సూపర్‌స్టార్ కృష్ణ 50 ఏళ్ళ సినీ ప్రయాణం..!

సూపర్‌స్టార్ కృష్ణ 50 ఏళ్ళ సినీ ప్రయాణం..!

Published on Mar 31, 2015 10:42 AM IST

Krishna
‘సూపర్‌స్టార్’ కృష్ణ.. తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఇలా చేపట్టిన అన్ని భాద్యతలనూ సమర్ధవంతంగా నిర్వహించి తనకంటూ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణను వెండితెరకు పరిచయం చేసిన సినిమా ‘తేనెమనసులు’ విడుదలై నేటికి 50ఏళ్ళు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్త వాళ్ళతో తీసిన ‘తేనెమనసులు’ మార్చి 31, 1965న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత కృష్ణ వెనుతిరిగే అవసరం లేకుండా వరుస చిత్రాలతో ముందు నటశేఖరుడిగా పిలవబడి ఆ తర్వాత సూపర్‌స్టార్‌గా ఎదిగారు. మొదటి కలర్ సినిమా, మొదటి సినిమా స్కోప్ సినిమా, మొదటి డీటీఎస్ సినిమా, జేమ్స్‌బాండ్ తరహా సినిమా, కౌబాయ్ తరహా సినిమా.. ఇలా తెలుగు సినిమా అంతకుముందెన్నడూ చూడని అద్భుతాలను చేసి చూపించారు కృష్ణ.

ఇప్పటివరకూ 350కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన, హీరోగా ఎక్కువ చిత్రాల్లో నటించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఒకే సినిమాకు దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా వ్యవహరించి ఆ సినిమాను సూపర్‌హిట్‌గా నిలపడం కృష్ణకే చెల్లింది. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్ళకు మోసగాడు, సింహాసనం, పండంటి కాపురం, సాక్షి వంటి పలు సినిమాలు కృష్ణ కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ సినిమాలు. కృష్ణ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన వారసులూ సినిమాల్లో రాణిస్తున్నారు. గతంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా కొన్ని చిత్రాల్లో మెరవగా, చిన్న కుమారుడు మహేష్ బాబు గురించైతే చెప్పే పనిలేదు. ఇప్పుడున్న స్టార్‌లలో నంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్నది మహేషే. తన సినిమాల ద్వారా కృష్ణ అందుకున్న స్టార్‌డమ్‌ని మహేష్ అతి తక్కువ కాలంలోనే అందుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

తన నట జీవితంలో ఎన్నో ప్రశంసలను, అవార్డులను అందుకున్న కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం తరపున పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. కళను నమ్మి బతికే ఓ కళాకారుడు తన జీవితంలో ఏ స్థాయికి చేరుకోగలడనేదానికి కృష్ణ జీవితమే ఓ ఉదాహరణ. సినిమా అనే కళను నమ్మిన వారికి అదే కల, జీవితమూ. కలను, జీవితాన్ని కలిపి కృష్ణ సృష్టించిన అద్భుతాలు సినిమా అనే కళ బ్రతికున్నంత కాలం సజీవంగా ఉంటాయి. నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణకు 123తెలుగు తరపున శుభాకాంక్షలు. ఇకముందు కూడా మనల్ని అలరించే చిత్రాల్లో నటించాలని కాంక్షిద్దాం.

తాజా వార్తలు