సమీక్ష : నువ్వెక్కడుంటే నేనక్కడుంటా – ఈ సినిమా ఎక్కడుంటే మీరు అక్కడ ఉండకండి

సమీక్ష : నువ్వెక్కడుంటే నేనక్కడుంటా – ఈ సినిమా ఎక్కడుంటే మీరు అక్కడ ఉండకండి

Published on Apr 20, 2012 4:47 PM IST
 
విడుదల తేది : 20 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 1.25/5
దర్శకుడు : శుభ సెల్వం
నిర్మాతలు : డి. కుమార్, ఎమ్. ఈశ్వర ప్రసాద్
సంగీత దర్శకుడు: ప్రదీప్ కోనేరు
తారాగణం : ఉదయ్ కిరణ్, శ్వేతా బసు ప్రసాద్

‘చిత్రం’ సినిమాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్, తన మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి శ్వేతా బసు ప్రసాద్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’. శుభ సెల్వం డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాని యు.కె అవెన్యూస్ బ్యానర్ పై డి. కుమార్ మరియు యం. ఈశ్వర ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. రెండు సంవత్సరాల క్రితం విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన ప్రతీసారి వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:
హరి (ఉదయ్ కిరణ్) కి తన మామ కూతురు నీలాంబరి (ఆర్తి) తో పెద్దలు పెళ్లి నిశ్చయిస్తారు. ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేకపోవడంతో, హరికి ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకుంటానని నీలాంబరి చెప్పడంతో, నీలాంబరి తండ్రి హైదరాబాదుకి పంపించి ఒక ఫైనాన్సు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనాధ అయిన హరిత (శ్వేతా బసు ప్రసాద్) ను హరి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. మరో వైపు వీధి రౌడి అయిన భద్ర (అమిత్ కుమార్) కూడా హరితని ప్రేమిస్తూ పెళ్లి చేసుకోమని వెంటపడి వేదిస్తుంటాడు. ఈ క్రమంలో హరిత, భద్ర నుండి తప్పించుకుంటూ హరికి దగ్గరవుతుంది. హరిత తనని ప్రేమించట్లేదంటూ భద్ర పగ పెంచుకుంటాడు. మరోవైపు హరికి కలలో వచ్చిన సంఘటనలు నిజమౌతుంటాయి. ఒకరోజు హరికి ఒక విచిత్రమైన కల వస్తుంది. ఆ కలలో భద్ర, హరితని కిడ్నాప్ చేసే క్రమంలో హరిత చనిపోయినట్లు కల కంటాడు. ఈ కల నిజమౌతుందని భయపడిన హరి ప్రియురాలు హరితని తన ఊరికి తీసుకెళ్తాడు. హరి కుటుంబ సభ్యులు హరితని అంగీకరించారా? హరికి వచ్చిన కల నిజమైందా? చివరికి భద్ర, హరితని ఏం చేసాడు? ఇవన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
హరి పాత్రలో ఉదయ్ కిరణ్ పర్వాలేదనిపించాడు. హరితగా శ్వేతా బసు ప్రసాద్ కూడా పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో ఆకట్టుకొనే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే చిత్ర రెండవ భాగంలో మొదటి 30 నిముషాలు హరితని, హరి కుటుంభ సభ్యులు పరిచయం చేసుకునే సన్నివేశాలు ఊరట కలిగిస్తాయి. తప్పిపోయిన తన చిన్న కూతురు కాదంబరి ఎవరో కాదు హరిత అంటూ ఆశిష్ విద్యార్థి చేసే సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. ప్రదీప్ కోనేరు సంగీతంలో రెండు పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:
దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బావున్నప్పటికీ దానిని తెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. హరికి వచ్చిన కలలు నిజమౌతాయి అని రెండు సన్నివేశాలు చూపించాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ కలలో హరిత చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడుకోవడం కోసం హరి చేసే ప్రయత్నాలు కూడా ఓకే. చివరికి హరి ఆమెను కాపాడే ప్రయత్నంలో చేసే పోరాటంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడు. సినిమా అంతా దాదాపు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసాడు కాని క్లైమాక్స్ సన్నివేశాల్లో మాత్రం తనలో ఉన్నది తమిళ దర్శకుడు అనుకున్నాడేమో విషాదాంతం చేసాడు. మొదటి భాగం అంతా చిరాకు తెప్పిస్తాయి. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకునేలా తీయలేకపోయాడు. వీటికితోడు కథకు ఏ మాత్రం సంభందం లేకుండా పరమ రోత పుట్టించే సెపరేట్ కామెడీ ట్రాక్. ఎవీఎస్ మరియు జ్యోతి మధ్య సన్నివేశాలు బి గ్రేడ్ సినిమాని తలపిస్తాయి. బ్రహ్మానందం, వేణుమాధవ్, జయప్రకాష్ రెడ్డిల సెపరేట్ కామెడీ ట్రాక్ నవ్వించకపోగా కామెడీతో భయపెట్ట వచ్చు అని నిరూపించారు దర్శకుడు. భద్ర పాత్రలో అమిత్ కుమార్ ఆకట్టులేకపోయాడు. మిగతావారిలో సగానికి పైగా తమిళ నటులు ఉండటం, వారి ప్రదర్శన కూడా ఏ మాత్రం రుచించలేదు.

సాంకేతిక విభాగం:
జనార్ధ మహర్షితో పాటుగా మరో ఇద్దరు రచయితలు కలిసి రాసిన సంభాషణలు సాధారణంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదు. జీవన్ థామస్ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగాలేదు. ఎడిటింగ్ గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం.

తీర్పు:

ఎన్నో వాయిదాలు పడి విడుదలైన ఈ సినిమా థియేటర్ వరకు వెళ్లి చూసేంత అవసరం లేదు. తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందించటంతో ఎవరినీ మెప్పించలేక బోల్తా పడింది. ఈ సినిమా నడుస్తున్న థియేటర్ కి కొంచెం దూరంలో ఉంటే మంచిది.

123తెలుగు.కాం రేటింగ్: 1.25/5

అశోక్ రెడ్డి

Clicke Here For ‘Nuvvekkada Unte Nenakkada Unta’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు