సమీక్ష : విడుదల పార్ట్ 1 – రియలిస్టిక్ గా సాగే పోలీస్ కథ

సమీక్ష : విడుదల పార్ట్ 1 – రియలిస్టిక్ గా సాగే పోలీస్ కథ

Published on Apr 16, 2023 3:01 AM IST
Vidudala Part 1 Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 15, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సూరి, భవాని శ్రీ, విజయ్ సేతుపతి, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్, తమిళ్ మరియు ఇతరులు

దర్శకులు : వెట్రిమారన్

నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్

సంగీత దర్శకులు: ఇళయరాజా

సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్రాజ్

ఎడిటర్: ఆర్ రామర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నేషనల్ అవార్డు గ్రహీత వెట్రిమారన్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ – 1. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి దీని సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

 

తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమరేసన్ (సూరి) పోలీసు అధికారిగా నియమితుడవుతాడు. అలానే అతను పోలీసు శిబిరంలో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కాగా అక్కడి కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రజాదళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పట్టుకోవడానికి ఆపరేషన్ ఘోస్ట్ హంట్ అనే మిషన్‌ కు కుమరేసన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. దురదృష్టవశాత్తు, పెరుమాళ్ యొక్క ఆచూకీ గురించి పోలీసు అధికారులు ఎవ్వరికీ తెలియదు, కానీ నిజాయితీగల పోలీస్ డ్రైవర్ అయిన కుమరేశన్ అతని స్థావరాన్ని కనుగొంటాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? డ్రైవర్‌ చెప్పిన మాటను పోలీసులు నమ్మారా? ఈ కథకు పాప అకా తమిళరసి (భవాని శ్రీ)కి ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు పెరుమాళ్‌ని పట్టుకున్నారా లేదా? అనే వాటన్నింటికీ సమాధానాలు కావాలంటే విడుదల పార్ట్ 1 మూవీ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

దర్శకుడు వెట్రిమారన్ సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు, ఆయన తీసుకున్న కథ, కథనాలని సహజత్వంతో గొప్పగా తెరకెక్కించగల దిట్ట. సాధారణ ప్రజలతో పోలీసులు ఏవిధంగా వ్యవహరిస్తారు అనేటువంటి అంశాలను విడుదల పార్ట్ 1 లో బాగా చూపించారు వెట్రిమారన్. నిజానికి విడుదల పార్ట్ 1 లో కథ అందరికీ తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియడ్ డ్రామా ని తన అలరించే స్టైల్ కథనంతో బాగా తెరకెక్కించారు దర్శకుడు. ఇక కమెడియన్ అయిన సూరిని ఇంతటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్రిమారన్ చేసిన పెద్ద సాహసం అనే అనాలి. అలానే సూరి కూడా తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువే అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్ గా ఆయన పెర్ఫార్మ్ చేసారు. అయితే సెకండ్ పార్ట్ లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది. తమిళరసి పాత్ర లో కనిపంచిన భవాని యాక్టింగ్ ఎంతో బాగుంది. అలానే సూరికి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్ తో పాటు ఇతర పాత్రధారులు అందరూ బాగా నటించారు. డబ్బింగ్ తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాల సింగిల్ షాట్ సీన్, ఇంటెన్స్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ గ్లింప్స్ వంటివి బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ముందుగా మనం చెప్పుకున్నట్లు ఈ స్టోరీ ఎంతో పాతదే కానీ దానిని మరింత ఎంగేజింగ్ గా ఆడియన్స్ ని అలరించేలా దర్శకడు వెట్రిమారన్ స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేదేమో. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఎంతో స్లో గా సాగుతుంది. కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ అవి సాగతీతగా అనిపించడం తో పాటు ఆడియన్స్ కి అవి కనెక్ట్ కావు. సెకండ్ హాఫ్ లో వచ్చే అర్ధనగ్న సన్నివేశాలు, వయొలెన్స్ వంటివి ఆడియన్స్ కి ఇబ్బంది కలిగిస్తాయి. మరో పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఇందులోని చాలా మంది ముఖ్య పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు వారికి పెద్దగా తెలియకపోవడం. అలానే కొన్ని సన్నివేశాలు తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండడంతో అవి మన తెలుగు వారికి పెద్దగా కనెక్ట్ కావు.

 

సాంకేతిక వర్గం :

 

సహజత్వానికి దగ్గరగా ఉన్న ఇటువంటి కథని తీసుకుని ఆడియన్స్ ని అలరించేలా ప్రయత్నించి తెరక్కించిన తీరుకి దర్శకుడు వెట్రిమారన్ ని అభినందించాలి. చాలా వరకు సీన్స్ ని ఎంతో సహజంగా అద్భుతంగా ఆయన తెరకెక్కించారు అనే చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ పై మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. ఆర్ వేల్రాజ్ ఫోటోగ్రఫి ఎంతో బాగుంది. కొన్ని వైడ్ యాంగిల్ షాట్స్ అయితే మరింత బాగున్నాయి. సినిమాలో రెండు పాటల తో పాటు పలు సన్నివేశాల్లో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది.

 

తీర్పు :

 

మొత్తంగా విడుదల పార్ట్ 1 అనేది సహజత్వానికి దగ్గరగా ఉండే రియలిస్టిక్ పోలీసు కథ అని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. వెట్రిమారన్ దర్శకత్వ ప్రతిభ, సూరి యాక్టింగ్, క్లైమాక్స్ వంటివి దీనికి ప్రధాన బలాలు. కొద్దిపాటి అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నప్పటికీ మొత్తంగా ఈ మూవీని ఈ వీకెండ్ చూసేయొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు