సమీక్ష : ది ఐస్ – ఫర్వాలేదనిపించే సైంటిఫిక్ థ్రిల్లర్..!

సమీక్ష : ది ఐస్ – ఫర్వాలేదనిపించే సైంటిఫిక్ థ్రిల్లర్..!

Published on Oct 10, 2015 10:00 PM IST
The eyes review

విడుదల తేదీ : 9 అక్టోబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : షాజియం

నిర్మాత : డి. వెంకటేష్

సంగీతం : రమేష్ నారాయణ్

నటీనటులు : మీరా జాస్మిన్..

మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించగా షాజియం దర్శకత్వంలో రూపొందిన మళయాల సినిమా ‘లేఖా థరూర్ కానున్నతు’. ఓ హర్రర్ థ్రిల్లర్ జానర్లో సరికొత్త కథతో రూపొందిన ఈ సినిమాను ‘ది ఐస్’ పేరుతో నిర్మాత డి. వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీన విడుదల కానుంది. ఇక విడుదలకు వారం ముందే ప్రేక్షకులకు సినిమాను పరిచయం చేసే ఆలోచనలో నిర్మాత ఓ స్పెషల్ ప్రెస్ షో ఏర్పాటు చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఓ ప్రముఖ టీవీ చానల్‌లో ఇంటిలిజెన్స్ గేమ్ షోకు హోస్ట్ గా పనిచేసే చంద్రలేఖ (మీరా జాస్మీన్) అనే యువతి జీవితంలో తలెత్తే కొన్ని విచిత్ర పరిస్థితుల సమాహారమే ‘ది ఐస్’ సినిమా. తన చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో కళ్ళు కోల్పోయిన లేఖ, కళ్ళు లేకున్నా ఇంటిలిజెన్స్ విషయంలో ఎప్పుడూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఉంటుంది. ఇక ఓ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కళ్ళను లేఖకు అమర్చడంతో అసలు కథ మొదలవుతుంది. చాలాకాలం తర్వాత కళ్ళతో ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టిన లేఖకు మొదట అంతా అయోమయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే లేఖ ఓ సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొందుతూ ఉంటుంది.

ఈ సమయంలోనే లేఖకు చనిపోయిన వ్యక్తులు, కొద్దిసేపట్లో చనిపోయే వ్యక్తుల ఆత్మలు కనిపిస్తూ ఆమెను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర పరిస్థితులతో మనశ్శాంతి కోల్పోయిన లేఖ, తనకు కళ్ళను దానం చేసిన వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయాణంలో లేఖ తెలుసుకున్న ఆసక్తికర అంశాలేంటీ? లేఖకు ఈ ఆత్మలు కనపడడంతో పాటు, ముందే జరగబోయే భయంకర విషయాలు ఎలా తెలుస్తుంటాయి? ఆ తర్వాత ఏమైంది? అన్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఓ సరికొత్త కథాంశాన్ని వీలైనంత స్పష్టంగా, సూటిగా, ఆసక్తికరంగా నడిపించిన విధానం గురించి చెప్పుకోవాలి. హర్రర్ సినిమా అనగానే ఎక్కువగా ఒకే ఒక్క నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఈ హర్రర్ సినిమా కోసం ఓ సరికొత్త కథను ఎంచుకొని దర్శకుడు కొత్తదనాన్ని చూపించాడు. చనిపోయిన వ్యక్తి శరీరంలోని ఏ అవయవాన్నైనా ఇతరులకు అమర్చినపుడు ధాతకు సంబంధించిన లక్షణాలు స్వీకరించిన వ్యక్తిలో కనిపించవు. కానీ చాలా చాలా రేర్ కేసుల్లో కనిపిచ్న్హే అవకాశం ఉంది. ఆ చిన్న సైంటిఫిక్ అంశాన్ని పట్టుకొని అర్థవంతంగా ఓ కథను అల్లుకోవడం పెద్ద సాహసమే! ఈ విషయంలో ఈ సినిమా చాలావరకు విజయం సాధించిందనే చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మీరా జాస్మిన్ సినిమాకు మేజర్ అస్సెట్. కొత్తగా వచ్చిన కళ్ళతో ప్రపంచాన్ని చూడడంలో ఎదురయ్యే ఇబ్బందుల దగ్గర్నుంచి, పాత్ర ప్రయాణంలో వచ్చే మార్పులను తన నటనతో చాలా బాగా పండించింది. ఇక మీరా జాస్మిన్ కాకుండా సినిమాలో తక్కువ పాత్రలే ఉన్నా అందరూ తమ పరిధిమేర బాగానే నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం లేఖకు చూపు రావడం, ఆ చూపు వల్ల తనకు విచిత్ర పరిస్థితులు ఎదురవ్వడం లాంటి అంశాలతో ఆసక్తికరంగా నడుస్తూ కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం జరిగింది. ఇక ఇంటర్వెల్‌‌ బ్యాంగ్‌ను ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో లేఖ తనకు ఎదురవుతున్న ఇబ్బందుల వెనుక రహస్యాన్ని చేధించే అంశంపై సినిమా సాగుతూ క్లైమాక్స్ వరకూ థ్రిల్లింగ్‌గా నడుస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే స్లో నెరేషన్ అని చెప్పుకోవచ్చు. ఒకే ఎమోషన్‌ను చాలాసార్లు చూపిస్తూ స్లో నెరేషన్‌తో కథ చెప్పడం అక్కడక్కడా సినిమా బోరింగ్‌గా తయారవుతుంది. ముఖ్యంగా మొదటి ఇరవై నిమిషాలు సినిమాలో ఏ ఆసక్తికర అంశమూ లేకుండా సాదాసీదాగా నడుస్తూంటుంది. లేఖకు కళ్ళు వచ్చేవరకూ సినిమా డల్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పార్ట్ ను నెరేషన్‌లో కొంత సమయం తర్వాత స్టార్ట్ చేసి ముందు ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ పెడితే బాగుండేది. ఇక ఫస్టాఫ్ మొత్తం ఒకే ఒక్క మేజర్ అంశం చుట్టూ నడుస్తూ ఉండడంతో వచ్చిన సన్నివేశాలే మళ్ళీ మళ్ళీ వచ్చాయనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక సినిమాకు ప్రధానమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను అసలు కథకు కనెక్ట్ చేయడం బాగున్నా, ఈ ఎపిసోడ్‌లో కొన్ని సన్నివేశాలను కేవలం వాయిస్ ఓవర్‌తోనే చెప్పించడంతో కొంత క్లారిటీ తగ్గింది. ఇక సినిమాను లేఖ అనే పాత్రని ఎమోషనల్ వేలోనే చూపడంతో హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తక్కువ సన్నివేశాల్లోనే కనిపిస్తాయి. కావున హర్రర్ ఎలిమెంట్స్‌ ను మాత్రమే కోరేవారిని ఈ సినిమా నిరుత్సాహపరుస్తుంది. ఇక కొన్ని సైంటిఫిక్ అంశాల్లో డీటైలింగ్ కొరవడింది. గ్రాఫిక్స్ అంత ఆకట్టుకునేలా లేవు. ఇక భయపెట్టడానికే అన్నట్లుగా రూపొందించిన సన్నివేశాలు కొన్ని రిపీటెడ్‌గా వచ్చి డిస్టర్బ్ చేస్తాయి. ఇక హర్రర్ సినిమా ఫార్మాట్‌లో కనిపించే కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో కనిపించవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందు దర్శకుడు షాజియం గురించి చెప్పుకోవాలి. ఇలాంటి ఒక కథను సినిమాగా రూపొందించే ప్రయత్నంలో దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఒక హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్న కథను ఇక్కడి నేటివిటీకి తగ్గ సినిమాగా సరిగ్గా రూపొందించాడు. స్ట్రైట్ నెరేషన్‌లో సినిమాను నడపడమనే విషయం పక్కనపెడితే స్క్రీన్‌ప్లే పరంగా కూడా దర్శక, రచయిత మంచి మార్కులే కొట్టేస్తాడు. ఇక లేఖ అనే పాత్ర జర్నీని థ్రిల్లర్ అంశాలకు ముడిపెడుతూనే, ఎమోషనల్‌గా చెప్పిన విధానంలో దర్శకుడి ప్రతిభ సినిమాకు బాగా హెల్ప్ అయింది. అయితే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌పై దర్శకుడు మరింత డీటైలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది.

ఇక చంద్రమౌళి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో షాట్ కంపోజిషన్ బాగా ఆకట్టుకుంటుంది. కనిష్క్, రమేష్ నారాయణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల సినిమా మూడ్‌ను సరిగ్గా క్యాప్చర్ చేయడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. సినిమాలో ఒకే ఒక్క పాట ఉండగా వినడానికి ఆ పాట బాగుంది. ఎడిటర్ పనితనం ఫర్వాలేదనేలా ఉంది. కొన్నిచోట్ల వేగం పెంచి, రిపీటెడ్ సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ బాగుంది. వెన్నెలకంటి రాసిన మాటలు సరిగ్గా కుదిరాయి. ఇక ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న తెలుగు నిర్మాత డి. వెంకటేష్ ఆలోచనను కూడా మెచ్చుకోవాల్సిందే.

తీర్పు :

సినిమా అంటే కేవలం ఒకే ఒక్క సక్సెఫుల్ ఫార్ములా అయిపోయిన పరిస్థితుల కారణంగా హర్రర్, థ్రిల్లర్ లాంటి కొన్ని జానర్స్ కూడా ఫార్ములా బాట పట్టడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో ఓ సరికొత్త కథాంశంతో హర్రర్, థ్రిల్లర్ అంశాలను మేళవించుకొని మనముందుకు వచ్చిన సినిమాయే ‘ది ఐస్’. చెప్పాలనుకున్న కథను సూటిగా, స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయడం, కథానాయిక జర్నీని చక్కటి భావోద్వేగపూరిత సన్నివేశాలతో నడిపించడం, ఓ సరికొత్త ప్రయత్నం చేయాలన్న ఆలోచనను శక్తిమేర ఓ మంచి సినిమాగా రూపొందించడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. ఇక స్లో నెరేషన్, వచ్చిన సన్నివేశాలే మళ్ళీ వచ్చినట్లు కనిపించడం, కొన్నిచోట్ల డీటైలింగ్ లేకపోవడం లాంటివి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్‌ గా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హర్రర్, థ్రిల్లర్ అంశాలను అక్కడక్కడా నింపుకొని పూర్తిగా ఓ ఎమోషనల్ జర్నీని సరికొత్త కథతో చెప్పిన ప్రయత్నమే ‘ది ఐస్’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు