
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూర్తి స్థాయి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించబడ్డ ఈ సినిమాకు ‘ఋషి’ సినిమా ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఉల్కా గుప్తా హీరోయిన్గా నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇక ఇదే నెల 25న ఆడియో ఆవిష్కరణ వేడుకను నిర్వహించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.
కాగా కేవలం కథ, కథనాల్లో మాత్రమే కాక ప్రేక్షకుడు అన్ని విషయాల్లోనూ కొత్తదనం కోరుకుంటున్నారన్న విషయాన్ని ఆంధ్రాపోరి టీమ్ గుర్తించినట్టు కనిపిస్తోంది. ఈ రోజు నుంచి ఆడియో రిలీజ్ రోజు వరకు వరుసగా ఒక్కోరోజు సినిమాకి సంబంధించిన ఒక్కో కాంటెస్ట్ పెడుతూ వారికి బహుమతులు ఇవ్వనుంది. ఆంధ్రాపోరి ఫేస్బుక్ పేజీలో ఈ కాంటెస్ట్ జరుగుతుంది. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన విజేతలకు సినిమా యూనిట్ ఆడియో రిలీజ్‌కు పాసులివ్వడంతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ సినిమాను మే 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.