సంచలనాల ‘పోకిరి’కి పదేళ్ళు..!

సంచలనాల ‘పోకిరి’కి పదేళ్ళు..!

Published on Apr 28, 2016 7:28 PM IST

Pokiri
కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయ్! కొన్ని వచ్చాక కొంతకాలం నిలబడతాయ్!! చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఎప్పటికీ అలాగే నిలబడిపోతాయ్!!! తెలుగు సినీ ప్రయాణంలో ఎప్పటికీ నిలబడిపోయే సినిమాల్లో ఒకటి ‘పోకిరి’. పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కలయికలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా పదేళ్ళు. ఏప్రిల్ 28, 2006న విడుదలైన ఈ సినిమా విడుదలతోనే ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలో అప్పటివరకూ ఏ సినిమా సొంతం చేసుకోనన్ని రికార్డులను ‘పోకిరి’ సొంతం చేసుకుంది.

200 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమా, మొదటి సారి ఓ తెలుగు సినిమా 40కోట్ల షేర్ సాధించడం, భారతదేశంలోని మిగతా ప్రధాన సినీ పరిశ్రమల్లో రీమేకై అక్కడా ఘన విజయం సాధించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘పోకిరి’ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఎవ్వరూ చెరపలేని, ఎప్పుడూ చెరిగిపోని రికార్డులవి. ఘన విజయాలు సాధించిన కొన్ని సినిమాల విషయంలో ఏదో మ్యాజిక్ పని చేస్తుందంటారు. ఈ సినిమాలో అన్ని విభాగాల నుంచి నూటికి నూరు శాతం పని చేసిన మ్యాజిక్‌ను గమనించవచ్చు. హీరోయిన్‌గా ఇలియానా, విలన్‌గా ప్రకాష్ రాజ్, మిగతా పాత్రల్లో నాజర్, అజయ్, షాయాజీ షిండే, కమెడియన్లుగా బ్రహ్మనందం, ఆలీ ఇలా ప్రతీ ఒక్క పాత్రకూ సరైన ఔచిత్యం, టైమింగ్, ప్రాధాన్యత కలగలిసి సినిమాను ఎక్కడో నిలబెట్టాయ్.

నటవర్గం విశేషాలు అలా ఉంటే.. సాంకేతికంగానూ పోకిరి అప్పటికి ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్. శ్యామ్. కె. నాయుడు సినిమాటోగ్రఫీ, మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్, మార్తాండ్.కె.వెంకటేష్ షార్ప్ ఎడిటింగ్.. అన్నీ ప్రేక్షకుడిని ఓ సరికొత్త అనుభూతికి లోనుచేశాయి. తెలుగులో సిసలైన కమర్షియల్ సినిమా అంటే ఒక అర్థాన్ని, అనుభూతిని అనుభవంలోకి తీసుకొచ్చిన సినిమా పోకిరి. చివర్లో ఈ సినిమాకు ప్రధాన బలాలైన మహేష్ బాబు, పూరీ జగన్నాథ్‌ల గురించి చెప్పుకుంటే.. మహేష్ తన అనితర సాధ్యమైన నటనతో సినిమాకు డెప్త్‌ను, ఫీల్‌ను తీసుకొచ్చాడు. మహేష్‌ను స్టార్ నుంచి సూపర్ స్టార్‌ను చేసింది పోకిరి సినిమాయే! పోకిరి విషయంలో పూరీ జగన్నాథ్ గురించి చెప్పుకోవాలంటే.. ఎంత చెప్పినా తక్కువే! తన మార్క్ క్యారెక్టరైజేషన్‌, స్క్రీన్‌ప్లే, ఎమోషన్‌తో ప్రేక్షకుడిని తన మాయలో కట్టిపడేశాడు పూరీ. ఇక పూరీ ఈ సినిమాలో చెప్పించిన డైలాగులు ఇప్పటికీ ఓ సెన్సేషనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు ఎప్పుడో గానీ రావు. ఆ సినిమాలు వచ్చిన తర్వాత వాటి గురించి చెప్పుకునే గొప్పలు కూడా ఎప్పటికీ ఆగవు. కాబట్టే సినిమా విడుదలై ఇన్నేళ్ళైనా ‘పోకిరి’ గొప్పదనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు