ఇంటర్వ్యూ : సాయి ధరమ్ తేజ్ – స్క్రీన్ పై నన్ను చూసుకోగానే చాలా ఎమోషనల్ అయ్యాను.

ఇంటర్వ్యూ : సాయి ధరమ్ తేజ్ – స్క్రీన్ పై నన్ను చూసుకోగానే చాలా ఎమోషనల్ అయ్యాను.

Published on Nov 15, 2014 3:51 PM IST

Sai-Dharmatej-(8)

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా సంతోషంగా ఉన్నాడు. మొదట నటించింది ‘రేయ్’ సినిమాలో అయినా, విడుదలైంది మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’. డెబ్యూ హీరోగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ఎప్పటి నుండో మీరు ఎదురుచూస్తున్న సమయం ఇది. మీ సినిమా విడుదలైంది. ఎలా ఫీల్ అవుతున్నారు..?

స) చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను. ఇప్పుడు కొంచం రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నాను.

ప్రశ్న) ఈ సినిమాకి మీరు అందుకున్న మొదటి కాంప్లిమెంట్ ఏంటి..?

స) చిరంజీవి గారు సినిమా చూసిన తర్వాత ‘యు డిడ్ ఎ గుడ్ జాబ్’ అని అభినందించారు. న భవిష్యత్ బాగుండాలని ఆశీర్వదించారు.

ప్రశ్న) మీరు సినిమా రంగంలో ప్రవేశించాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు..?

స) ఎంబిఏ పూర్తయిన తర్వాత సినిమా రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. ఉదయం 9 గంటలకు ఆఫీసుకి వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చే ఉద్యోగం నేను చేయలేనని అర్ధమయింది. సినిమాలలోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత మొదట పవన్ కళ్యాణ్ గారిని కలసి నా మనసులో కోరిక చెప్పాను. తర్వాత మా మావయ్యల సహాయంతో నటనలో శిక్షణ తీసుకున్నాను.

ప్రశ్న) మీరు ఎటువంటి శిక్షణ తీసుకున్నారు..?

స) సినిమాలలోకి రాక ముందు నేను చాలా లావుగా ఉండేవాడిని. అప్పుడు నా వెయిట్ 130 కేజీలు. మొదట వెయిట్ తగ్గించుకున్నాను. తర్వాత సత్యానంద్, బారీ జాన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లలో నటనలో శిక్షణ తీసుకున్నాను.

ప్రశ్న) ‘రేయ్’ సినిమా అవకాశం ఎలా వచ్చింది..?

స) మంచు మనోజ్ ఆఫీసు వద్ద నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. ఒక రోజు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆఫీసులో ఉండగా నన్ను వైవిఎస్ చౌదరి గారు చూశారు. నా సినిమాలో హీరోగా నటిస్తావా..? అని అడిగారు. అప్పటికి మా ఫ్యామిలీ గురించి ఆయనకు తెలియదు. నేను చెప్పగానే మా ఫ్యామిలీ సభ్యులతో మాట్లాడారు. అలా ‘రేయ్’ సినిమా ప్రారంభమైంది.

ప్రశ్న) ఆ సినిమా విడుదల ఆగిపోవడం పట్ల మీరు డిసప్పాయింట్ అయ్యారా..?

స) బాగా డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే, కాకపోతే నా చేతులలో ఏమి లేదు కదా. బట్, మా కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతుతో నేను ఆ పరిణామాల నుండి బయటపడ్డాను. మొదట ఎ సినిమా విడుదల అయినా నాకు మంచి పేరు తీసుకొస్తుందని నాలో ధైర్యాన్ని నింపారు. ‘రేయ్’ సినిమా కూడా విడుదల తర్వాత నాకు మంచి పేరు తీసుకొస్తుంది. ఆ సినిమాపై నమ్మకం ఉంది.

ప్రశ్న) ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుంది..?

స) మొదట నా ఫ్యామిలీ హీరోలు సెట్ చేసిన స్టాండర్డ్ నేను కొనసాగించగలను అనే నమ్మకం, ఉపశమనం నాలో కలిగింది. అభిమానులతో కలసి నేను సినిమా చూశాను. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. మొదటిసారి నన్ను నేను స్క్రీన్ పై చూసుకోగానే చాలా ఎమోషనల్ అయ్యాను.

ప్రశ్న) జగపతి బాబుతో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి..?

స) మొదట నేను శ్రీహరి గారితో షూటింగ్ లో పోల్గొన్నాను. శ్రీహరి గారి ఆకస్మిక మరణంతో జగపతి బాబు గారిని ఆ క్యారెక్టర్ చేయవలసిందిగా సంప్రదించాం. ఆయన ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన తర్వాత సినిమాకు ఓ కొత్త కళ వచ్చింది. జగపతి బాబు గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ అమైజింగ్. నన్ను సొంతం కుమారుడిలా ట్రీట్ చేశారు.

ప్రశ్న) సినిమాల ఎంపికలో మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంత వరకు ఉంటుంది..?

స) నా సినిమాల ఎంపికలో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఒక స్క్రిప్ట్ లను చదివిన తర్వాత నటించాలో..? వద్దో..? డిసైడ్ అవుతాను.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి..?

స) హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో నటించబోయే ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్ లను చదువుతున్నాను. త్వరలో ఫైనలైజ్ అవుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు