సమీక్ష : హైపర్ – హైపరున్నోడి ఎనర్జిటిక్ ఛాలెంజ్..!

సమీక్ష : హైపర్ – హైపరున్నోడి ఎనర్జిటిక్ ఛాలెంజ్..!

Published on Oct 1, 2016 3:39 PM IST
Hyper review

విడుదల తేదీ : సెప్టెంబర్ 30, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్

నిర్మాత : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర

సంగీతం : జిబ్రాన్

నటీనటులు : రామ్, రాశి ఖన్నా, రావు రమేష్, సత్య రాజ్..

‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టిన రామ్, తాజాగా ‘హైపర్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మెప్పించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ దసరా సీజన్‌కు క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమాకు రామ్‌కు కందిరీగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మరి భారీ అంచనాల మధ్యన, పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

సూర్య అలియాజ్ సూరి (రామ్) ఓ ఎనర్జిటిక్ కుర్రాడు. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి నారాయణ మూర్తి (సత్య రాజ్) కొడుకైన సూరికి తండ్రంటే ఎక్కడిలేని ప్రేమ. తండ్రి బాగుకోసం ఎంతటిదూరమైనా వెళుతుంటాడు. ఇక రిటైర్మెంట్‌కు దగ్గర పడిన సమయంలో నారాయణ మూర్తికి రాజప్ప (రావు రమేష్) అనే ఓ మినిష్టర్ నుంచి ఇబ్బంది తలెత్తుతుంది. వైజాగ్‌లో తాను కట్టే కమర్షియల్ కాంప్లెక్స్‌కు పర్మిషన్ ఇవ్వాలంటూ నారాయణ మూర్తిపై రాజప్ప ఒత్తిడి తెస్తాడు.

కాగా నిజాయితీయే మారుపేరుగా బతికే నారాయణ మూర్తి కాంప్లెక్స్ పర్మిషన్ ఇవ్వనంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నారాయణ మూర్తి కొడుకు సూరి ఈ విషయం తెలుసుకొని ఏం చేశాడు? రాజప్పను సూరి ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథలో భానుమతి (రాశి ఖన్నా), గజ (మురళి శర్మ) ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఫస్టాఫ్ నెరేషన్ అనే చెప్పుకోవాలి. తండ్రంటే విపరీతమైన ప్రేమ ఉండే హీరో నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, గజ అన్న రౌడీతో హీరో ఫ్రెండ్‌షిప్ ఇలా వీటన్నింటినీ ఒక కొత్తదనమున్న స్క్రీన్‍ప్లేతో చెప్పిన విధానం కట్టిపడేసేలా ఉంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కూడా అదిరిపోయేలా ఉంది. మొదట్నుంచీ చివరివరకూ కామెడీ ఎక్కడా తగ్గకుండా చూసుకోవడం కూడా బాగుంది. ఆ కామెడీ కోసం సెపరేట్ ట్రాక్స్ పెట్టకుండా అసలు కథలోనే తెలివిగా కామెడీని పండించిన విధానం బాగుంది. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా పనిచేయడం సమాజానికి ఎంత అవసరమో తెలిపేలా వచ్చే సోషల్ మెసేజ్ కూడా బాగుంది. సెకండాఫ్‌లో హీరో, అతడి తండ్రి మధ్యన వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటూ బాగా ఆకట్టుకున్నాయి.

హీరో రామ్ తన ఎనర్జీతో మరోసారి కట్టిపడేశాడు. కామెడీ, యాక్షన్, డ్యాన్స్.. ఎక్కడా తగ్గకుండా రామ్ సినిమాను తన భుజాలపై నడిపించాడు. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ విషయంలో ఎప్పట్లానే అదరగొట్టాడు. రాశిఖన్నా క్యూట్‌గా బాగా చేసింది. కొన్నిచోట్ల అందాలతో కనువిందు చేస్తూ కూడా ఆకట్టుకుంది. ఇక రావు రమేష్‌ను ఈ సినిమాకు ఓ ప్రధాన బలంగా చెప్పుకోవాలి. ఎలాంటి పాత్రనిచ్చినా తన ప్రెజెన్స్‌తో సినిమానే మరోస్థాయికి తీసుకెళ్ళగలనని రావు రమేష్ ఈ సినిమాతోనూ ఋజువుచేశాడు. కామెడీకి కామెడీ పండిస్తూనే విలన్‌గా రావు రమేష్ కట్టిపడేశాడు. ఒక హుందా పాత్రలో సత్యరాజ్ తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించాడు. ఇక మురళి శర్మ తన స్టైల్ నటనతో ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ అంటే కథ ఫార్ములాది కావడం. ఇలాంటి కథలు కమర్షియల్ సినిమాలన్నింటిలోనూ ఎక్కడో ఒకదగ్గర కనిపిస్తూనే ఉంటాయి. ఇక హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా కాస్త సిల్లీగా కనిపించింది. పాటలు సినిమా మూడ్‌ను దెబ్బతీయడమే కాకుండా బోరింగ్‌గా కూడా అనిపించాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో పాటలు అన్నీ అసందర్భంగానే రావడం మైనస్సే! అలాగే రాశి ఖన్నా పాత్ర సెకండాఫ్‌లో పూర్తిగా కనిపించకుండా పోవడం కూడా బాగోలేదు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ గురించి చెప్పుకుంటే, ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఏయే అంశాలు ఉండాలో వాటన్నింటినీ చూసుకుంటూ మంచి స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఫస్టాఫ్‌ నెరేషన్ విషయంలో సంతోష్ శ్రీనివాస్ కట్టిపడేశాడనే చెప్పాలి. రామ్ లాంటి హీరోతో, తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్‌లో ఒక కొత్తదనమున్న అంశంతో సినిమా తీయాలన్న ఆలోచనను సంతోష్ శక్తిమేర తెరపై ఆవిష్కరించగలిగాడు. అయితే హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ సరిగ్గా లేకపోవడం, సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన పాటలు పెట్టడం లాంటి విషయాల్లో సంతోష్ తడబడ్డట్టనిపించింది.

జిబ్రాన్ అందించిన సంగీతం ఫర్వాలేదనేలా ఉంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అయితే హీరో-విలన్ తలపడే కొన్ని సన్నివేశాల్లో షాట్ మూవ్‌మెంట్ అంతబాగోలేదు. ఎడిటింగ్ ఫర్వాలేదు. అబ్బూరి రవి అందించిన మాటలు చాలా బాగున్నాయి. 14 రీల్స్ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు.

తీర్పు :

తెలుగు సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో అసలు కథ చాలాసార్లు పాతదే కనిపిస్తూ ఉంటుంది. అయితే అందులోనూ కొత్త ఎమోషన్‌ను, కొత్తదనమున్న నెరేషన్‌తో చెప్తే విజయం సాధిస్తాయని ఇదే కమర్షియల్ సినిమాలు చాలాకాలంగా ఋజువుచేస్తూ వస్తూనే ఉన్నాయి. తాజాగా దీన్నే నమ్మి వచ్చిన కమర్షియల్ ఎంటర్‌టైనరే ‘హైపర్’. అసలు కథ కాస్త పాతదే అయినా దానికి తండ్రంటే విపరీతమైన ప్రేమ ఉండే హీరో క్యారెక్టరైజేషన్‌ను జతచేసి, ఎక్కడా కామెడీ తగ్గకుండా, కథలోని ఎమోషన్‌ను చివరివరకూ కొనసాగిస్తూ అల్లిన స్ర్కీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధానం. రామ్ ఎనర్జీ, రావు రమేష్, సత్య రాజ్‌ల స్థాయికి తగ్గ నటన లాంటివి సినిమాకు బలాన్నిచ్చే అంశాలు. ఇక సెకండాఫ్‌లో పాటలు అసందర్భంగా రావడం, హీరోయిన్ పాత్ర పూర్తిగా పక్కకు తప్పుకోవడం లాంటివి మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ హైపర్ కుర్రాడు తండ్రిపై తనకున్న విపరీతమైన ప్రేమను ఆ ‘హైపర్‌’తోనే చూపిస్తూ బాగానే ఆకట్టుకున్నాడు.

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు