రానా సినిమాకు హిందీలోనే ఎక్కువ క్రేజ్!

రానా సినిమాకు హిందీలోనే ఎక్కువ క్రేజ్!

Published on Jan 17, 2017 4:43 PM IST

ghazi
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన రానా, తాజాగా ‘ఘాజీ’ అనే నావికాదళ యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమాతో వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈమధ్యే విడుదలైన ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తమిళంలో కూడా డబ్ అవుతోన్న ఈ సినిమా ట్రైలర్ అన్నిభాషల్లో కలుపుకొని సుమారు కోటికి పైగా వ్యూస్ సంపాదించి అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

పీవీపీ సినిమా, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను హిందీలో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ విడుదల చేస్తున్నారు. గతంలో బాహుబలి సినిమాను కూడా కరణ్ జోహర్ హిందీలో విడుదల చేయడంతో ఆ సినిమా ఇండియా వైడ్ పాపులర్ కాగలిగింది. ఇక ఇప్పుడు కూడా కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్ చేస్తోన్న ప్రమోషన్స్ భారీ ఎత్తున ఉన్నాయి. సినిమా విడుదలకు నెలరోజుల ముందునుంచే ఆన్‌లైన్‌లో ఘాజీ హడావుడి మొదలుపెట్టేశారు. తెలుగు, తమిళంలో కంటే ఈ సినిమాకు ఇప్పుడు హిందీలోనే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పుకోవాలి. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ, కేకే మీనన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు