సమీక్ష : విన్నర్ – రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్

26th, February 2017 - 09:30:42 AM
Winner movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : గోపీచంద్ మలినేని

నిర్మాతలు : నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు

సంగీతం : ఎస్ఎస్ థమన్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రమే ఈ ‘విన్నర్’. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ పై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. మరి ఇన్ని అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

హార్స్ రేసుల మూలంగా చిన్నతనంలోనే తండ్రి మహేందర్ రెడ్డి (జగపతిబాబు)కు దూరమైన సిద్దార్ధ్ (ధరమ్ తేజ్) వాటి మీద అమితమైన ద్వేషం పెంచుకుంటాడు. అలా తండ్రికి దూరంగా పెరిగిన సిద్దార్థ్, సితార (రకుల్ ప్రీత్ సింగ్) ను ప్రేమిస్తాడు. కానీ సితార నాన్న మాత్రం ఆమెకు వేరొకరితో పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ పెళ్లి ఇష్టం లేని సితార తను సిద్దార్థ్ ను ప్రేమిస్తున్నానని తన తండ్రితో అబద్దం చెప్పి పందెం కూడా కడుతుంది.

అలా సితార ప్రేమ కోసం అనుకోకుండా పందెంలోకి దిగిన సిద్దార్థ్ ను గెలవకుండా చేయడానికి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాకీ అయిన ఆది అడ్డుపడుతుంటాడు. అదే సమయంలో సిద్దార్థ్ తను చిన్నతనంలో దూరమైన తండ్రి ప్రేమను గెలుచుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇలా సితార ప్రేమ కోసం, తండ్రి ప్రేమ కోసం రేసుకు దిగిన సిద్దార్థ్ తనకు అడ్డుపడుతున్న ఆదిని ఎలా ఎదుర్కొంటాడు ? అసలు ఆది ఎవరు ? అతని సిద్దార్థ్ జీవితంలోకి ఎలా వచ్చాడు ? దూరమైన తండ్రి ప్రేమను, పందెంగా పెట్టిన సితార ప్రేమను గెలిచి సిద్దార్థ్ విన్నర్ ఎలా అయ్యాడు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అంటే ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ గురించి. ఫస్టాఫ్ ఆరంభం నుండే దర్శకుడు నేరుగా కథలోకి వెళ్లిపోవడం, ఆ కథ కాస్త కొత్తగా హార్స్ రేసులు నైపథ్యంలో సాగేదిగా ఉండటం ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్ పద్మగా వెన్నెల కిశోర్ పాత్ర ద్వారా పండించిన కామెడీ, ఊహించని విధంగా మధ్యలో వచ్చి బిత్తిరి సత్తి చేసిన కామెడీ బాగా నవ్వించాయి. ఇక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ సింగం సుజాతగా పృథ్వి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్, పృథ్విల మధ్య సాగే కామెడీ సీన్లు ప్రతి ఒక్కటి బాగా వర్కౌట్ అయింది.

ఫస్టాఫ్ చివర్లో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా ఆకట్టుకుంది. ఊహించని విధంగా హీరో లైఫ్ టర్న్ తీసుకోవడం, అతనికి గెలవడం తప్ప వేరే మార్గం లేదన్నట్టు చేసే ఆ సందర్భం చాలా బాగుంది. అభిమానుల కోసమే అన్నట్టు ధరమ్ తేజ్ చెప్పిన కొన్ని పంచ్ డైలాగులు బాగా పేలాయి. కథలో ధరమ్ తేజ్, జగపతిబాబుల మధ్య నడిచిన కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త కదిలించాయనే చెప్పాలి. జగపతిబాబు తన నటనతో మెప్పించగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందం ప్లస్ అభినయం రెండింటితో ఆకట్టుకుంది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన బలహీనతల్లో చెప్పుకోవలసింది సెకండాఫ్ గురించి. ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి సెకండాఫ్ లో మంచి డ్రామా ఉంటుందని, జగపతిబాబు పాత్ర చుట్టూ భీభత్సం జరుగుతుందని ఆశిస్తే అవేమీ జగకపోగా రచయితల విచ్చలవిడి స్వేచ్ఛతో కథనం మరీ బలహీనంగా మారిపోయింది. దీంతో ఆకట్టుకునే బలమైన సన్నివేశం ఒక్కటి కూడా లేకుండా సెకండాఫ్ అంతా బోర్ కొట్టించింది. సినిమాకి ప్రధాన నైపథ్యం హార్స్ రేస్ కాబట్టి సినిమా చివర్లో హార్స్ రేస్ లాంటివి చాలా గొప్పగా ఉంటాయని ఊహిస్తే అవి కూడా చాలా చాలా సాదాసీదాగా ఉండి నిరుత్సాహపరిచాయి.

ఇక మరొక ప్రధాన మైనస్ పాయింట్ ఏమిటనే మెగా హీరోల నుండి, డ్యాన్సులు అద్భుతంగా చేయగల తేజ్ నుండి అభిమానులు సంతృప్తిపడే స్థాయి డ్యాన్సులు స్క్రీన్ మీద కనిపించలేదు. ఏదో కొత్త బాడీ లాంగ్వేజ్ ట్రై చేద్దామని డ్యాన్సులను దూరం పెట్టిన తేజ్ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఇక సెకాండాఫ్ లో ఎంటరయ్యే అలీ కామెడీ కూడా రొటీన్ గానే ఉండి ఎక్కడా నవ్వించలేదు. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో వచ్చిన పాటలు ఏవీ కూడా ప్రేక్షకుడి ఉత్సాహాన్ని పెంచే విధంగా లేవు. అలాగే సినిమాకు కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని కూడా హడావుడి ముగించేయడంతో అసంతృప్తి మిగిలిపోయింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు గోపీచంద్ మలినేని మంచి కథతో చిత్రాన్ని బాగానే ఆరంభించి ఫస్టాఫ్ అంతా కామెడీ, మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఎంటర్టైనింగానే నడిపించినా సెకండాఫ్ కు వచ్చే సరికి మాత్రం బలహీనమైన స్క్రీన్ ప్లేతో సినిమాను రొటీన్ గా మార్చి బోర్ కొట్టించాడు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా తయారు చేసింది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా థమన్ అందించిన పాటలు పెద్దగా మెప్పించలేదు. ఎడిటింగ్ బాగుంది. డ్యాన్స్ కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ అంత గొప్ప స్థాయిలో ఏమీ లేవు. తేజ్ పాత్రకు రాసిన పంచ్ డైలాగులు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

తీర్పు :

పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో గోపిచంద్ మలినేని రూపొందిన ఈ చిత్రంలో కొత్తదైన కథ, ఫస్టాఫ్ లో వెన్నెల కిశోర్, పృథ్వి ల నవ్వించే కామెడీ, ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్యాంగ్, తండ్రి-కొడుకుల మధ్య నడిచే కొన్ని ఎమోషన్ సన్నివేశాలు, తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబుల నటన ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం ఆకట్టుకొని కథనంతో నిండిన బోరింగ్ సెకండాఫ్, నిరుత్సాహపరిచే బలహీనమైన సన్నివేశాలు, అసంతృప్తిగా ముగిసిన క్లైమాక్స్, తేజ్ నుండి ఆశించిన స్థాయిలో డ్యాన్సులు లేకపోవడం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘విన్నర్’ కొన్ని బేసిక్ కమర్షియల్ అంశాలతో తయారుచేయబడిన రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Reiew