్రర్ కథలకు కాస్త డిఫరెంట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయంలేని జాంబీతో హర్రర్, దానికి అదనంగా కామెడీ కలిపి జామెడీ జానర్లో తీసిన ఈ చిత్రం జాంబీ పరంగా న్యాయం చేయలేకపోయినా కామెడీ పరంగా మాత్రం న్యాయం చేసింది. టైమింగ్ తో సాగే చలాకి చంటి కామెడీ, కాస్త థ్రిల్లింగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా జాంబీ కాన్సెప్ట్ ని స్ట్రైకింగ్ గా చెప్పలేకపోవడం, సెకండాఫ్ లో రొటీన్ బోరింగ్ సన్నివేశాలు, రష్మీ నుండి సాధారణంగా ఆశించే పెర్ఫార్మెన్స్ లేకపోవడం ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తం మీద చెప్పాలంటే కామెడీని ఇష్టపడుతూ, రొటీన్ బోరింగ్ హర్రర్ సన్నివేశాల్ని తట్టుకోగలిగితే ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు. అంతేగాని ఏదో జాంబీ జానర్ అని, రష్మీ మెయిన్ క్యారెక్టర్ చేసిందని సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా నిరుత్సాహం కలుగుతుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for Telugu Review


సంబంధిత సమాచారం :