సమీక్ష : డా. చక్రవర్తి – క్రైమ్ సీన్స్ వరకు పర్వాలేదు

సమీక్ష : డా. చక్రవర్తి – క్రైమ్ సీన్స్ వరకు పర్వాలేదు

Published on Jul 15, 2017 5:19 PM IST
Dr. Chakravarthy movie review

విడుదల తేదీ : జూలై 14, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : శేఖర్ సూరి

నిర్మాత : ఆకుల వెంకటేశ్వర్లు

సంగీతం : విజయ్ కురాకుల

నటీనటులు : సోనియా మన్, రిషి, గిరీష్ సహదేవ్

‘ఏ ఫిల్మ్ బై అరవింద్, అరవింద్-2’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు శేఖర్ సూరి ప్రస్తుతం చేసిన సినిమా ‘డా.చక్రవర్తి’. క్రైమ్, థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా ఈరోజే రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సొసైటీలో మంచి పేరున్న డా. చక్రవర్తి ఒక గ్యాంగ్ స్టర్ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేస్తాడు. కానీ దాన్ని తీర్చలేకపోవడంతో ఆ గ్యాంగ్ స్టర్ చక్రవర్తిని, అతని కుటుంబాన్ని చంపుతాడని వర్కింగ్ ఇస్తాడు. ఆ వార్త కాస్త బయటికి పొక్కడంతో పరువు పోయిన చక్రవర్తి ప్రాణ భయంతో ఊహకందని నిర్ణయం ఒకటి తీసుకుంటాడు.

ఆ నిర్ణయాన్ని తన భార్యకు చెప్పి కుటుంబాన్ని ఊరి చివరన ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకెళతాడు. ఇంతకీ డా. చక్రవర్తి తీసుకున్న ఆ భయంకర నిర్ణయం ఏమిటి ? అసలతను ఫామ్ హౌస్లో ఏం చేయాలనుకున్నాడు ? అతని ప్లాన్ వర్కవుట్ అయిందా లేదా ? చివరికి డా. చక్రవర్తి, అతని కుటుంబం ఏమయ్యారు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్లస్ పాయింట్ అంటే టైటిల్ రోల్ అయిన డా. చక్రవర్తి పాత్ర, దాని వెనకున్న కథ. సినిమా మొదటి అర్థ భాగం ఒకలా కనిపించిన చక్రవర్తి మిగతా సగం మరోలా కనిపిస్తాడు. ఆ పాత్రలోని వేరియేషనే సినిమాను నడిపించింది. అంతేగాక ఆ పాత్రలో నటించిన గిరీష్ సహదేవ్ కూడా దర్శకుడు శేఖర్ సూరి ఎలాగైతే పాత్రను డిజైన్ చేశాడో అలానే నటించి మెప్పించాడు.

ముఖ్యంగా సెకండాఫ్లో చక్రవర్తి పాత్ర ప్రవర్తన, స్వభావం విస్మయాన్ని కలిగిస్తాయి. అలాగే ఫస్టాఫ్ ఇంటర్వెల్ సన్నివేశం, సినిమా చివరి 50 నిముషాల పాటు నడిచే కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకోవడంతో పాటు కథలో రివీల్ అయ్యే ట్విస్ట్ కొన్ని సినిమాల్లో చూసినదే అయినా ఊహించని రీతిలో కథలోకి ప్రవేశించి థ్రిల్ చేసింది. ఇక హీరోయిన్ సోనియా మన్ కూడా సెకాండాఫ్లో తన నటనతో ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అర్థ భాగం మరీ బోర్ అనిపించింది. తక్కువ సయమంలో చెప్పాల్సిన కథను ఎలాంటి ఎగ్జైట్మెంట్స్, టైమ్ పాస్ స్టఫ్ లేకుండా ఎక్కువసేపు చెప్పడంతో నీరసం కలిగింది. అంతేగాక కొన్ని అనవసరపు సన్నివేశాలు కథనంలోకి రావడం, కథలో కొంచెం డీప్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పాత్రలు ఏదో ఉన్నాంలే అన్నట్టు పెర్ఫార్మ్ చేయడం నిరుత్సాహం కలిగించడంతో పాటు సినిమాపై కొంచెం ఆసక్తిని కూడా తగ్గించాయి.

క్రైమ్ తాలూకు సన్నివేశాలు కొన్ని బాగానే ఉన్నా కొన్ని మాత్రం పదే పదే రిపీట్ అవుతున్నట్టు అనిపించాయి. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్ కు ప్రధాన బలంగా నిలవాల్సిన సినిమాటోగ్రఫీ కొంచెం తక్కువ క్వాలిటీలో ఉండటంతో చిన్నపాటి అసంతృప్తి కలిగింది. అంతేగాక కెమెరా కదలికలు కూడా సాదా సీదాగానే ఉండటంతో ప్రేక్షకుడు గగుర్పాటుకు గురయ్యే సందర్భం ఒక్కటి కూడా కనిపించలేదు. మరొక ముఖ్యమైన అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ప్రభావితంగా అనిపించలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శేఖర్ సూరి సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని తీసిన ఈ సినిమాకు ఆయన తయారుచేసుకున్న కథ చిన్నదే. కథనం పరంగా చూసుకుంటే సెకండాఫ్ ను క్రైమ్ తాలూకు సన్నివేశాలతో కొంచెం బాగానే రాసినా మొదటి అర్థ భాగాన్ని మాత్రం నిరుత్సాహం కలిగే రీతిలో తయారుచేశారు. అంతేగాక షాట్స్ మేకింగ్లో కూడా ఆయన గత హిట్ సినిమా ‘ఏ ఫిలిం బై అరవింద్’ లోని తీవ్రతను చూపించలేకపోయారు.

ఇక కె.రాజేంద్రబాబు సినిమాటోగ్రఫీ తక్కువ క్వాలిటీలో ఉండటమేగాక ఒక క్రైమ్ థ్రిల్లర్ కు తోడ్పడే రీతిలో లేదు. సినిమాకు అదనవు బలంగా నిలవాల్సిన విజయ్ కురాకుల బ్యాక్ గ్రౌండ్డ్ స్కోర్ కూడా మామూలుగా ఉంది. ఆకుల వెంకటేశ్వర్లు నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

తీర్పు :

విభిన్న దర్శకుడు శేఖర్ సూరి డైరెక్ట్ చేసిన ఈ ‘డా.చక్రవర్తి’ సినిమాలో చిన్నపాటి కథ, సెకండాఫ్లోని క్రైమ్ సన్నివేశాలు, ముఖ్యమైన ట్విస్ట్, ఇంటర్వెల్ సీన్, డా. చక్రవర్తి పాత్ర చిత్రీకరణ మెప్పించే అంశాలు కాగా నిరుత్సాపరిచిన ఫస్టాఫ్ కథనం, సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, షాట్ మేకింగ్స్ ఒక క్రైమ్ థ్రిల్లర్ కు ఉండాల్సిన రీతిలో లేకపోవడం బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకుల్ని మెప్పించలేదు కానీ క్రైమ్, థ్రిల్లర్ జానర్లను అమితంగా ఇష్టపడే వాళ్లకు పర్వాలేదనిపించే అవకాశముంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు