సమీక్ష : భాయ్ – ఆకట్టుకోని ‘భాయ్’..

సమీక్ష : భాయ్ – ఆకట్టుకోని ‘భాయ్’..

Published on Oct 26, 2013 12:30 PM IST
Bhai2 విడుదల తేదీ : 25 అక్టోబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : వీరభద్రం చౌదరి
నిర్మాత : నాగార్జున
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్..

చాలా కాలం తర్వాత ‘కింగ్’ అక్కినేని నాగార్జున చేసిన మాస్ కామెడీ ఎంటర్టైనర్ ‘భాయ్’. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్ జంటగా నటించిన భాయ్ మూవీని వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేసాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున ఈ సినిమాని నిర్మించాడు. భాయ్ బుల్లెట్స్ వల్ల రిలీజ్ కి ముందే మంచి క్రేజ్ రావడం, అలాగే నాగ్ చాలా రోజుల తర్వాత చేసిన మాస్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై బాగానే అంచనాలున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

డేవిడ్(ఆశిష్ విద్యార్థి) హాంకాంగ్ లో కూర్చొని మాఫియా సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేస్తుంటాడు. డేవిడ్ కి ఇద్దరు కొడుకులు ఒకరు టోనీ(అజయ్), రెండు జేమ్స్(సోనూ సూద్). డేవిడ్ తన కొడుకుల కంటే తన రైట్ హ్యాండ్ అయిన భాయ్(నాగార్జున)కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాడు. డేవిడ్ మాఫియా సామ్రాజ్యం అంతా తన కంట్రోల్ లోనే ఉంది అనుకుంటున్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న తన మాఫియా సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి చేయడానికి అర్జున్(ప్రసన్న)ని అండర్ కవర్ కాప్ గా రంగంలోకి దింపుతారు.

అర్జున్ వల్ల డేవిడ్ కి సమస్యలు వస్తుండడంతో అతన్ని చంపేయాలనుకుంటారు. ఆ పనిని భాయ్ కి అప్పగించడంతో భాయ్ హైదరాబాద్ కి వస్తాడు. భాయ్ అర్జున్ చంపబోయే సమయంలో కథలో ఓ ట్విస్ట్. ఆ ట్విస్ట్ తో భాయ్ అర్జున్ ని చంపకుండా డేవిడ్ కి ఎదురు తిరగాల్సి వస్తుంది. కానీ భాయ్ డైరెక్ట్ గా ఎదురు తిరక్కుండా ఓ పథకం వేస్తాడు. భాయ్ పథకం ప్రకారం డేవిడ్ ని ఎలా అంతం చేసాడు? అసలు కథలో ట్విస్ట్ ఏంటి? అసలు భాయ్ అర్జున్ ని ఎందుకు చంపలేదు? వారిద్దరికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా? లేక భాయ్ కి ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో కింగ్ నాగార్జున లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. ఈ విషయంలో ఆయన కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవాలి. అలాగే మూడు విభిన్న గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. నాగార్జున డాన్సులు కూడా బాగా చేసారు. అలాగే తెలంగాణ యాసలో మాట్లాడే సీన్స్ బాగా చేసారు. రిచా గంగోపాధ్యాయ్ కి కథలో పెద్ద ప్రాముఖ్యత లేకపోవడంతో పాటల వరకే పరిమితమయ్యింది. రిచా లుక్స్ పరంగా బాగుంది. నాగార్జున చెల్లెలిగా నటించిన జర ఓకే. రయ్య రయ్య పాటలో హంసా నందిని ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంది. సినిమా మొదటి 20 నిమిషాలు బాగుంది.

ప్రసన్న పోలీస్ ఆఫీసర్ గా బాగా చేసాడు. విలన్ పాత్రలో సోనూ సూద్ కాస్త కామెడీ చేసాడు. ముఖ్యంగా ‘అత్తారింటికి దారేది’ సీన్ ఫన్నీగా ఉంటుంది. చూడటానికి విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మొదటిది మైనస్ పాయింట్ అంటే సీన్ కి సీన్ కి పెద్దగా లింక్ లేకపోవడం. ఏదో సీన్స్ వస్తుంటాయి, పోతుంటాయి, సీన్స్ మధ్యలో బోర్ కొడుతుందేమో అని పాటలు కూడా వస్తుంటాయి. కానీ సీన్స్ కి, సాంగ్స్ కి లింక్ మాత్రం పెద్దగా ఉండదు. ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందిగా’ అన్న సామెత ప్రకారం సినిమా మొదటి 20 నిమిషాల తర్వాత నుండి ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు కథ ఇంచు కూడా ముందుకు కదలదు. ఇంటర్వెల్ లో ఇచ్చే ఒకే ఒక్క చిన్న ట్విస్ట్ బాగున్నప్పటికీ సెకండాఫ్ ఎలా ఉండబోతుందా అనేది మనం ఈజీగా ఊహించేయవచ్చు అంటే స్క్రీన్ ప్లే ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాలో మూడు విభాగాలను డైరెక్టర్ డీల్ చెయ్యాలనుకున్నాడు. 1. తండ్రి – కొడుకుల బంధం, 2. అన్న – చెల్లెలి సంబంధం, 3. నాగ్ – రిచా రొమాంటిక్ ట్రాక్, కానీ ఈ మూడింటిలో ఒక్కదాన్ని కూడా డీల్ చెయ్యలేకపోయాడు. ఎమోషనల్ సీన్స్ అంత సరిగా రాలేదు. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పిన ఈ మూవీలో కామెడీ కూడా లేకపోవడం ఈ సినిమాకి మరో మైనస్. యువత, అభిమానులు పంచ్ డైలాగ్స్ రాస్తే బాగా రిసీవ్ చేసుకుంటున్నారని ఈ సినిమాలో భాయ్ బుల్లెట్స్ అని పంచ్ డైలాగ్స్ రాసుకున్నారు. కానీ సందర్భంతో సంబంధం లేకుండా అవసరం లేకపోయినా వరుసగా బుల్లెట్స్ వస్తుండడంతో ప్రేక్షకులకి కాస్త చిరాకేస్తుంది.

చాలా స్లోగా సాగుతున్న సినిమాలో వేగం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో పాటలు వచ్చి సినిమా ఫ్లోని ఇంకా తగ్గించడమే కాకుండా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. బ్రహ్మానందం లాంటి బిగ్ కమెడియన్ ని సరిగా వాడుకోలేకపోయారు. అలాగే బ్రహ్మానందంతో చేయించిన కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు. అలాగే జయప్రకాష్ రెడ్డి, నాగినీడు, ఆశిష్ విద్యార్థి, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్ లాంటి సీనియర్ నటులను డైరెక్టర్ సరిగా ఉపయోగించుకోలేకపోయారు. కామ్న జఠ్మలాని ట్రాక్ అసలు అవసరం లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పుకోవాల్సింది నిర్మాణ విలువల గురించి, నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేం గ్రాండ్ గా రావాలని వారు పెట్టిన ఖర్చు మాత్రం వృధా కాలేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేం ని బాగా రిచ్ గా చూపించారు. ఎడిటింగ్ సినిమాకి చాలా పెద్ద మైనస్. సీన్ జరుగుతుంటే మధ్యలో కట్ అయిపోయి వేరే సీన్ కి వెళ్లి పోతుంటుంది. ఆడియన్స్ కి చిరాకు తెప్పించేలా ఎడిటింగ్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. భాయ్ బుల్లెట్స్ బాగానే ఉన్నప్పటికీ అన్ని బుల్లెట్స్ సందర్భానికి సెట్ అవ్వలేదు.

దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. డైరెక్టర్ వీరభద్రం చౌదరి తన గత రెండు సినిమాల్లో చిన్న హీరోలు, కామెడీ హీరోలు కావడం వల్ల వాళ్ళని బాగానే డీల్ చేసాడు. కానీ ఈ సినిమాలో నాగార్జున లాంటి పెద్ద హీరోని మాత్రం డీల్ చెయ్యలేక విఫలమయ్యాడు. అలాగే తని గత సినిమాల్లో లాగా ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో మిస్ అయ్యింది.

తీర్పు :

మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘భాయ్’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో నాగార్జున లుక్, ఫైట్స్, డాన్సులు మాత్రం నాగార్జున అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి నాగార్జున ఒక్కరే హైలైట్ అయితే వీక్ స్క్రీన్ ప్లే, కామెడీ పెద్దగా లేకపోవడం, ఊహాజనితమైన సెకండాఫ్, బాలేని ఎడిటింగ్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. భారీ అంచనాల నడుమ వచ్చిన భాయ్ ప్రేక్షకులని నిరుత్సాహపరిచింది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు