ఇంటర్వ్యూ : కొరటాల శివ – ‘శ్రీమంతుడు’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా!

ఇంటర్వ్యూ : కొరటాల శివ – ‘శ్రీమంతుడు’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా!

Published on Jul 28, 2015 9:14 PM IST

kalatala-siva
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు తమ హీరోను ‘శ్రీమంతుడు’గా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చూస్తున్న ఎదురుచూపులకు మరో పది రోజుల్లో తెరపడనుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. ఇక తన మొదటి సినిమా ‘మిర్చి’లో ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్’ అంటూ తనదైన మార్క్‌ను చూపెట్టిన శివ, తాజాగా ‘శ్రీమంతుడు’లో ‘మనకు ఎంతో ఇచ్చిన ఊరికి ఏదైనా తిరిగివ్వకపోతే లావైపోతాం’ అంటూ మరో కొత్త కాన్సెప్ట్‌ను ఎత్తుకున్నారు. ఆగష్టు 7న తెలుగు, తమిళంలో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా ‘శ్రీమంతుడు’ ఏం చెప్పబోతున్నాడో చెప్పండి?

స) ‘శ్రీమంతుడు’ ఓ బలమైన ఎమోషన్ చుట్టూ తిరిగే కమర్షియల్ కథ. పెద్ద కోటీశ్వరుడైన హర్ష అనే యువకుడు, తన చుట్టూ అన్నీ ఉన్నా ఏదో వెలతితో ఒక ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణం ఏంటి? తాను ఈ ప్రయాణంలో ఏమేం చేశాడు? అన్నదే శ్రీమంతుడు సినిమా. ఇదేమీ మెసేజ్ ఓరియంటడ్ సినిమా కాదు. ఓ మంచి కథనే నిజాయితీగా ఎక్కడా మెసేజ్ చెబుతున్నట్టుగా కాకుండా, కథ ద్వారానా చెప్పాల్సిందంతా చెప్పే ప్రయత్నం చేశాం.

ప్రశ్న) శ్రీమంతుడి ప్రయాణం అటుంచితే ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?

స) ‘మిర్చి’ సినిమా తర్వాత రామ్ చరణ్ గారితో ఓ సినిమా అనుకున్నా. అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత మహేష్ గారి కోసమే తయారైంది అన్నట్లుగా వచ్చిన ఈ కథను ఆయనకు చెప్తే, వెంటనే ఓకే చేసేశారు. ‘ఆగడు’ షూటింగ్ సమయంలో మహేష్ ఈ కథ ఓకే చేశారు. ఆ సినిమా పూర్తవగానే ‘శ్రీమంతుడు’ను సెట్స్‌పైకి తీసుకెళ్ళాం. రెండున్నరేళ్ళు ఒక్క సినిమా లేకపోయినా ఆ ఎదురుచూపే శ్రీమంతుడుగా వస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ప్రశ్న) మహేష్ వెంటనే ఓకే చేసేటంత బలమైన అంశం ‘శ్రీమంతుడు’లో ఏముంది?

స) ఒక సరికొత్త కాన్సెప్ట్‌ను ఇంత కమర్షియల్‌గా చెప్పడమనే ఆలోచనే మహేష్ గారికి బాగా నచ్చింది. ఇక మొత్తం కథ విన్నాక ఆయన ఇంకా ఎగ్జైట్ అయ్యారు. సాధారణంగా నా సినిమాల్లో ప్రధానమైన బేసిక్ ఎమోషన్ ఒకటి బలంగా ఉంటాలని కోరుకుంటాను. నా ‘మిర్చి’ కూడా అదే కోవలో నడుస్తుంది. రేపు ‘శ్రీమంతుడు’లో కూడా అందరినీ కనెక్ట్ చేసేది ఆ బేసిక్ ఎమోషనే!

ప్రశ్న) టైటిల్ చూస్తే సాఫ్ట్‌గా ఉంది. ట్రైలర్ క్లాస్, మాస్ కలగలిపినట్లుంది. ఇంతకీ ‘శ్రీమంతుడు’ మాస్ సినిమానా? క్లాస్ సినిమానా?

స) నాకు ఈ క్లాస్, మాస్ అన్న అంశాల పైన పెద్దగా క్లారిటీ లేదు. నిజానికి సినిమాల విషయంలో అలాంటివి నమ్మను కూడా. ఇక ‘శ్రీమంతుడు’ విషయానికి వస్తే.. ఇది అందరి సినిమా. మీరన్నట్టు క్లాస్, మాస్, యూత్ ఇలా అందరూ మెచ్చే సినిమా ‘శ్రీమంతుడు’. మన సినిమాలో అందరికీ కనెక్ట్ చేసే, చేయగల బలమైన అంశం ఒకటి ఉన్నపుడు దాన్ని ఒకే వర్గానికి పరిమితం చేయడమన్న ఆలోచనలో అర్థం లేదు.

ప్రశ్న) ‘ఖలేజా’ సినిమా దగ్గర్నుంచి మహేష్ తన ప్రతీ సినిమాలో క్యారెక్టరైజేషన్ పరంగా కొత్తదనం ఉండేలా చూస్తున్నారు. ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం చూపిస్తున్నారు?

స) ‘శ్రీమంతుడు’ విషయంలో సింపుల్‌గా ఉండడమే మహేష్ క్యారెక్టర్‌లోని కొత్తదనం. ఓ పెద్ద కోటీశ్వరుడు, అంత సింపుల్‌గా ఉండడమనే ఆలోచనలోనే అసలైన కొత్తదనం ఉంది. ముందే చెప్పినట్లు ఇది శ్రీమంతుడి జర్నీ. ఆ జర్నీలో ఒక్కో స్టేజ్‌లో ఒక్కోలా కనిపిస్తూ మహేష్ క్యారెక్టరైజేషన్ నడుస్తుంది. బహుశా ఆయన తన కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేసి ఉండరు. పర్సనల్లీ నాకైతే ఈ సినిమా క్యారెక్టర్‌కు, మహేష్ గారి నిజ జీవితానికి పెద్దగా తేడా కనిపించలేదు. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఆయన అంత సింపుల్‌గా ఉండటాన్ని మనమెలా ఇష్టపడుతున్నామో, ఈ సినిమాలోని పాత్రనూ అలాగే ఇష్టపడతాం.

ప్రశ్న) మహేష్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

స) మహేష్‌తో కలిసి పనిచేయడమంటే అది అదృష్టం కిందే లెక్క. ఆయన దర్శకుల నటుడు. దర్శకుడిగా నేను ఇది చేయండి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఊహించిన దానికన్నా బాగా ఆయనే చేశాక చెప్పడానికి మనకూ పెద్దగా ఏమీ ఉండదనుకుంటా! దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసి పాత్రలోకి లీనమై చేసేస్తారు మహేష్. ఆయనతో ప్రయాణం అద్భుతంగా ఉంది.

ప్రశ్న) హీరోయిన్ శృతి హాసన్ గురించి చెప్పండి?

స) శృతి హాసన్ మంచి డెడికేషన్ ఉన్న నటి. ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా ఏదో రెండు సన్నివేశాల్లో వచ్చామా అన్నట్టుగా కాకుండా కథలో మంచి ప్రాధాన్యమున్న పాత్ర. ఆమె తన పాత్రను చాలా బాగా పోషించింది. ఇక మహేష్ గారితో ఆమె కెమిస్ట్రీ కూడా చాలా బాగా వచ్చింది. సాంగ్ ట్రైలర్స్ చూశాక వారిద్దరి కాంబినేషన్‌పై అప్పుడే మంచి ఆసక్తి ఏర్పడింది.

ప్రశ్న) జగపతి బాబు, సుకన్య.. మహేష్ తల్లితండ్రులుగా కూడా స్టార్సే నటించారు. ఇది కావాలని ప్లాన్ చేసిందా?

స) కావాలని ప్లాన్ చేసిందా అంటే.. మొదట్నుంచీ ఈ సినిమాలో మహేష్ తల్లిదండ్రులుగా సరిగ్గా సూటయ్యే పాత్రలు కావాలి, బిలియనీర్ అన్న నేపథ్యానికి కుదరాలి, బలమైన ఎమోషన్ కూడా పండించాలి అన్న అంశాల గురించి బాగా ఆలోచించా. అవన్నీ కలిపి చూస్తే నాకు జగపతి బాబు గారు పర్‌ఫెక్ట్ అనిపించారు. కథ విన్నాక ఆయన కూడా వెంటనే ఓకే చేసేశారు. ఇక జగపతి బాబు, సుకన్యల కాంబినేషన్ ‘పెద్దరికం’ తర్వాత మళ్ళీ ఈ సినిమాకే రిపీట్ అయింది.

ప్రశ్న) మొదట్లో శ్రీమంతుడు ఓ ఫ్యామిలీ డ్రామా అన్న ప్రచారం జరిగింది. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఎంతవరకు ఉంది?

స) ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఉంది. అయితే పూర్తిగా ఫ్యామిలీ డ్రామా మాత్రమే లేదు. ఈ సినిమా కథానాయకుడి జర్నీ. అందులో యాక్షన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, రొమాన్స్ ఉంది, ఎమోషన్ ఉంది. ఇవన్నీ మనం ఓ జర్నీలో మాత్రమే చూడగలం. శ్రీమంతుడు విషయంలో అందరినీ ఆకట్టుకునే అంశం ఇదే!

ప్రశ్న) ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌కాపీ సిద్ధమైందా?

స) రేపటికల్లా మొత్తం పూర్తవుతుంది. ఔట్‌పుట్ చూశాక అందరం హ్యాపీగా ఉన్నాం. మహేష్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. డబ్బింగ్ చెప్పేటపుడు ఆయన, చెప్పినదానికంటే రెట్టింపు అందంగా సినిమా చేశానని మెచ్చుకున్నారు. రేపు ప్రేక్షకులూ అదే అంటారని కోరుకుంటున్నా.

ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) మేజర్ హైలైట్ అంటే ఎప్పుడైనా కథే అని చెబుతా. ఆ కథ చుట్టూ ఉన్న ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక మహేష్ గారు ఈ సినిమాకు హైలైట్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సందర్భానుసారంగా వచ్చే పాటలు, మహేష్-శృతి హాసన్‌ల కెమిస్ట్రీ, ఇంతకుముందు ఎక్కడా చూడని ఓ సరికొత్త ఫ్యామిలీ ఎమోషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కమాటలో.. ప్రతీ ప్రేక్షకుడూ ఎంజాయ్ చేసే సినిమా ‘శ్రీమంతుడు’.

ప్రశ్న) శ్రీమంతుడు తర్వాత ఏ సినిమా చేయబోతున్నారు?

స) ఇంకా ఏ సినిమా అనుకోలేదు. కొన్ని కథలూ, ప్రణాళికలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా విడుదలయ్యాక గానీ కొత్త సినిమా గురించి ఆలోచించదల్చుకోలేదు.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు