సమీక్ష : వేర్ ఈజ్ విద్యాబాలన్ – టైంపాస్ ఎంటర్టైనర్

సమీక్ష : వేర్ ఈజ్ విద్యాబాలన్ – టైంపాస్ ఎంటర్టైనర్

Published on Jun 28, 2015 7:00 AM IST
Where-is-Vidya-Balan

విడుదల తేదీ : 26 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం :  శ్రీనివాస్ రాఘ

నిర్మాత : వేణుగోపాల్ రెడ్డి – లక్ష్మీనరసింహా రెడ్డి – ఆలూరి చిరంజీవి

సంగీతం : కమ్రాన్

నటీనటులు : ప్రిన్స్, జ్యోతీ సేతీ..

‘కథ’, ‘ఒక్కడినే’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రాఘ చేసిన కామెడీ థ్రిల్లర్ ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. బస్ స్టాప్, రొమాన్స్ ఫేం ప్రిన్స్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా జ్యోతి సేథ్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. వేణుగోపాల్ రెడ్డి – లక్ష్మీనరసింహా రెడ్డి – ఆలూరి చిరంజీవి కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రెండు సినిమాలతో సస్పెన్స్ తో థ్రిల్ చేసిన శ్రీనివాస్ రాఘ ఈ సారి సస్పెన్స్ తో పాటు కామెడీని కూడా మిక్స్ చేసి కమర్షియల్ గా తీసిన ఈ వేర్ ఈజ్ విద్యాబాలన్ ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

మన హీరో కిరణ్(ప్రిన్స్) తనకి నచ్చినట్టు బతకాలని ఇంటి నుంచి బయటకి వచ్చేసి ఒక పిజ్జా కార్నర్ లో పని చేస్తుంటాడు. కట్ చేస్తే సూర్య ఫౌండేషన్ లో పనిచేస్తున్న డాక్టర్ స్వాతి(జ్యోతి సేతీ)ని చూసి ప్రేమలో పడతాడు. తన వెంటపడడం ఇష్టం లేని స్వాతి ఆ విషయం తవ బావ వాల్తేరు వాసు(మధునందన్)కి చెబుతుంది. వాల్తేరు వాసు చేసిన ఓ ఇన్సిడెంట్ వల్ల కిరణ్ – స్వాతిల మధ్య దూరం పెరుగుతుంది. ఈ ట్రాక్ ని పక్కన పెడితే అదే టైంలో మినిస్టర్ పులి నాయుడు(జయప్రకాశ్ రెడ్డి) ట్రాక్ ఒకటి జరుగుతుంటుంది. సూర్య ఫౌండేషన్ లో పనిచేసే ఓ డాక్టర్ పులి నాయుడుకి ఓ వీడియో పంపి బ్లాక్ మెయిల్ చేసి 10 కోట్లు ఇమ్మని అడుగుతాడు. డబ్బు తీసుకొని వీడియో ఇచ్చేద్దాం అని వచ్చిన డాక్టర్ ని ఎవరో మూడో వ్యక్తి చంపడానికి ట్రై చేస్తాడు. ఆ చేజ్ లో డాక్టర్ చనిపోతాడు, అలాగే డాక్టర్ చేత ఉండాల్సిన ఫోన్ మిస్ అవుతుంది.

అదే టైంలో అక్కడ ఉన్న కిరణ్ – వాల్తేరు వాసులు ఆ మర్డర్ లో ఇరుక్కుంటారు. ఆ మర్డర్ ని మరియు ఆ వీడియో ఉన్న ఫోన్ ని చేధించడానికి సిఐ నీలకంఠ(ఆశిష్ విద్యార్థి) రంగంలోకి దిగుతాడు. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది. అసలు మినిస్టర్ పులి నాయుడుని బయపెట్టే విషయం ఏముందా వీడియోలో.? కిరణ్ – వాల్తేరు వాసులు తాము నిర్దోషులు అని ఋజువు చేసుకోవడానికి ఏం చేసారు.? అసలు ఈ విద్యా బాలన్ ఎవరు.? డాక్టర్ నుంచి మిస్ అయిన ఫోన్ ఎవరి చేతికి వెళ్ళింది.? అనే విషయాలను మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ సినిమాకి మొట్టమొదటి ప్లస్ పాయింట్ ఈ సినిమా స్టొరీ లైన్. శ్రీనివాస్ రాఘ ప్రస్తుతం సొసైటీలో హైటెక్ పేరుతో జరుగుతున్న మోసాన్ని బాగా చూపించాడు. శ్రీనివాస్ చెప్పిన పాయింట్ అందరినీ థ్రిల్ చేయడమే కాకుండా, రియల్ గా సొసైటీలో మోసాల గురించి ప్రజలకి తెలియాల్సిన ఓ మంచి పాయింట్ ని కూడా చెప్పాడు. శ్రీనివాస్ రాఘ ఈ సారి సస్పెన్స్ కి కామెడీని జత చేసి ఆడియన్స్ ని బాగానే నవ్వించాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. హీరో ప్రిన్స్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సినిమాలో చూడటానికి పక్కింటి అబ్బాయిలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా పరిచయం అయిన జ్యోతి సేతీ ఇచ్చిన పాత్రలో ఓకే అనిపించింది. పాటల్లో గ్లామరస్ గా కనిపించింది. ఇకపోతే ఈ సినిమాకి హైలైట్ అయిన వారి విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ లో జయప్రకాశ్ రెడ్డి రాయలసీమ స్లాంగ్ కామెడీ బాగా నవ్విస్తుంది. అలాగే అతనికి తోడుగా డాన్ ఘంటాగా సంపూర్నేష్ బాబు ఆడియన్స్ ని బాగా నవ్విస్తాడు. ఇప్పటి వరకూ సంపూ చేసిన ఓవర్ బిల్డప్స్ తో కాకుండా జెన్యూన్ యాక్టింగ్ తో ఈ సారి నవ్విస్తాడు. ముఖ్యంగా రే చీకటి ఎపిసోడ్స్ లో బాగా నవ్వించాడు. ఇక సెకండాఫ్ లో ఒక 10 నిమిషాలు వచ్చే సప్తగిరి ఎపిసోడ్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగే తాగుబోతు రమేష్ ఉన్న రెండు మూడు సీన్స్ లో బాగానే నవ్వించాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఆశిష్ విద్యార్థి, డాక్టర్ గా రావు రమేష్ లు మంచి నటనని కనబరిచారు. ఎప్పటిలానే మధు తన మార్క్ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ బ్యాచ్ కూడా బాగానే నవ్వించారు.

ఇక సినిమాలో ఆడియన్స్ ని ఆకట్టుకునే పాయింట్స్ గురించి చెప్పాలి అంటే సినిమా స్టార్టింగ్ ఓ ఫన్నీ చేజ్ తో మొదలవ్వడం బాగుంది. ఇంటర్వల్ ముందు 30 నిమిషాల నుంచి సినిమాలో సస్పెన్స్ తో పాటు, కామెడీ కూడా బాగుంది. ఇంటర్వల్ బ్లాక్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండాఫ్ లో సప్తగిరి ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే రెండు ట్విస్ట్ లు సినిమాకి మేజర్ హైలైట్స్ అని చెప్పాలి. సినిమాలో మధ్య మధ్యలో వచ్చే కొన్ని కామెడీ పంచ్ లు బాగా పేలాయి.

మైనస్ పాయింట్స్ :

మొదటి రెండు సినిమాలను సస్పెన్స్ థ్రిల్లర్స్ గా చేసిన శ్రీనివాస్ రాఘ ఈ సినిమాలో కమర్షియాలిటీ కోసం కథలో కామెడీని చేర్చాడు. ఆ కామెడీ పార్ట్ బాగుంది. కానీ ఆ కామెడీ కోసం చుట్టుపక్కల అల్లుకున్న కొన్ని సీన్స్ అంత బాలేవు. అలాగే ఓ మంచి స్ట్రాంగ్ పాయింట్ ని తీసుకున్న శ్రీనివాస్ కథనం విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. కమర్షియాలిటీ కోసం పాటలు, కొన్ని లవ్ సీన్స్ లాంటివి ఇందులో జత చేసారు. కానీ సినిమాకి అవి అవసరం లేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే రొమాంటిక్ సాంగ్ అస్సలు అవసరం లేదు కానీ మాస్ ఆడియన్స్ కోసం పెట్టారు. అలాగే ఐటెం సాంగ్ కూడా మాస్ ఆడియన్స్ కోసం పెట్టిందే..

సినిమాని ఓ కామెడీ చేజ్ తో మొదలు పెట్టిన తర్వాత వచ్చే లవ్ ట్రాక్ సినిమాని కాస్త స్లో చేస్తుంది. ఈ లవ్ ట్రాక్ చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. ఆసక్తికరమైన ఇంటర్వల్ తర్వాత సినిమా మొదటి 20 నిమిషాలు చాలా నిధానంగా సాగుతుంది. ఇలా స్లోగా సాగే ఈ రెండు బ్లాక్స్ సినిమాకి మేజర్ మైనస్. అలాగే సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో రెండు చేజింగ్ సీక్వెన్స్ లు పెట్టారు. వాటిని ఇంకాస్త షార్ట్ గా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సస్పెన్స్ ని పూర్తిగా ఎలివేట్ చెయ్యాల్సిన టైంలో కూడా డైరెక్టర్ కామెడీవైపే మొగ్గు చూపడం కాస్ట్ ఇబ్బందికర విషయం..

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోవాల్సిన వారు కొంతమంది ఉన్నారు.. వారిలో ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ గురించి చెప్పుకోవాలి.. తను అందించిన పాటలు అంతగా కనెక్ట్ కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి హెల్ప్ అయ్యింది. చిట్టిబాబు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఈ సినిమా విజువల్స్ బాగా రిచ్ గా ఉన్నాయి. ఇక ఎడిటర్ మధు చాలా వరకూ షార్ట్ చెయ్యడానికి ట్రై చేసాడు. కానీ కమర్షియాలిటీ కోసం కొన్ని కొన్ని చోట్ల ఎడిట్ చేయలేకపోయాడు. అలాంటివి చూడకుండా కొన్ని చోట్ల ఎడిట్ చేసి ఇంకో 10నిమిషాల రన్ టైం తగ్గించి ఉంటే బాగుండేది. డైలాగ్స్ బాగున్నాయి. కామెడీ డైలాగ్స్ బాగా రాసారు.

ఇక ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వ విభాగాలను డీల్ చేసింది శ్రీనివాస్ రాఘ. కథ – ఈ సినిమాకోసం ఎంచుకున్న పాయింట్, ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ బాగుంది. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. కథనం – ఇక్కడే కాస్త తప్పు చేసాడు. ఇంకాస్త ఆసక్తికరమైన కథనం ఉండాల్సింది. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తే కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అనిపించి బోర్ కొట్టిస్తాయి. ఒక దర్శకుడిగా అందరి నుంచి మంచి నటనని రాబట్టుకోవడమే కాకుండా ఓ మంచి పాయింట్ తో ఈ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగల ఓ సినిమా ఇచ్చాడు. వేణుగోపాల్ రెడ్డి – లక్ష్మీనరసింహా రెడ్డి – ఆలూరి చిరంజీవిల నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.

తీర్పు :

సస్పెన్స్ కి కామెడీ తోదోతే ఆ ఫార్ములా సూపర్ హిట్ అనే కాన్సెప్ట్ తో కామెడీ – సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ సినిమా ఆడియన్స్ ని థియేటర్స్ లో నవ్వించడమే కాకుండా చివర్లో ఆడియన్స్ ని థ్రిల్ కూడా చేస్తుంది. ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకుంది ఇప్పుడు మన సొసైటీలో జరుగుతున్న హైటెక్ మోసం గురించి కాబట్టి ఈజీగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సినిమా పరంగా సీనియర్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్, ఇంటర్వల్ ముందు వచ్చే 30 నిమిషాల ఎపిసోడ్, సప్తగిరి ఎపిసోడ్, కమెడియన్స్ కామెడీ, క్లైమాక్స్ థ్రిల్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే కమర్షియాలిటీ కోసం పెట్టిన లవ్ ట్రాక్, ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ లలో సినిమా వేగం కాస్త స్లో అవ్వడం, అవసరం లేని పాటలు సినిమాకి మైనస్ పాయింట్స్. శ్రీనివాస్ ట్రై చేసిన కామెడీ బి, సి సెంటర్స్ లో బాగా వర్కౌట్ అవుతుంది. కొన్ని కొన్ని మైనస్ లను పక్కన పెడితే థియేటర్లో కాసేపు హాయిగా నవ్వుకొని, థ్రిల్స్ విషయంలో ఈ ట్విస్ట్ బాగుందే అనుకుంటూ బయటకి వచ్చే సినిమా ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు