Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఉంగరాల రాంబాబు – అన్నీ గిల్టు ఉంగరాలే

Ungarala Rambabu movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : క్రాంతి కుమార్

నిర్మాత : పరుచూరి కిరీటి 

సంగీతం : గిబ్రాన్ 

నటీనటులు : సునీల్, మియా జార్జ్

ఎంతో కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న సునీల్ కెరీర్ కు ఉంగరాల రాంబాబు చిత్రం చాలా కీలకమైనది. ఎప్పుడో విడుదలకావలసిన ఈ చిత్రం వాయిదా పడుతూ చివరకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం..

కథ :

రాంబాబు (సునీల్) చాలా ధనవంతుడు. రాంబాబు తన తాత మరణానంతరం ఆస్తి మొత్తం కోల్పోతాడు. సునీల్ కు ఇక ఏ ఆధారమూ ఉండదు. అప్పుడతను బాదం బాబా(పోసాని) గా పేరుగాంచిన బాబా వద్దకు వెళతాడు. బాబా సునీల్ ని ఓదార్చి సలహా ఇస్తాడు. బాబా సలహాతో సునీల్ ఓ బంజరు భూమిలో మొక్కలు నాటడం మొదలు పెడతాడు. రాంబాబుకు అదృష్టం కలసి వచ్చి 200 కోట్ల విలువైన బంగారు బిస్కెట్ లు దొరుకుతాయి.

దీనితో రాంబాబు మళ్లీ ధనవంతుడిగా మారిపోతాడు. దీనితో రాంబాబుకు జోతిష్యం మీద బలమైన నమ్మకం ఏర్పడుతుంది. కాలం గడిచే కొద్దీ సునీల్ బిజినెస్ లో నష్టాలని చవిచూస్తాడు. మరో మారు రాంబాబు బాబా సలహా కోసం వెళతాడు. పెళ్లి చేసుకుంటే చిక్కులు వీడిపోతాయని తన ఆఫీస్ లోనే పనిచేసే అమ్మాయి (మియా జార్జ్) సరైన జోడి అని బాబా సలహా ఇస్తాడు. కానీ రాంబాబు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన హీరోయిన్ తండ్రి( ప్రకాష్ రాజ్) వలన చిక్కుల్లో పడతాడు. ఆయా చిక్కులు ఏమిటి ? వాటి మధ్య రాంబాబు తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

తన పాత్రని సరిగా మలచకపోయినా ఎంటర్టైన్ చేయడానికి సునీల్ గట్టిగా ప్రయత్నించాడు. ప్రకాష్ రాజ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన పాత్రలో ప్రకాష్ రాజ్ బాగా నటించాడు. ఈ చిత్రంలో కామెడీ పండించడంలో పోసాని పోసాని తనవంతు పాత్రని పోషించాడు. బాదం బాబాగా పోసాని ఆకట్టుకున్నాడు.

హీరోయిన్ మియా జార్జ్ తనకు అవకాశం ఉన్న మేరకు బాగానే నటించింది. లుక్స్ పరంగా కూడా ఆకట్టుకుంది. ఇక చిత్రంలో వెన్నెల కిషోర్ పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. వెన్నెల కిషోర్ కామెడీ అంత గొప్పగా లేకున్నా సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొంచెం బోరింగ్ సీన్స్ నుంచి ప్రేక్షకులని బయటపడేయగలిగాడు.

మైనస్ పాయింట్స్ :

చిత్రం ఆద్యంతం నెగిటివ్ పాయింట్సే కనిపిస్తాయి. ఈ చిత్రం ప్రేక్షుకులని ఆకట్టుకోవడం చాలా కష్టం. సునీల్ ఇకనైనా ఇలాంటి కథలని ఎంచుకోవడం ఆపేయాలి. ఇలాంటి కథలు ఇప్పుడు రాణించవు. సునీల్ కథని బట్టి కాకుండా, దర్శకుడు గత చిత్రాలు ‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ లని బట్టి ఈ చిత్రానికి కమిట్ అయినట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రంలో లాజిక్ లేని సన్నివేశాలు, ఆకట్టుకొని పెర్ఫామెన్స్, చికాకు పుట్టించే పాటలు ప్రేక్షకులని సీట్లలో కుర్చోనివ్వవు. స్క్రిన్ ప్లే కూడా బాగాలేదు.ఈ సినిమాని చివరి వరకు చూడడం అంటే ప్రేక్షకులకు పెద్ద పరీక్షే.

ఈ చిత్రం లో దర్శకుని ప్రతిభ మచ్చుకు కూడా కనిపించదు. ఈ చిత్రంలో ట్విస్ట్ లతో వచ్చే కొన్ని సన్నివేశాలు అర్థం లేనివిగా అనిపిస్తాయి. ప్రేక్షకులకు నిరాశ కలిగించే సన్నివేశాలు ఈ చిత్రం లో కోకొల్లలు.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బావున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలని రిచ్ గా చిత్రీకరించారు. గిబ్రాన్ సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. మధ్య మధ్యలో వచ్చే పాటలు బోరింగ్ స్టోరీ నుంచి ప్రేక్షుకులను ఉపశమనం కలిగించేవిగా ఉండవు. డైలాగులు బావున్నాయి. కెమెరా పనితనం బావుంది.

దర్శకుడు క్రాంతి మాధవ్ విషయానికి వస్తే.. గతం లో తన చిత్రాల వలన సంపాదించుకున్న పేరుని ఈ చిత్రంతో పోగొట్టుకున్నారు. ఇలాంటి దర్శకుడు ఈ విధంగా ఉంగరాల రాంబాబు చిత్రాన్ని తెరెక్కించడం షాక్ కి గురిచేసే అంశం. పతాక సన్నివేశాల్లో దర్శకుడు తన స్క్రీన్ ప్లే నైపుణ్యాని ప్రదర్శించలేకపోయాడు.

తీర్పు :

మొత్తానికి ఉంగరాల రాంబాబు చిత్రం అన్ని విభాగాల్లో ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ఇలాంటి కథలకు టాలీవుడ్ లో ఎప్పుడో కాలం చెల్లింది. సునీల్ తన కెరీర్ పరంగా ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలి. కథల ఎంపిక విషయం అతడు వ్యూహాలని మార్చాలి. పోసాని, వెన్నెల కిషోర్ లు కనిపించే కొన్ని ఫన్నీ సీన్స్ మినహా ఈ చిత్రంలో మరేం లేదు. కాబట్టి ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని మర్చిపోవడం మంచిది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English movie Review


సంబంధిత సమాచారం :