సమీక్ష : ఊ కొడతారా ఉలిక్కిపడతారా – అబ్బురపరిచిన బాలకృష్ణ, లక్ష్మిల నటన

సమీక్ష : ఊ కొడతారా ఉలిక్కిపడతారా – అబ్బురపరిచిన బాలకృష్ణ, లక్ష్మిల నటన

Published on Jul 28, 2012 9:06 AM IST
విడుదల తేది : 27 జూలై 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : శేఖర్ రాజ
నిర్మాత : లక్ష్మి ప్రసన్న మంచు
సంగీత దర్శకుడు: బోబో శశి
తారాగణం : మనోజ్ మంచు, బాలకృష్ణ, లక్ష్మి ప్రసన్న

నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, మంచు లక్ష్మి ప్రసన్న, దీక్షా సేథ్ ముఖ్య పాత్రల్లో శేఖర్ రాజా అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ వచ్చిన సినిమా ‘ఊ కొడతారా? ఉలిక్కిపడతారా? మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంచు లక్ష్మి ప్రసన్న నిర్మించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల తీర్పును కోరుతూ వచ్చింది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఊ కొట్టారా? ఉలిక్కి పడ్డారా? ఇప్పుడు చూద్దాం.

కథ :
ఈ సినిమా కథ మొత్తం గంధర్వ మహల్ చుట్టూ తిరుగుతుంది. ఆ గంధర్వ మహల్ వారసుడు అయిన రాయుడు (ప్రభు) ఆ ఇంట్లో ఉండకుండా వేరే వారికి అద్దెకి ఇస్తాడు. 15 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంటూ కొంత మంది అద్దె కట్టకుండా రాయుడిని బెదిరిస్తుంటారు. సిటీ నుండి వచ్చిన మనోజ్ ఆ మహల్లో అద్దెకి దిగి, అద్దె కట్టకుండా ఉంటున్న వారిని తరిమేస్తాడు. రాయుడు పెద్ద కూతురు (మధుమిత)ని చూడటానికి వచ్చిన పెళ్లి వారు కట్నం కింద గంధర్వ మహల్ ని రాసివ్వమంటారు. రాయుడు అయిష్టంగానే అంగీకరిస్తాడు. ఆ ఇంటికి వచ్చిన పెళ్లి వారిని ఆ ఇంట్లో ఒక ఆత్మ వెంటాడుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఎవరిదో కాదు రాయుడు తండ్రి అయిన నరసింహ నాయుడు (బాలకృష్ణ)ది అని తెలుస్తుంది. నరసింహ నాయుడు ఆత్మ గంధర్వ మహల్లో ఎందుకు తిరుగుతుంది? గంధర్వ మహల్ వారసుడు అయిన ప్రభు ఆ ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు ఉంటున్నాడు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మొదటగా చెప్పోకోవాల్సింది బాలకృష్ణ గురించి. అగ్ర హీరోగా ఉన్న అయన ఈ పాత్ర చేయడానికి అంగీకరించడం మెచ్చుకోదగిన విషయం. నరసింహ రాయుడు పాత్రలో ఆయన ఈ సినిమాకి ప్రాణం పోసారు. సినిమాలో ఆయన పాత్ర ఉన్నంతవరకు సినిమాని నిలబెట్టారు. ఆయన గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ఆకట్టుకున్నాయి. మంచు లక్ష్మి ప్రసన్న చివర్లో చేసిన పెర్ఫార్మెన్స్ సినిమాకి మరో హైలెట్. మనోజ్ పర్వాలేదనిపించాడు. ఫణీంద్ర భూపతిగా సోనూసూద్ చేసిన పాత్రలో అరుంధతి సినిమాలోని పశుపతి పాత్ర తాలూకు షేడ్స్ కనిపిస్తాయి. సినిమా మొదటి భాగంలో ఇంటర్వెల్ ముందు బాలయ్య ఎపిసోడ్ నుండి అలరించి, రెండవ భాగంలో చివరి అర్ధ గంట సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలిచాయి. సాయి కుమార్ చిన్న పాత్రే అయిన బాగానే చేసాడు. చివర్లో అజయ్ మాంత్రికుడుగా కనిపించాడు. రాయుడు పాత్రలో ప్రభు, శేషయ్యగా భానుచందర్ కూడా పర్వాలేదనిపించారు. సుహాసిని, గొల్లపూడి, మారుతీ రావు, ప్రభ, రాజా రవీంద్ర, రిషి ఇలా అందరు పాత్ర పరిధిమేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘు బాబు, అభినయశ్రిలతో చేసిన కామెడీ ఆకట్టుకోలేకపోయింది. దాదాపు సినిమా మొదటి భాగం అంత కథ ముందుకి సాగకపోవడంతో సహనాన్ని పరీక్షిస్తుంది. బోబో శశి సంగీతంలో వచ్చిన అబ్బబ్బ అబ్బబ్బ, ప్రతి క్షణం నరకమే పాటల చిత్రీకరణ కూడా అస్సలు ఆకట్టుకోలేదు. ఈ సినిమా టైటిల్ కి సినిమాకి పొంతన కుదరక పోవడం గమనార్హం. మనోజ్, దీక్షా సేథ్ మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా సరిగా పండలేదు.

సాంకేతిక విభాగం :
మొదటగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ గురించి. 6 కోట్లు వెచ్చించి నిర్మించిన గంధర్వ మహల్ సెట్ చాలా బావుంది. సినిమా అంతా దాదాపు గంధర్వ మహల్లోనే తీసారు. గతంలో సింహా సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన చిన్న ఈ సినిమాకి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. సినిమా మొదటి భాగంలో కొత్త వరకు ఎడిట్ చేస్తే బావుండేది. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హెల్ప్ అయింది.

తీర్పు:
ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమా ఫస్టాఫ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సెకండాఫ్ మాత్రం అలరించింది. ముఖ్యంగా బాలకృష్ణ నటన మరియు క్లైమాక్స్ లో మంచు లక్ష్మి ప్రసన్న పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మంచి రేంజ్ కి వెళ్ళేది.

123telugu.com Rating : 3/5

Reviewed by Ashok Reddy

Click Here For ‘UKUP’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు