Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : టైగర్ – భావోద్వేగపూరిత కమర్షియల్ సినిమా!

Tiger

విడుదల తేదీ : 26 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : వీఐ ఆనంద్

నిర్మాత : ఎన్.వి.ప్రసాద్

సంగీతం : థమన్

నటీనటులు : సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్..

వైవిధ్యభరితమైన కథాంశాలతో రూపొందిన సినిమాల్లో నటించి, ఇప్పుడున్న యువహీరోల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ కిషన్. తాజాగా ఆయన మరో యువహీరో రాహుల్ రవీంద్రన్‌తో కలిసి నటించిన సినిమా ‘టైగర్’. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఓ బలమైన కథాంశం చుట్టూ నడిచే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్ సరికొత్తగా పరిచయం చేసే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టార్గెట్ రీచ్ అయ్యిందా.? లేదా.? అనేది చూద్దాం..

కథ :

రాజమండ్రిలోని ఓ అనాథాశ్రమంలో పెరిగిన టైగర్ (సందీప్ కిషన్) – విష్ణు (రాహుల్ రవీంద్రన్)లు ఇద్దరు ప్రాణ మిత్రులు. విష్ణు విషయంలో అన్నీ తానై చూసుకుంటూ ఉండే టైగర్, అతడి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళతాడు. వీరి స్నేహం ఇలా ఉండగానే.. కొంతకాలానికి విష్ణును కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు దత్తత తీసుకుంటారు. ఆ తర్వాత కూడా టైగర్, విష్ణుల స్నేహం అలా కొనసాగుతూనే ఉంటుంది. విష్ణు ఇంజనీరింగ్ చదివే సమయంలో తాను చదివే కాలేజీకి సంబంధించిన ఈవెంట్‌లో పాల్గొనేందుకు కాశీ నుండి వచ్చిన గంగ (సీరత్ కపూర్) పరిచయం అవుతుంది.

అతి కొద్ది రోజుల్లోనే గంగతో విష్ణు పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలోనే సంవత్సరం తర్వాత తన స్నేహితుడు ఓ అమ్మాయిని ప్రేమించాడన్న విషయం తెలుసుకున్న టైగర్, గంగ విషయంలో విష్ణుతో గొడవ పడాల్సి వస్తుంది. ఆ గొడవ వల్లే టైగర్, విష్ణులు విడిపోతారు. కాగా ఆ తర్వాత కొన్ని ఆసక్తికరమైన మలుపుల వల్ల విష్ణు, కాశీలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. విష్ణు చావు బతుకుల మధ్యనున్న విషయం టైగర్‌కు ఎలా తెలిసింది? అసలు విష్ణు ఆ పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? గంగ నేపథ్యమేంటి? విష్ణును టైగర్ కాపాడుకున్నాడా?లేదా.? అన్న ప్రశ్నలకు వచ్చే ఆసక్తికర సమాధానాలే టైగర్ సినిమా!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. కథగా చూస్తే ఓ ఫార్ములా కథలా కనిపిస్తుంది, కానీ ఆ కథ చుట్టూ ఎంచుకున్న నేపథ్యం, దాన్ని ఓ సినిమాగా ప్రెజెంట్ చేసిన విధానం కట్టిపడేస్తుంది. టైగర్, విష్ణుల ఎస్టాబ్లిషింగ్ సన్నివేశాలతోనే విష్ణు కోసం టైగర్ ఎంత దూరమైనా వెళ్ళగలడనే విషయాన్ని తెలియజేయడం, ఆ తర్వాత ఎక్కడో కాశీలో విష్ణు చావు బతుకుల మధ్య కథను మొదలుపెట్టడం, రెండు సస్పెన్స్ ఎలిమెంట్‌లను సెకండాఫ్‌కు వదిలిపెట్టడం ఇవన్నీ స్క్రీన్‌ప్లేలో సరిగ్గా ఒడిసిపట్టారు. స్నేహం, ప్రేమ, ఒక సామాజిక అంశం ఇలా మూడు అంశాలను ఒక ఫార్ములా కథకు కలిపి చెప్పడం బాగా ఆకట్టుకునే అంశం. అనవసర ఆర్భాటాలు లేకపోవడంతో సినిమా అంతా వేగంగా సాగిపోతుంది.

‘టైగర్‌’గా సందీప్ కిషన్ కట్టిపడేశాడనే చెప్పుకోవచ్చు. చూడటానికి సరదాగా కనిపించే పాత్రలోనే దాగి ఉన్న అసలైన భావోద్వేగాన్ని అద్భుతంగా పండించాడు. టైగర్ పాత్రను మలిచిన తీరు కూడా అందరూ అతడిని ప్రేమించేలా ఉంటుంది. విష్ణుగా రాహుల్ రవీంద్రన్ చాలా బాగా నటించాడు. ఇటు రొమాంటిక్ సన్నివేశాల్లో, అటు సీరియస్ సన్నివేశాల్లోనూ రాహుల్ తన మార్క్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటాడు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ సరదా సరదాగా రెండు సస్పెన్స్ ఎలిమెంట్‌లను క్యారీ చేస్తూ ఆసక్తికరంగా గడిచిపోతుంది. ఇక సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. ఒక సామాజిక అంశం చుట్టూ అల్లుకున్న కథా నేపథ్యం, కథాంశం సెకండాఫ్‌లోనే వెలుగులోకి వస్తాయి. సినిమాకు ఏ పార్ట్ హైలైట్ అంటే రెండూ అని చెప్పొచ్చు. వినోదమే ప్రధానం అనేవారికి ఫస్టాఫ్, ఎమోషనల్‌గా ఓ నేపథ్యాన్ని, బలమైన అంశాన్ని కోరుకునే వారికి సెకండాఫ్ మేజర్ హైలైట్‌గా కనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్ అంటే రెగ్యులర్ ఫార్ములా లాగా కనిపించే కథ గురించి చెప్పాలి. కథాంశం బలమైనదే అయినా కొత్తది కాదు. కథ విషయంలో ఎప్పుడూ కొత్తదనం కోరుకునేవారికి, ఫార్ములా కథలను పెద్దగా ఇష్టపడని వారికి ఈ కథలో తాము కోరుకునే అంశాలు తక్కువ. ఆసక్తికరంగా సాగిపోయే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ ఆ స్థాయిలో కనిపించదు. ఫస్టాఫ్‌లో వదిలిపెట్టిన సస్పెన్స్ ఎలిమెంట్స్ భావోద్వేగాలకు సంబంధించిన విషయాలే కానీ థ్రిల్‌కు సంబంధించినవి కావు. ఈ విషయంలో థ్రిల్ కోరుకునే వారికి సెకండాఫ్ నిరుత్సాహపరుస్తుంది.

సీరత్ కపూర్ పాత్ర సినిమా కథతో పాటే, కథలోనే నడిచే పాత్రే అయినా ఆ పాత్రను అక్కడక్కడా పూర్తిగా వదిలేశారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే సన్నివేశాల్లో సీరత్ కపూర్ నటన సాదాసీదాగా ఉంది. కాశీ నేపథ్యం కథలోకి వచ్చిన తర్వాత విష్ణు తల్లిదండ్రుల ప్రస్తావన ఎక్కడా రాదు. వినోదం చుట్టూనే తిరిగే కథలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే కొన్ని సన్నివేశాలు తప్ప ఆకట్టుకునే అంశాలు తక్కువ.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు అన్ని విభాగాల నుంచీ సరైన సహకారం అందిందనే చెప్పొచ్చు. ముందుగా దర్శకుడు విఐ ఆనంద్ ఓ ఫార్ములా కథనే బలమైన నేపథ్యం, ప్రేమ, స్నేహంల చుట్టూ నడిపించే ప్రయత్నం చేశారు. కథ ఫార్ములానే అయినా స్క్రీన్‌ప్లేను పకడ్బందీగా రాసుకొని ఆ విషయంలో మార్కులు కొట్టేశాడు. దర్శకుడిగా ఆనంద్ ప్రతిభను చాలా సన్నివేశాల్లో చూడొచ్చు.

ఇక చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ప్రతీ ఫ్రేమ్‌నూ అందంగా మలిచింది. అనాథాశ్రమం, కాలేజీ, కాశీ ఇలా రకరకాల నేపథ్యాలనూ; పాత్రల ఎమోషనల్ జర్నీని అద్భుతంగా బంధించడంలో చోటా కె నాయుడు కట్టిపడేస్తారు. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ముఖ్యంగా సందీప్ కిషన్‌ పాత్రలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. అబ్బూరి రవి లోతైన భావాలను అతి సునాయసంగా తన సంభాషణల ద్వారా తెప్పించడంలో బాగా ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా, మూడ్‌ను, ఎమోషన్‌ను ఎక్కడా దెబ్బతీయకుండా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే!

తీర్పు :

స్నేహం, ప్రేమ, ఒక సామాజిక అంశం ఇలా మూడు విషయాలను ఓ బలమైన నేపథ్యం చుట్టూ ఆసక్తికరంగా చెప్పడం ‘టైగర్’ సినిమాకు ప్రధానంగా అనుకూలించే అంశం. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్‌ల నటన, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ; థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్; వీటన్నింటికి మించి ఒక సామాజిక అంశాన్ని అందరికీ అర్థమయ్యే ఫార్మాట్లో చెప్పిన దర్శకుడి ప్రతిభ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్. ఇకపోతే ఫార్ములాలాగా కనిపించే కథ, అక్కడక్కడా కొన్ని లాజిక్‌లను పక్కనపెట్టడం ప్రతికూల అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. చెప్పాలనుకున్న విషయాన్ని దారి తప్పించకుండా, అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పే ఏ సినిమా అయినా ఆకట్టుకునే సినిమాగానే నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘టైగర్’ ఆ కోవలోనే వచ్చిన ఓ ఎమోషనల్ కమర్షియల్ సినిమా!

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :