Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఉందా లేదా – విషయమైతే లేదు

Undha Ledha movie review

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : కుమార్ సాయి, అంకిత, ఝూన్సీ

దర్శకత్వం, స్టోరీ & స్క్రీన్ ప్లే: అమ‌నిగంటి వెంక‌ట శివప్ర‌సాద్

నిర్మాత : అయితం ఎస్ క‌మ‌ల్

సంగీతం : శ్రీముర‌ళీ కార్తికేయ

సినిమాటోగ్రఫర్ : ప్ర‌వీణ్ కె బంగారి

ఎడిటర్ : మ‌ణికాంత్ తెల్ల‌గూటి

కమల్ నిర్మాతగా నూతన దర్శకుడు వెంకట శివ ప్రసాద్ దర్శకత్వంలో అల్లం సుబ్ర‌మ‌ణ్యం , అల్లం నాగిశెట్టి సహా నిర్మాతలుగా నూతన నటినటులు నటించిన ఉందా లేదా సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

కథ :
రాజా హరిచంద్ర ప్రసాద్ హాస్టల్ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ హాస్టల్ లో నివసించే ఒక అమ్మాయి ఉరి వేసుకొని చనిపోతుంది. ఆ తరువాత అక్కడి జనాలు ఎందుకు ఆ అమ్మాయి చనిపోయిందని కనుక్కొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో ఎలా అయిన సరే దర్శకుడు అవ్వాలనే కోరిక కలిగిన నాగరాజు ఆ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ జరిగే పరిణామాలను గుర్తిస్తాడు. అసలు చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు ? ఎందుకు చనిపోయింది ? చనిపోయిన అమ్మాయి ఆత్మ ఆ గదిలో ఉందా.. లేదా ? తెలుసుకోవాలంటే ఈ ‘ఉందా లేదా’ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్టర్ వెంకట శివప్రసాద్ రాసుకున్న పాయింట్ ను కొత్తగా లేకపోయినా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా రాసుకున్నాడు. దీంతో అప్పుడప్పుడు చిత్రం ఆసక్తికరంగ నడుస్తున్నట్టు తోచింది. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది.

నూతన నటీనటులు కుమార్ సాయి, అంకిత బాగా చేసారు. ప్రొఫెసర్ పాత్రలో జీవా నటన బాగుంది. ఝాన్సి, రామ్ జగన్ వారి వారి ఫరిది మేరకు నటించి మెప్పించారు. నిర్మాణ విలువలు బాగుండటంతో సినిమా రిచ్ గా ఉండి క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్న భావన కలిగింది.

మైనస్ పాయింట్స్ :

హర్రర్ సినిమాలు తీసి మెప్పించాలి అనుకున్నప్పుడు రాసుకునే సన్నివేశాలు కొత్తగా, భయపెట్టేలా ఉండాలి. కథ పాతదే అయినా చూపించే విధానం బాగుండాలి. కానీ ‘ఉందా లేదా’ సినిమాలో ఆ రెండు లోపించడం వల్ల సినిమా నీరుగారిపోయింది. చాలా థ్రిల్లర్ సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ పాతదే అయిన హాస్య భరిత సన్నివేశాలు ఉంటే సినిమా కొంతవరుకు విజయం సాధిస్తుంది. ఈ మూవీలో కామెడి పెద్దగా లేదు.

హీరోయిన్, హీరో ఎందుకు ప్రేమలో పడతారో అర్థం కాదు. సన్నివేశాలకు మధ్యన సంబంధం లేకుండా ఉండడంతో చూస్తోన్న ప్రేక్షకులకు బోర్ కొట్టవచ్చు . ఝాన్సీ, రామ్ జగన్, జీవా వంటి సీనియర్ నటులు ఉన్నా వారికి సరైన పాత్రలు ఇవ్వక పోవడంతో సన్నివేశాలు పండలేదు. ఇటువంటి కాన్సెప్ట్ ఎంచుకున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోందోనని ప్రేక్షకులు ఎదురు చూడాలి కానీ ఈ సినిమాలో నెక్స్ట్ ఏంటో ఈజీగా ఊహిసిన్చేయవచ్చు. అందుకు కారణం డైరెక్టర్ రాసుకున్న బలహీనమైన కథ, కథనాలే. .

సాంకేతిక వర్గం:

నాగరాజు కువ్వార‌పు సాహిత్యం బాగుంది, ఆయన రాసింది రెండు పాటలే అయినా బాగున్నాయి. శ్రీ మురళీ కార్తికేయ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. కెమెరామెన్ ప్రవీణ్ కె బంగారి చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు వెంక‌ట శివప్ర‌సాద్ పాత కథకి పాత బోరింగ్ కథనాన్నే జతచేయడంతో ఎక్కడా కొత్తదనం కనబడక చిత్రంపై ఆసక్తి లోపించింది.

ఉన్న తక్కువ బడ్జెట్ లోనే సినిమాను బాగా తీశారు. నందు జెన్నా కోరియోగ్రఫీ బాగుంది. మ‌ణికాంత్ తెల్ల‌గూటి ఎడిటింగ్ పరువాలేదు. ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ కట్ చేసింటే బాగుండేది. కథకు అది ఆటంకం కలిగించింది.

తీర్పు :

దర్శకుడు వెంక‌ట శివప్ర‌సాద్ తాను చెప్పాలనుకున్న పాయింట్ పూర్తి స్థాయిలో చెప్పలేకపోయాడు. నిర్మాత మంచి బడ్జేట్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. బాగా నటించే నటీనటులు, పనితనం కలిగిన కెమెరా మెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా వారందరిని సరైన స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. అక్కడక్కడా బాగున్నాయనిపించే కొని సీన్స్, ఇంట్రవెల్ బ్లాక్ మినహా ఈ సినిమాలో ఇంకేం దొరకవు. ఒక్క మాటలో చెప్పాలంటే పోస్టర్స్ పై హర్రర్ థ్రిల్లర్ అనే కాప్షన్ చూసి సినిమాకు వెళితే నిరుత్సాహం తప్పదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team


సంబంధిత సమాచారం :