సమీక్ష : మన్మథన్ ఫర్ సేల్ – డిస్కౌంట్ ఇచ్చినా చూడలేం!

సమీక్ష : మన్మథన్ ఫర్ సేల్ – డిస్కౌంట్ ఇచ్చినా చూడలేం!

Published on Mar 11, 2016 11:20 PM IST
Manmadha For Sale review

విడుదల తేదీ : 11 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : విజ్ఞేష్ శివన్

నిర్మాత : 4 స్టార్స్ ఫిల్మ్స్ గ్రూప్

సంగీతం : ధరణ్ కుమార్

నటీనటులు : శింబు, వరలక్ష్మి శరత్ కుమార్..


తమిళంలో హీరోగా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న శింబు, అక్కడి సినిమాలను తెలుగులోనూ డబ్ చేసిన కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తమిళంలో హీరోగా నటించగా 2012లో విడుదలైన ‘పోడా పోడీ’ అనే సినిమాను తెలుగులో ‘మన్మథన్ ఫర్ సేల్’ అన్న టైటిల్‌తో డబ్ చేసి నేడు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. తమిళంలోనే ఫ్లాప్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనైనా ఆకట్టుకునేలా ఉందా? చూద్దాం..

కథ :

అర్జున్ (శింబు) లండన్‌లో ఓ యానిమేటర్‌గా పనిచేస్తూ విలాసా జీవితం గడుపుతూంటాడు. అదే ప్రాంతంలో ఉండే నిషా (వరలక్ష్మి శరత్‌కుమార్) అనే అమ్మాయితో అర్జున్ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. నిషాకి డ్యాన్స్ అంటే పిచ్చి. లండన్‌లో జరిగే డ్యాన్స్ ఫెస్టిఫల్ పోటీల్లో ఎలాగైనా గెలవాలన్నది ఆమె కల. అర్జున్‌కి మాత్రం నిషా డ్యాన్స్ పోటీల్లో పాల్గొనడం నచ్చదు. అయితే ఇద్దరూ ఒకరి ప్రేమను ఒకరు కాదనరు.

ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్‌తో పెళ్ళి చేసుకుంటారు. ఆ పెళ్ళి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అర్జున్-నిషాల పెళ్ళి బంధం ఎలా కొనసాగింది? నిషా డ్రీమ్ ఏమైందీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక స్టీరియోటైప్ ఆలోచనలున్న అబ్బాయికి, స్వతంత్ర భావాలున్న అమ్మాయికి మధ్యన ప్రేమ, పెళ్ళి నేపథ్యంలో ఒక కథ చెప్పాలనుకున్న ప్రయత్నాన్ని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరహా జంటలో ప్రేమలో, పెళ్ళి బంధంలో సాధారణంగా తలెత్తే ఇబ్బందులను కొంతమేర బాగానే చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్‌లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ సినిమాపరంగా హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.

ప్రధాన పాత్రధారుల నటనను ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. రెండే పాత్రల చుట్టూ తిరిగే కథలో నిషా అనే పాత్రలో వరలక్ష్మి అద్భుతంగా నటించింది. స్వతంత్ర భావాలున్న ఈతరం అమ్మాయిగా వరలక్ష్మి బాగా ఆకట్టుకుంది. శింబు తనకు అలవాటైన రొమాంటిక్ పాత్రను అలవోకగా చేసేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో శింబు నటన బాగుంది. ఇక నాటితరం స్టార్ హీరోయిన్ శోభన తన చిన్న పాత్రలో బాగా చేసింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే.. ఒక సినిమా పరంగా ప్రతి ప్రేక్షకుడూ ఆశించే ఎమోషన్‌కు ఎక్కడా సరైన చోటన్నదే లేకపోవడం గురించి చెప్పుకోవచ్చు. కథాంశం బాగున్నా, దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలిచే బలమైన కథ గానీ, ఆకట్టుకునే కథనం గానీ లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఇకపోతే ఏ పాయింట్‌పైనేతే సినిమా నడుస్తుందో, సెకండాఫ్ మొదలైన 20 నిమిషాల తర్వాత అదే పాయింట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అంతా అర్థం లేని అయోమయము గందరగోళమే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే సినిమాను కనీసం ఫర్వాలేదనుకునే ఆలోచన నుంచి పూర్తిగా కిందపడేసింది.

హీరో, హీరోయిన్ల మధ్య గొడవలను, రొమాన్స్‌ను బాగానే చూపించినా, వారిద్దరూ గొడవపడే కొన్ని అంశాలు మరీ సిల్లీగా కనిపిస్తాయి. ఇక ఒకదాని తర్వాత ఒకటి ప్రతి పావుగంటకు ఒకటి చొప్పున వచ్చే పాటలు విసుగు పుట్టిస్తాయి. సెకండాఫ్ చివరకొచ్చేసరికి దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో కూడా అర్థం కాకపోవడం ఈ సినిమా విషయంలో చెప్పుకోవాల్సిన ఓ మైనస్ పాయింట్. ఇక తమిళంలో దాదాపు నాలుగేళ్ల క్రితం విడుదలైన ‘పోడా పోడీ’ (పోరా పోవే) అన్న ఈ సినిమాను తెలుగులో ‘మన్మథన్ ఫర్ సేల్’ అనే, సినిమా కథకు ఏమాత్రం సంబంధం లేని టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తేవాలన్న ఆలోచనే నిరర్ధకం.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా సినిమాటోగ్రాఫర్ డంకన్ టెల్‌ఫ్రోడ్ పనితనాన్ని అభినందించాలి. లండన్ నేపథ్యాన్ని, ఓ మోడర్న్ జంట ఆలోచనల మూడ్‌కు సరిగ్గా సరిపోయేలా సినిమాటోగ్రాఫర్ ప్రతిభ చూపారు. ధరన్ కుమార్ అందించిన పాటలు కొన్ని బాగున్నా, అవి సినిమాలో వచ్చే సందర్భాలే బాలేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆంథోని ఎడిటింగ్ కూడా ఫర్వాలేదనేలా ఉంది.

ఇక దర్శకుడు విజ్ఞేష్ శివన్, చెప్పాలనుకున్న అంశాన్నే పక్కదారి పట్టించి ఓ అర్థం లేని సినిమాగానే మిగిల్చారు. ఒక్క హీరో-హీరోయిన్ల ప్రేమ, పెళ్ళి కథలో చూపిన కొత్తదనం మినహా దర్శక, రచయితగా విజ్ఞేష్ ఎక్కడా మెప్పించలేదనే చెప్పాలి. ఇక తెలుగు డబ్బింగ్ పనులు కూడా సాదాసీదాగా ఉన్నాయి. ఒక్క హీరో, హీరోయిన్లకు చెప్పించిన డబ్బింగ్ విషయంలో తప్ప ఎక్కడా డబ్బింగ్ పనులు బాగున్నట్లు కనిపించలేదు.

తీర్పు :

డబ్బింగ్ సినిమా అయినా కూడా బాగుందన్న టాక్ వస్తే, ఎలాగోలా థియేటర్లలో నిలబడి హిట్ కొట్టిన సినిమాలను తెలుగు పరిశ్రమలో చాలానే చూసి ఉన్నాం. ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎప్పటికప్పుడు మంచివి, చెడ్డవి అన్న సంబంధం లేకుండా డబ్బింగ్ సినిమాలు తెలుగులో వస్తూనే ఉన్నాయి. తాజాగా అదే కోవలో వచ్చిన ఒక అర్థం లేని సినిమాయే ‘మన్మథన్ ఫర్ సేల్’. ఒక స్టీరియోటైప్ ఆలోచనలున్న అబ్బాయికి, స్వతంత్ర భావాలున్న అమ్మాయికి మధ్యన నడిచే కథాంశం అన్న ఆలోచన, హీరో-హీరోయిన్ల నటన లాంటి ప్లస్‌లను వదిలేస్తే మిగతావన్నీ మైనస్‌లనే నింపుకున్న ఈ సినిమా తమిళంలో విడుదలైన నాలుగేళ్ళకు ఇక్కడకు వచ్చి కూడా చేసిందేమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మన్మథన్ ఫర్ సేల్’ని డిస్కౌంట్ ఇచ్చినా కొనలేం!

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు