సమీక్ష : రైట్ రైట్ – సాదాసీదా బస్ జర్నీ!

సమీక్ష : రైట్ రైట్ – సాదాసీదా బస్ జర్నీ!

Published on Jun 11, 2016 2:37 PM IST
Right Right review

విడుదల తేదీ : 10 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : మను

నిర్మాత : జె. వంశీకృష్ణ

సంగీతం : జె.బి.

నటీనటులు : సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి, పావని గంగిరెడ్డి..

‘అంతకుముందు ఆ తరువాత’, ‘లవర్స్’, ‘కేరింత’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న హీరో సుమంత్ అశ్విన్, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించగా, కాళకేయ ప్రభాకర్ మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రైట్ రైట్’. మను దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళయాలంలో మంచి విజయం సాధించిన ‘ఆర్డినరీ’ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘రైట్ రైట్’, ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

రవి (సుమంత్ అశ్విన్) ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన యువకుడు. కుటుంబ బాధ్యతలన్నీ తనే మోయాల్సిన పరిస్థితుల్లో, రవి, పెద్దగా ఇష్టం లేకున్నా ఆర్టీసీలో బస్ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరతాడు. ఎస్. కోట నుంచి గవిటి అనే ఓ చిన్న ఊరికి వెళ్ళే ఒకే ఒక్క బస్సుకి రవి, డ్రైవర్ శేషు (ప్రభాకర్) విధులు నిర్వహిస్తుంటారు. గవిటి ఊర్లో వీరిద్దరికీ అందరి దగ్గర్నుంచీ మంచి ఆదరణ ఉంటుంది. రవి ఆ ఊరి వాళ్ళతో, శేషుతో బాగా కలిసిపోతాడు. అంతా బాగున్న ఈ క్రమంలోనే రవి, శేషుల వల్ల ఓ ప్రమాదం జరుగుతుంది.

ఆ ప్రమాదంతో వారి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. రవి, శేషుల వల్ల జరిగిన ప్రమాదం ఏంటీ? తను ప్రేమించిన అమ్మాయి కళ్యాణి (పూజా జవేరి) రవికి దక్కుతుందా? ఒక్కసారే వచ్చిపడ్డ ఈ కష్టాలను రవి ఎలా ఎదుర్కున్నాడూ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

‘రైట్ రైట్’కు మేజర్ ప్లస్ పాయింట్ అంటే.. సినిమాలో వచ్చే ప్రధాన పాత్రలన్నింటికీ కథతో ఏదో ఒక విధంగా ఓ కనెక్షన్ ఉండడం, ఈ పాత్రలన్నీ కథా గమనానికి బాగా ఉపయోగపడడం గురించే చెప్పుకోవాలి. సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పావని, నాజర్, భద్ర.. ఇలా ప్రధాన పాత్రలన్నింటికీ ఓ కథ ఉండటంతో పాటు అవన్నీ అసలు కథకు కనెక్ట్ అయి ఉన్న విధానం కూడా చాలా బాగుంది. ఇక సుమంత్-ప్రభాకర్‌ల మధ్యన వచ్చే సన్నివేశాలు సరదాగా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవాలి. సినిమా అసలు కథలోకి వెళ్ళే నేపథ్యం నుంచి వచ్చే ఈ ట్విస్ట్, మేకింగ్ పరంగానూ బాగుంది.

ఇక సుమంత్ అశ్విన్ తనకు అలవాటైన పాత్రే చేసినా, ఆ పాత్రలో చాలా బాగా నటించాడు. పాత్ర పరిధులు దాటకుండా సుమంత్ తన శక్తిమేర బాగా చేశాడు. ఇక ప్రభాకర్ తన కెరీర్లో ఇలాంటి పాత్రల్లో చాలా తక్కువగా కనిపించాడు. పూర్తిగా నెగటివ్ పాత్రలనే చేయగలడన్న పేరేదైనా ప్రభాకర్‌పై ఉంటే ఈ సినిమాతో దాన్ని పోగొట్టేలా చేశాడు. తన పాత్రతో అందరూ కనెక్ట్ అయ్యేలా ప్రభాకర్ బాగా నటించాడు. ఇక నాజర్ ఎప్పట్లానే తన స్థాయికి తగ్గ నటనతో మెప్పించారు. పావని గంగిరెడ్డి తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక హీరోయిన్‌గా పూజా జవేరికి చెప్పుకోదగ్గ సన్నివేశాలేవీ లేకపోయినా, ఉన్నంతలో బాగా చేసింది. భద్ర అనే పాత్రలో నటించిన వినోద్ కిషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోదగ్గ రీతిలో నటించాడు.

సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌ని ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అసలు కథతో పాటు, ట్విస్ట్‌లన్నీ ఈ భాగంలోనే ఉండడంతో సెకండాఫ్ క్లైమాక్స్‌కు ముందు వరకూ బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే, అసలు కథతో పాటు చుట్టూ ఉండే పరిస్థితులు, ఆలోచనలు.. అన్నీ 80,90వ దశకంలో వచ్చిన సినిమాలను తలపించడం గురించే చెప్పుకోవాలి. కథేమో నేటితరంలో నడుస్తూ, చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆలోచనలేమో పాతతరంలా కనిపిస్తూ రెండింటికీ కనెక్షన్ కుదరక సినిమా అసహజంగా కనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మొదలయ్యే వరకూ అసలు కథలోకి తీసుకెళ్ళకుండా, అప్పటివరకూ కట్టిపడేసే సన్నివేశాలేవీ పెట్టకుండా ఫస్టాఫ్ మొత్తం కాలక్షేపంలా గడిపేయ్యడం ఆకట్టుకోలేదు.

అదేవిధంగా సెకండాఫ్‌లో ట్విస్ట్‌లతో ఆకట్టుకున్నా, క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి సినిమా పూర్తిగా మెలోడ్రామాగా మారిపోయింది. ఈ సన్నివేశాల్లో భావోద్వేగం కనెక్ట్ అవ్వకపోగా, కాస్త అతిగా కూడా కనిపించింది. ఇక ఒక మిస్టరీ చుట్టూ తిరిగే సెకండాఫ్‍లో ఆ మిస్టరీ వెనుక ఉన్న కారణం కూడా మరీ బలమైనది కాకపోవడం కూడా మైనస్సే!

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ‘రైట్ రైట్’ ఓ చిన్న సినిమా అన్న ఆలోచన తెప్పించదు. ముఖ్యంగా శేఖర్ వి జోసఫ్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే! సినిమా మూడ్‌ను ఎక్కడా దారితప్పించకుండా, లొకేషన్స్‌ని సరిగ్గా వాడుకుంటూ ఓ మంచి ఫీల్ తెచ్చారు. ఇంటర్వెల్ బ్లాక్‌ని శేఖర్ పనితనానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక జేబీ అందించిన మ్యూజిక్ ఫర్వాలేదు. సందర్భానుసారంగా వచ్చే పాటలన్నీ విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు బాగున్నాయి. ఉద్ధవ్ ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మను పూర్తి స్థాయిలో ప్రతిభ చూపడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. మళయాలంలో ఆకట్టుకున్న కథను, ఇక్కడి నేపథ్యానికి తగ్గట్టుగా బాగానే మార్చుకున్నా, ఆ కథను పాతతరం పరిస్థితులు, ఆలోచనల చుట్టూ చెప్పడమే మను చేసిన తప్పుగా కనిపిస్తుంది. దర్శకుడిగా మాత్రం కొన్నిచోట్ల మను మంచి ప్రతిభే చూపాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్ట్ బయటపడే విధానం.. ఇలాంటి సన్నివేశాల్లో మను మేకింగ్ పరంగా ఫర్వాలేదనిపించాడు.

తీర్పు :

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న హీరోలు, సినిమాలు, వాటి బాక్సాఫీస్ పరిస్థితులు.. ఇవన్నీ చూసినతర్వాత కొత్తగా ఒక హీరో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఏదోకటి ప్రయత్నిస్తూనే ఉండాలి. హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న సుమంత్ అశ్విన్ కూడా ఈ క్రమంలోనే తనకున్న ఇమేజ్‌ను పక్కనబెట్టి ఓ సాదాసీదా పాత్రలో కనిపిస్తూ, ‘రైట్ రైట్’ అనే సినిమాతో మనముందుకు వచ్చాడు. ‘రైట్ రైట్’ అసలు కథ ఎప్పుడు చెప్పినా బాగుండేదే! అయితే ఆ కథను చెప్పిన విధానంలోనే ఈ సినిమా తడబడింది. సుమంత్ అశ్విన్, ప్రభాకర్, నాజర్, పావని తదితరుల పాత్రలూ, ఆ పాత్రల్లో వారి నటన, మేకింగ్ పరంగా ఆకట్టుకునే ఇంటర్వెల్, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇకపోతే పైనే చెప్పినట్టు, కథ పాతతరం ఆలోచనల చుట్టూ తిరగడం, అతిగా కనిపించే క్లైమాక్స్, ఫస్టాఫ్‌లో పెద్దగా కట్టిపడేసే స్థాయి సన్నివేశాలేవీ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. మెలోడ్రామా ఎక్కువై ‘రైట్ రైట్’ కాస్త పక్కదారి పట్టింది!!

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు